
తిరువనంతపురం: ఆల్కహాల్ వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని కేరళ ఎక్సైజ్ మంత్రి ఎం.వి.గోవిందన్ ఆదివారంనాడు అన్నారు. ఇదే సమయంలో యువజన, విద్యార్థి సంస్థలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిల్లో చాలామంది తాగుబోతులున్నారని అన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, డ్రగ్స్, ఆల్కహాల్ వినియోగంపై పోరాటానికి ఉన్న మార్గాల్లో ఒక మార్గం ప్రజల్లో చైతన్యం తీసుకురావడమని అన్నారు. ఈ బాధ్యత యువత తీసుకోవాలన్నారు. అయితే, రాష్ట్రంలో వివిధ యువజన సంస్థల్లోని విద్యార్థుల్లో చాలా మంది తాగుడుకు అలవాటు పడినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మనం చిత్తశుద్ధితో కృషి చేయాల్సి ఉంటుందని, రాబోయే తరాలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ప్రొఫెషనల్ సంస్థలతో సహా, హైయర్ సెకండరీ, హైస్కూల్, కాలేజీ విద్యార్థులను మరింత చైతన్యవంతులను చేయాలని సూచించారు.
ఇవి కూడా చదవండి