గోరంట్ల వైసీపీలో వర్గ విభేదాలు

ABN , First Publish Date - 2022-07-07T05:37:07+05:30 IST

పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి.

గోరంట్ల వైసీపీలో వర్గ విభేదాలు
వేదికపై కూర్చున సర్పంచ భర్త నాగేనాయక్‌

ఉద్యోగుల వీడ్కోలు సభలో బహిర్గతం

వేదికపై ఆశీనులైన సర్పంచ భర్త

వేదిక కిందే ఉప సర్పంచ రాజారెడ్డి

సభా మర్యాదలు తెలీవా? అంటూ అసహనం


గోరంట్ల, జూలై 6: పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో అంతర్గత విభేదాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు అహోరాత్రులు కష్టపడిన కార్యకర్తలు, దిగువశ్రేణి నాయకులకు ఏమాత్రం గుర్తింపు లేకుండా పోతోంది. పైగా అవమానాలను సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. తాజాగా గోరంట్ల మండలంలో సైతం వైసీపీ ఆధిపత్యధోరణి బట్టబయలైంది. బుధవారం పట్టణంలోని ఎస్‌ఎల్‌ఎన ఫంక్షనహాల్‌లో తహసీల్దార్‌, ఎంపీడీఓలతో పాటు బదిలీ అయిన ఇతర అధికారులకు సత్కార కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో గోరంట్ల ఉప సర్పంచ రాజారెడ్డి తీవ్ర అసంతృప్తి, అసహనాన్ని వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ రంగనాయకులు, ఎంపీడీఓ రఘునాథ్‌గుప్తతోపాటు బదిలీ అయిన రామాంజినేయరెడ్డి, ఈఓఆర్డీ, అంజినప్ప, పలువురు అధికారులు, కార్యదర్శులు వేదికపై ఆశీనులయ్యారు. వారితోపాటు ఎంపీపీ ప్రమీల, జడ్పీటీసీ పాలేజయరాంనాయక్‌, వైసీపీ నాయకులు ఎమ్మెల్యే సోదరుడు మల్లికార్జున, వేణుగోపాల్‌రెడ్డి, పోతుల రామకృష్ణారెడ్డి, నాగేనాయక్‌, లక్ష్మీనరసప్ప, మేదరశంకర సభావేదికపై కూర్చున్నారు. అయితే ఉప సర్పంచ రాజారెడ్డిని వేదికపై ఆహ్వానించకుండా సర్పంచ సరోజ భర్త నాగేనాయక్‌ను కూర్చోబెట్టడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకదశలో ఆయన సభ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా వైసీపీ నాయకుడు రఘురాంరెడ్డి, సర్దిచెప్పి బలవంతంగా కూర్చొబెట్టారు. అనంతరం వేదికపైకి రావాలని ఉపసర్పంచ రాజారెడ్డిని ఆహ్వానించారు. అయితే ఆయన మాత్రం వేదికపైకి వెళ్లకుండా కిందనుంచే సభా మర్యాదలు, గౌరవాలను తెలుసుకోవాలని సూచించారు. ఎవరు స్టేజిపైకి రావాలో, ఎవరురాకూడదో తెలుసుకుని సభాహక్కులను కాపాడాలని రాజారెడ్డి నిరసన వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు. 




Updated Date - 2022-07-07T05:37:07+05:30 IST