వివాదాస్పద స్థలంలో 145 సెక్షన్‌

ABN , First Publish Date - 2022-06-28T06:26:56+05:30 IST

పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో రూ.50కోట్ల విలువచేసే సర్వేనెం 191స్థలం మరోసారి వివాదాస్పదంగా మా రింది.దీంతో ఈ స్థలంలోకి ఎవ్వరూ వెళ్లకుండా 145సెక్షన్‌ విధిస్తూ తహసీల్దార్‌ జయశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సర్వే నెంబర్‌ 191లోని స్థలానికి సంబంధించి మొత్తం 11 మంది వ్యక్తుల మధ్య వివాదం నడుస్తోంది.

వివాదాస్పద స్థలంలో 145 సెక్షన్‌
హుజూర్‌నగర్‌లోని సర్వేనంబర్‌ 191లోని వివాదాస్పద స్థలం

ఉత్తర్వులు జారీచేసిన తహసీల్దార్‌

 

హుజూర్‌నగర్‌, జూన్‌ 27: పట్టణంలోని కొత్తబస్టాండ్‌ సమీపంలో రూ.50కోట్ల విలువచేసే సర్వేనెం 191స్థలం మరోసారి వివాదాస్పదంగా మా రింది.దీంతో ఈ స్థలంలోకి ఎవ్వరూ వెళ్లకుండా 145సెక్షన్‌ విధిస్తూ తహసీల్దార్‌ జయశ్రీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. సర్వే నెంబర్‌ 191లోని స్థలానికి సంబంధించి మొత్తం 11 మంది వ్యక్తుల మధ్య వివాదం నడుస్తోంది. గుండా శ్రీనివా్‌సతో పాటు జెయిని నారాయణ కుటుంబ సభ్యులు, విడియాల వెంకటనర్సయ్య కుటుంబ సభ్యులతో పాటు దొంతగాని శ్రీనివాస్‌, కోటిరెడ్డి, వీరమ్మ, బొల్లం శివకుమార్‌, గోపిరెడ్డి, రామమల్లు, వీరమ్మల మధ్య వివాదం ఉంది. కాగా, ఇటీవల టీఆర్‌ఎస్‌ నాయకు లు దొంతగాని శ్రీనివాస్‌, ముడెం గోపిరెడ్డితో పాటు వారి అనుచరులు ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని చెబుతూ స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. దీంతో రైస్‌మిల్లర్‌ ఆర్యవైశ్య సంఘం నాయకులు గుండా శ్రీనివాస్‌, ఆ యన కుటుంబ సభ్యులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కాగా టీఆర్‌ఎస్‌ నాయకులు తన స్థలాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎస్పీ,కలెక్టర్‌కు గతంలోనే గుండా శ్రీనివాస్‌ ఫిర్యాదు చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ నాయకులు శ్రీనివాస్‌,గోపిరెడ్డి సైతం ఈ స్థలాన్ని కొనుగోలు చేశామని, స్వాధీనం చేసుకుండా అడ్డుపడుతున్నారని పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఇరువర్గాల పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసుల సూచనలమేరకు 145 సెక్షన్‌ విధిస్తున్నట్టు తహసీల్దార్‌ ప్రకటించారు. భూసర్వేకు గుండా శ్రీనివాస్‌ తహసీల్దార్‌ను కోరగా, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే 145 సెక్షన్‌ విధించడం చర్చనీయాంశంగా మారింది.

వివాదం ఇదీ..

మామిడి కనకయ్య కుటుంబ సభ్యుల నుంచి 1965లో సర్వేనెంబర్‌ 191లోని సుమారు 3.10ఎకరాల స్థలాన్ని గుండా శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు, పులిచింతల వెంకట్‌రెడ్డి, పోతుగంటి రామ్మూర్తి కుటుంబసభ్యులు కొనుగోలు చేశారు. ప్రస్తుతం వారి వారసుల ఆక్రమణలో స్థలం ఉంది. కొన్నేళ్లుగా ఈ స్థలానికి సంబంధించి ఎలాంటి భాగా పంపిణీ జరగలేదు. కాగా, ఇటీవల మామిడి రామమల్లు నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు దొంతగాని శ్రీనివాస్‌, ముడెం గోపిరెడ్డి, మరికొంతమంది అధికార పార్టీ నాయకులు ఈ సర్వేనెంబర్‌లోని సుమారు 1.10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెబుతుండగా, ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. అధికారపార్టీలో ఉన్న నాయకులు, వారి అనుచరులతో కలిసి ఈనెల 9వ తేదీన రాత్రి స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా వివాదం చెలరేగింది. ఈ వివాదం అధికార పార్టీ నాయకులది చెందినది కావడంతో సమస్య తీవ్ర రూపం దాల్చింది. పోలీసులు, రెవెన్యూ ఉన్నతాధికారులకు పరస్పర ఫిర్యాదులు, చివరికి 145 సెక్షన్‌ విధించే వరకు పరిస్థితి వెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా, ఎవ్వరైనా ఆ స్థలంలోకి వెళ్లేందుకు యత్నిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ హెచ్చరించారు.

Updated Date - 2022-06-28T06:26:56+05:30 IST