గుట్టుచప్పుడు కాకుండా గుద్దేసుకుందామని..

ABN , First Publish Date - 2021-04-17T06:55:20+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల్లో దౌర్జన్యకర పద్దతులు అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురి కావడమెందుకనుకున్నారో ఏమోగానీ అధికార పార్టీ నేతలు దానికి భిన్నంగా చాపకింద నీరులా దొంగ ఓట్లు వేయించే వ్యూహమొకటి రూపొందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.

గుట్టుచప్పుడు కాకుండా గుద్దేసుకుందామని..

 తిరుపతి/చిత్తూరు ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికల్లో దౌర్జన్యకర పద్దతులు అనుసరించి కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహానికి గురి కావడమెందుకనుకున్నారో ఏమోగానీ అధికార పార్టీ నేతలు దానికి భిన్నంగా చాపకింద నీరులా దొంగ ఓట్లు వేయించే వ్యూహమొకటి రూపొందించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో వైసీపీ బలహీనంగా వున్నది తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే. అందుకే అధికార పార్టీ నేతలు ప్రధానంగా తిరుపతిపైనే దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది.ఈ సెగ్మెంట్‌లో తగినంత ఆధిక్యత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఆ పార్టీ నేతలు ఆశ్చర్యం కలిగించే పద్ధతిలో దొంగ ఓట్లు వేయించేందుకు యత్నిస్తున్నట్టు ప్రత్యర్థి పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అదేమిటంటే..... తిరుపతి సెగ్మెంట్‌ పరిధిలో ఇప్పటికే వలంటీర్లు ఇల్లిల్లూ తిరిగి ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. ఆ సందర్భంగా స్థానికంగా అందుబాటులో లేని ఓటర్లను గుర్తించారు. అలాంటి వారి స్లిప్పులు ఒకచోట చేర్చి వాటిని అధికార పార్టీ నేతలకు అప్పగించారు. నేతలు వాటిని కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్ళపల్లె, చిత్తూరు తదితర సెగ్మెంట్ల నేతలకు చేరవేశారు. ఓటరు స్లిప్పుల్లోని వివరాలకు అనుగుణంగా దొంగ ఓటర్లను ఎంపిక చేసి ఆయా ప్రాంతాల నుంచీబస్సుల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచీ శనివారం వేకువజాము లోపుగా తిరుపతికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు చిత్తూరు నుంచీ 22, కుప్పం నుంచీ 3, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, తంబళ్ళపల్లె తదితర సెగ్మెంట్ల నుంచీ 25 చొప్పున మొత్తం 50 ప్రైవేటు బస్సుల్లో వీరిని తరలిస్తున్నారు.చూసేందుకు తిరుమల వెళుతున్న యాత్రికుల తరహాలో వీరంతా శనివారం తెల్లవారుజామున తిరుపతికి చేరుకుంటారు. బస్సులు ఆగిన చోటు నుంచీ వారిని వైసీపీ ఛోటా నేతలు నిర్ణీత డివిజన్లకు తీసుకెళ్లి 6 గంటల కంతా క్యూ లైన్లలో నిలబెడతారు. పోలింగ్‌ మొదలు కాగానే తొలిగంటలోనే వీరంతా ఓట్లు వేసి వెనుదిరుగుతారు. పోలింగ్‌ తొలి గంటలో ఎవరూ పెద్దగా అనుమానించరని, దానికి తోడు వారి చేతుల్లో ఒరిజినల్‌ ఓటరు స్లిప్పులు వుండడం కూడా అనుకూలిస్తుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్టు ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బహిరంగంగా రిగ్గింగుకు లేదా ప్రత్యర్థి పార్టీల ఓటర్లను అడ్డుకునేందుకు యత్నిస్తే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళుతుంది కాబట్టి అధికార పార్టీ నేతలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారని ఇతర పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని పశ్చిమ ప్రాంత వైసీపీ నేతలు ఇప్పటికే తమ అనుచరులతో తిరుపతిలో మకాం వేశారని, శనివారం అనుచరులతో దొంగ ఓట్లు వేయించే వ్యూహంతో సిద్ధంగా వున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

 

