రేపు, ఎల్లుండి లష్కర్‌ జాతర

ABN , First Publish Date - 2021-07-24T06:36:29+05:30 IST

బోనాల జాతరకు

రేపు, ఎల్లుండి లష్కర్‌ జాతర

సికింద్రాబాద్‌/రాంగోపాల్‌పేట్‌, జూలై 23(ఆంధ్రజ్యోతి): బోనాల జాతరకు లష్కర్‌ సిద్ధమైంది. ఈ నెల 25 (ఆదివారం)న బోనాలు, 26(సోమవారం)న రంగం (భవిష్యవాణి) జరగనున్నాయి. కొవిడ్‌ కారణంగా గతేడాది సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారికి బోనాలు సమర్పించలేదని నిరాశ చెందిన భక్తులకు ఈ ఏడాది ఆ అవకాశం లభించనుంది. బోనాలకు అశేష సంఖ్యలో తరలివచ్చే భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రభుత్వం, దేవాదాయశాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశారు. ఆదివారం తెల్లవారుజామున 4.00 గంటలకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, కుటుంబ సమేతంగా మొదటి హారతి, పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉత్సవాలను ప్రారంభిస్తారు. 4.45 నుంచి భక్తులను అనుమతించనున్నారు. వీవీఐపీలు, ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులు రోడ్లు, పారిశుధ్య నిర్వహణ, వీధి దీపాలను మెరుగుపరిచారు. అత్యవసర పరిస్థితుల్లో వినియోగించడానికి విద్యుత్‌ శాఖ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ను సిద్ధం చేశారు. పోలీసులు, పేలుడు పదార్థాల నిపుణులు జాగిలాలతో పలు దఫాలుగా ఆలయం, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్‌ అవాంతరాలు లేకుండా చేస్తున్నారు. ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తలసాని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డిప్యూటీ స్పీకర్‌ తీగుళ్ల పద్మారావుగౌడ్‌తో కలిసి అన్ని శాఖల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. శుక్రవారం దేవాలయ పరిసర ప్రాంతాల్లో జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను వివిధ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.


ముఖ్యమంత్రి పూజలు

ఈ నెల 25న ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి అమ్మవారి దర్శనానికి రానున్నట్లు ఆలయ ఈవో గుత్తా మనోహర్‌ రెడ్డి తెలిపారు. 26న ఉదయం రంగం, అంబారీపై ఊరేగింపు ఉంటాయన్నారు. 


 కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడం 

కొవిడ్‌తో గతేడాది బోనాలను ఘనంగా జరుపుకోలేకపోయాం. ఈ సంవత్సరం జరుపుకునే అవకాశం వచ్చింది. భక్తులు కొవిడ్‌ జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. భక్తులకు స్వాగతం పలికేందుకు మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ వద్ద, జేమ్స్‌ స్ట్రీట్‌ పాత పోలీస్‌ స్టేషన్‌ వద్ద, బాటా పక్కన, మొత్తం ఆరు ఆర్చి గేట్లు ఏర్పాటు చేశాం. మహాకాళి ఆలయం తోపాటు చుట్టు పక్కల ఆలయాల పరిసరాల్లో 3,100 ప్రత్యేక లైట్లు ఏర్పాటు చేశాం. మహాకాళి ఆలయం షెడ్డు కింద ఎల్‌ఈడీ లైట్లతో కోల్‌కత్తా డెకరేషన్‌ ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. భక్తులను ఆకట్టుకునేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద, అంజలి టాకీస్‌ వీధిలో త్రీడీ మ్యాపింగ్‌ ఏర్పాటు చేశాం. 

- తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌


లాల్‌దర్వాజ బోనాలు ప్రారంభం 

చాంద్రాయణగుట్ట, జూలై 23 (ఆంధ్రజ్యోతి) : పాతబస్తీ లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి 113వ వార్షిక బోనాల ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కమిటీ అధ్యక్షుడు వెంకటేశ్‌ ఆధ్వర్యంలో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, దక్షిణ మండలం డీసీపీ గజారావు భూపాల్‌ ప్రత్యేక పూజ, శిఖర పూజ, ధ్వజారోహణ కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాలు ఆగస్టు 2న అమ్మవారి ఊరేగింపుతో ముగుస్తాయని నిర్వాహకులు తెలిపారు. 

తొలి బోనం సమర్పణ

ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ మాణిక్‌ప్రభుగౌడ్‌ దంపతులు అమ్మవారికి తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. నార్కెట్‌పల్లి వరలక్ష్మి, ఆమె కుమారులు శైలేష్‌ కుమార్‌, మహేశ్‌, సురేశ్‌, రమేశ్‌, అనిల్‌కుమార్‌ 30 తులాల వెండితో పాదాలను తయారు చేయించి అమ్మవారికి సమర్పించారు. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఈవో అన్నపూర్ణ పాతబస్తీలోని దేవాలయాలను సందర్శించారు. 

మేయర్‌ పూజలు

హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో 73వ బోనాల ఉత్సవాలను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ప్రారంభించారు. సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు జి.రాజారత్నం ఆధ్వర్యంలో శుక్రవారం ధ్వజారోహణ, కలశ స్థాపనతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉప్పుగూడ మహంకాళి ఉత్సవాలను ఆలయ కమిటీ అధ్యక్షుడు జె.మధుసూదన్‌గౌడ్‌, గౌలిపురా శ్రీ మహంకాళి మాతేశ్వరి భారతమాత ఆలయంలో కమిటీ అధ్యక్షుడు ఎస్‌.మల్లేషం గౌడ్‌, బేలా మాతేశ్వరి ముత్యాలమ్మ ఆలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు సదానంద్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆయా కార్యక్రమాల్లో కార్యక్రమంలో ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు బి.బల్వంత్‌ యాదవ్‌, ఉపాధ్యక్షుడు కె.ఎస్‌ ఆనంద్‌రావు, ఆలయ కమిటీ ప్రతినిధులు బంగ్లా రాజు యాదవ్‌, అరవింద్‌ కుమార్‌ గౌడ్‌, మాణిక్‌ప్రభుగౌడ్‌, జె.లక్ష్మీనారాయణ గౌడ్‌, విష్ణుగౌడ్‌, కాశీనాథ్‌గౌడ్‌, సి.వెంకటేశ్‌ యాదవ్‌, సీరా రాజ్‌కుమార్‌, మారుతి యాదవ్‌, పోసాని సదానంద్‌ ముదిరాజ్‌, దూసరి నర్సింగ్‌ గౌడ్‌. కె.సురేశ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-24T06:36:29+05:30 IST