జిల్లాలో పనిభారంతో పరేషాన్‌ అవుతున్న కార్యదర్శులు

ABN , First Publish Date - 2021-04-22T04:58:31+05:30 IST

పంచాయతీ కార్యదర్శులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిర్ధిష్టమైన పని గంటలు లేక రాత్రింబవళ్లు శ్రమించాల్సి వస్తోంది.

జిల్లాలో పనిభారంతో పరేషాన్‌ అవుతున్న కార్యదర్శులు
బెజ్జూరులోని గ్రామ పంచాయతీ భవనం

  - ఈజీఎస్‌ విధులతో సతమతం

  - అధికారులు, ప్రజాప్రతిధుల నుంచి ఒత్తిళ్లు

  - ఎవరికీ పట్టని పంచాయతీ కార్యదర్శుల గోడు

బెజ్జూరు, ఏప్రిల్‌ 21: పంచాయతీ కార్యదర్శులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిర్ధిష్టమైన పని గంటలు లేక రాత్రింబవళ్లు శ్రమించాల్సి వస్తోంది. పాలనాపరంగా ఏ చిన్న పొరపాటు జరిగినా కార్యదర్శులే బలవుతున్నారు. పనిభారంతో కార్యదర్శులు మానసిక ఒత్తిడులకు గురవుతున్నారు. తట్టుకోలేక ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల పనిభారం ఎక్కువగా ఉంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా తమపై ప్రభుత్వానికి ఎలాంటి కనికరం లేదని వాపోతున్నారు.

ఈజీఎస్‌ భారం..

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 332మంది కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇంకా రెండు ఖాళీలు ఉన్నాయి. కార్యదర్శులపై ఈజీఎస్‌ అమలు తీవ్రభారంగా మారింది. ఫీల్డ్‌ అసిస్టెంట్లను తొలగించిన తర్వాత వారి విధులను కూడా కార్యదర్శులే చేస్తున్నారు. గ్రామాల్లో ఉపాధిహామీ పనులు గుర్తించడం, కూలీలకు పనులు కల్పించడం, హాజరును నమోదు చేయడం, కూలీ డబ్బులు చెల్లించడం, జాబ్‌ కార్డులను జారీ చేయడం తదితర పనులన్నీ వీరే చేయాల్సి వస్తోంది. రోజంతా ఈ పనులతోనే సరిపోతోంది. తమ అసలు జాబ్‌ చార్ట్‌ను పక్కన పెట్టాల్సి వస్తోంది. ఉపాధి పనుల్లో ఫీల్డ్‌ అసిస్టెంట్లు అవినీతికి పాల్పడుతున్నారన్న కారణంతో వారిని తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమి చేయకుండా మొత్తం బాధ్యతను కార్యదర్శులపై నెట్టేయడం వల్ల పని ఒత్తిడి పెరిగి పోయింది. ఈజీఎస్‌ పనుల నిర్వహణలో తమకు ఒక సహాయకుడిని అలాగే ఈజీఎస్‌ వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయడానికి ఒక కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఇవ్వాలని కార్యదర్శులు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

సెలవులు లేవు..

మహిళా పంచాయతీ కార్యదర్శులకు ప్రసూతి సెలవులు లేవు. సెలవు పెడితే వేతనంలో కోత పడుతోంది. ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యదర్శుల్లో 50శాతం మహిళలే ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులతో సమానంగా తమకు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రసూతి సెలవులు పెట్టినా ఉన్నతాధికారులు అంగీకరించడం లేదు. పంచాయతీ పరిధిలో నిర్వర్తించాల్సిన పనులకు ఆటంకం కలుగుతోంది. మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వకపోతే ఎలా అంటూ కార్యదర్శులు ప్రశ్నిస్తున్నారు. ఇటు సెలవులు లేక అటు ఉద్యోగం మానుకోలేక కార్యదర్శులు సతమతమవుతున్నారు. 