మహిళా ఓటర్ల తరలింపు కోసం టార్గెట్లు

ఒక్కో గ్రూపు నుంచి ఇద్దరు రావాలి

 సాయిబాబా గ్రూపు సభ్యులందరికీ నమస్కారం. నేను ఆర్పీని మాట్లాడేది. 17వ తారీఖున తిరుపతిలో సీఎం ప్రోగ్రామ్‌ ఉంటుంది. మీ గ్రూప్‌లో నుంచి వయసులో ఉన్నవారు ఇద్దరు కచ్చితంగా రావాలి. ఎవరొస్తారనేది మీరే నిర్ణయించుకోండి. వచ్చేవాళ్ల పేరు, ఫోన్‌ నెంబరు మాకివ్వండి. తెల్లవారుజామున 5 గంటలకే బస్సు వస్తుంది. టిఫిన్‌, భోజనం వంటి అన్నిరకాల వసతులు చూసుకునే బాధ్యత ఆర్పీలదే.

- మూడు రోజుల కిందట చిత్తూరులో డ్వాక్రా మహిళలకు వాట్సప్‌ గ్రూప్‌లో వచ్చిన వాయిస్‌ మెసేజ్‌ ఇది.


బెనిఫిట్లు, పథకాలు వద్దా చెప్పండి

మీ గ్రూప్‌ నుంచి ఎవరొస్తారని అడిగాను. ఎవ్వరూ స్పందించలేదు.రాలేమంటే చెప్పేయండి. ప్రభుత్వ పరంగా వచ్చే అన్నిరకాల బెనిఫిట్లు, పథకాలు నిలిచిపోతాయంట. మీకు వచ్చే లోన్‌ మంజూరు చేయరంట. సరేనా. ఇది గోపీ సార్‌ చెప్పారు. రాలేమని తీర్మానం రాసి ఇచ్చేయండి. లోన్‌ మీకు వద్దా..? గ్రూప్‌లో పదిమందికి ఫోన్‌ చేసినా ఎవ్వరూ రామంటున్నారు. ఎవరో ఒకరు రావాలి కదా.? రాకపోతే ఎట్ల చెప్పండి. మాఫీ డబ్బులు కూడా వస్తాయి. అవి కూడా మీకే కదా వస్తాయి. రావాలి కదా మీరు. ఇంతవరకూ ఎవరూ ముందుకు రాలేదు. మిగతా గ్రూప్‌లలో ఈ పని అయిపోయింది.

- ఎవరూ స్పందించకపోవడంతో మళ్లీ శుక్రవారం మహిళలకు వెళ్లిన వాయిస్‌ మెసేజ్‌ ఇది.


    మహిళా దొంగ ఓట్ల కోసం డ్వాక్రా మహిళలపై దృష్టి పెట్టినట్టు సమాచారం. ఒక్కొక్కరికి రూ.వెయ్యితో పాటు భోజనం వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్టు చెబుతున్నారు. దొంగ ఓటర్ల తరలింపు కోసం వైసీపీ నేతలు ఛోటా నాయకులకు టార్గెట్లు పెడుతున్నట్టు సమాచారం. సర్పంచి 20 మందిని, ఉప సర్పంచి 10 మందిని, వార్డు సభ్యుడు 50 మందికి తగ్గకుండా తిరుపతికి పిలుచుకుని రావాలని ఒత్తిడి చేస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో ఛోటా నాయకులంతా గత నాలుగు రోజులుగా ఇదే పనిలో నిమగ్నమైనట్టు తెలిసింది. ఇప్పటికే జిల్లాలోని నియోజకవర్గ స్థాయి నేతలకు ఒక్కొక్కరికీ తిరుపతిలోని 6-7 డివిజన్లు చొప్పున అప్పగించినట్టు సమాచారం. దొంగ ఓటర్ల తరలింపునకు అధికార పార్టీ నేతలు ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాలు బుక్‌ చేసుకునేయడంతో జిల్లాలో ఇతరులకు ఎక్కడా ప్రైవేటు వాహనాలు దొరికే పరిస్థితి లేదు. ప్రైవేటు ఆపరేటర్లు ఎవరిని కదిపినా తిరుపతి బాడుగకు వెళ్తున్నామన్న సమాధానమే వస్తోందంటున్నారు.

Updated Date - 2021-04-17T06:55:20+05:30 IST