Assembly: రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు

ABN , First Publish Date - 2022-09-21T13:19:56+05:30 IST

రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు శాసనసభ సమావేశాలను నిర్వహించేందుకు తగు

Assembly: రెండో వారంలో అసెంబ్లీ సమావేశాలు

చెన్నై, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు అక్టోబర్‌ రెండో వారంలో ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు శాసనసభ సమావేశాలను నిర్వహించేందుకు తగు సన్నాహాలు చేపడుతున్నారు. ఈ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత(Former Chief Minister Jayalalithaa) మృతిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిటీ నివేదిక, తూత్తుకుడి కాల్పుల ఘటనపై విచారణ జరిపిన జస్టిస్‌ అరుణా జగదీశన్‌ నివేదికను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రవేశపెట్టనున్నారు. ఆ నివేదిక అంశాలపై ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలను ఆయన సభాముఖంగా ప్రకటించనున్నారు. విచారణ సంఘం నివేదికలను ప్రభుత్వం ఆమోదించటానికి, లేదా తిరస్కరించడానికి అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై చర్చ జరుగుతోంది. ఇక ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ చట్టాన్ని కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో జరిగిన స్మార్ట్‌ సిటీ నిర్మాణ పథకంలో జరిగిన భారీ అవినీతిపై జరిపిన విచారణ సంఘం నివేదిక కూడా శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాలు ఐదు రోజులపాటు జరుగుతాయని సచివాలయ అధికారులు చెబుతున్నారు.


ఓపీఎస్‌ పదవిపై నిర్ణయం...

ఈ సమావేశాల్లో అన్నాడీఎంకే నుంచి బహిష్కరించబడిన మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం (Former Chief Minister O. Panneerselvam) నిర్వర్తిస్తున్న ఆ పార్టీ సభాపక్ష ఉపనాయకుడి పదవిపై స్పీకర్‌ అప్పావు తన నిర్ణయాన్ని కూడా ప్రకటించే అవకాశముంది. ఇదివరకే ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌) స్పీకర్‌కు ఈ విషయమై ఓ లేఖ రాశారు. ఓపీఎస్‏ను అన్నాడీఎంకే నుంచి తొలగించడంతో ఆయనను ఏ పార్టీకి చెందని సభ్యుడిగా పరిగణించాలని, తన పక్కన కాకుండా మరో చోట సీటు కేటాయించాలని ఈపీఎస్‌ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై శాసనసభ సమావేశాలు జరిగే సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని స్పీకర్‌ అప్పావు ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-09-21T13:19:56+05:30 IST