పారిశుధ్యం పనుల బాధ్యత..

గ్రామాల్లో పారిశుధ్య పరిరక్షణ బాధ్యత కూడా పంచాయతీ కార్యదర్శులతో నిర్వహిస్తున్నారు. ప్రతి 500జనాభాకు ఒక పారిశుధ్య కార్మికుడిని ఇచ్చారు. ఇది ఏమాత్రం సరిపోవడం లేదు. పన్నులు వసూలు చేయడం, వీధి దీపాల నిర్వహణ చేడటంతోపాటు ఇతర అనేక పనులను చూడాల్సి రావడంతో పారిశుధ్య పనులకు ఆటంకం కలుగుతోంది. పారిశుధ్య కార్మికులకు ఇచ్చే వేతనం కూడా నెలకు రూ.8500మాత్రమే. ప్రతీ ఐదు వందల జనాభాకు కనీసం ముగ్గురు కార్మికులనైనా నియమించాలని కోరుతున్నారు. 

యాప్‌ల గోల..

గ్రామీణ పంచాయతీల పనితీరు మెరుగుపర్చడం, మానిటరింగ్‌కు పంచాయతీరాజ్‌శాఖ రూపొందించిన రెండు మోబైల్‌ యాప్‌లు పంచాయతీ కార్యదర్శులను ఇబ్బంది పెడుతున్నాయి. రోజువారి పనుల రిపోర్టులు అప్‌లోడ్‌ చేసే సమయంలో యాప్‌లు సరిగా పనిచేయడం లేదని పేర్కొంటున్నారు. రోజు అప్‌డేట్‌ యాప్‌ అని వస్తోందని కార్యదర్శులు వాపోతున్నారు. డ్యూటీలో చేరినప్పటి నుంచి పని ఒత్తిడితో ఇబ్బందులు పడుతుంటే యాప్‌లు వచ్చిన తర్వాత మరింత ఒత్తిడి పెరిగిందని కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది నవంబరులో పల్లెప్రగతి, పీఎస్‌యాప్‌, పల్లెప్రగతి-పర్యవేక్షణ అధికారి యాప్‌లను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో వివిధ పనుల వివరాలు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. యాప్‌లో పంచాయతీ కార్యదర్శులు పంపిన డేటా ఇన్‌స్పెక్షన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తారు. ఎంపీవో, డీఎల్‌పీవో, డీపీవో ఇన్‌స్పెక్షన్‌ చేస్తారు. యాప్‌లలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని, రిపోర్టులు అప్‌లోడ్‌ చేయకుంటే పనితీరు సరిగా లేదని అధికారులు మండిపడుతుంటారని కార్యదర్శులు వాపోతున్నారు. గతంలో పనిభారం తప్పించాలని మండలకేంద్రాల్లో కార్యదర్శులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా తమ సమస్యలను పట్టించుకోలేదని కార్యదర్శులు వాపోతున్నారు. ఇంత పనిభారం ఉన్నా అదనంగా ఉపాధిహామీ పథకం పనులు తమకు అప్పగించడంతో మరింత పనిభారం పెరిగిందన్నారు.

ప్రభుత్వం చెప్పిన పని చేయాల్సిందే..

- రమేష్‌, జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో పనిచేస్తున్న కార్యదర్శులు ప్రభుత్వం చెప్పిన పని చేయాల్సిందే. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమాన్నీ ప్రజలకు వివరిస్తూ సంక్షేమఫలాలు అందించేలా చూడాలి. హరితహారం, మొక్కల సంరక్షణ, ఉపాధిహామీ వంటి పథకాల్లో పాల్గొని ప్రజలకు అందుబాటులో ఉండాలి. తదుపరి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందేవరకు అన్ని పనులు చేయాలి. లేకుంటే కఠిన చర్యలు తప్పవు.

Updated Date - 2021-04-22T04:58:31+05:30 IST