మహాకాళీ కాపాడు తల్లీ..!

ABN , First Publish Date - 2021-07-26T06:12:15+05:30 IST

బోనాల జాతరతో

మహాకాళీ  కాపాడు తల్లీ..!

ఘనంగా లష్కర్‌ జాతర

మొక్కులు చెల్లించుకున్న భక్తులు

మూడో వేవ్‌ ముప్పు తప్పించాలని పూజలు


సికింద్రాబాద్‌ మహాకాళి అమ్మవారి బోనాల జాతర సందడిగా సాగింది. బోనాలతో లష్కర్‌లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అంతా శుభం చేకూర్చాలంటూ మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి బోనాలు, సాక సమర్పించారు. కరోనా మూడో దశ ముప్పు నుంచి నగరాన్ని కాపాడాలని పలువురు కోరుకున్నారు. ఉదయం 11.30 వరకు పలచగా కనిపించిన క్యూ లైన్లు, ఆ తర్వాత ఒక్కసారిగా నిండిపోయాయి. 

సికింద్రాబాద్‌, రాంగోపాల్‌పేట్‌, పద్మారావునగర్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : బోనాల జాతరతో తెల్లవారుజాము నుంచే లష్కర్‌లో పండుగ వాతావరణం ఏర్పడింది. 4.00 గంటల సమయంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, సువర్ణ దంపతులు కుటుంబ సమేతంగా బంగారు బోనంతో ఆలయానికి తరలివచ్చారు. శాస్త్రోక్తంగా తొలి పూజ చేశారు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. కొవిడ్‌ మహమ్మారి త్వరగా అంతరించాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. తలసాని సాయికిరణ్‌యాదవ్‌, మాజీ కార్పొరేటర్‌ అత్తెల్లి అరుణశ్రీనివాస్‌గౌడ్‌ తదితరులు వెంట ఉన్నారు. అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించారు. సికింద్రాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. 


తప్పని ఇక్కట్లు

మునుపెన్నడూ లేని విధంగా ఉజ్జయినీ మహాకాళి ఆలయానికి దారి తీసే మార్గాలను చాలా దూరం నుంచే మూసివేయడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పలు వీధుల్లోంచి భక్తులు, సాధారణ ప్రజానీకం ఆలయం చుట్టుపక్కలకు రావడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడింది. గతంలో కనీసం మహంకాళి పోలీస్‌ స్టేషన్‌ వరకు రావడానికి భక్తులకు అవకాశం ఉండేది. ఈ సంవత్సరం జేమ్స్‌స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేసి క్యూలో మాత్రమే భక్తులను అనుమతించారు. అన్ని గల్లీల్లోనూ బారీకేడ్లు నిర్మించారు. ఆలయానికి చేరుకునేందుకు భక్తులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మరోవైపు వీఐపీల రాకతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ, ఎంపీ సంతోష్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ ఎం.అంజన్‌కుమార్‌యాదవ్‌ల వెంట పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు రావడంతో పోలీసులను వారిని అడ్డుకునేందుకు యత్నించారు. వారు పోలీసులను తోసివేసుకుంటూ రేవంత్‌రెడ్డి వెంట ఆలయ గేటు వరకు వెళ్లారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంయ్‌ వెంట కూడా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దాంతో సామాన్య భక్తులకు తిప్పలు తప్పలేదు. 


ఉప సభాపతి ఇంట్లో బోనాల వేడుక.. పాల్గొన్న సీఎం సతీమణి

రెజిమెంటల్‌బజార్‌, జూలై 25(ఆంధ్రజ్యోతి): ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్‌ నివాసంలో జరిగిన బోనాల వేడుకలకు ముఖ్యమంత్రి సతీమణి కల్వకుంట్ల శోభతో పాటు మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, పార్లమెంట్‌ సభ్యులు జోగినపల్లి సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ పాల్గొన్నారు. ముత్యాలమ్మ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆనంతరం పద్మారావు నివాసంలో విందు చేశారు. 


ఆకర్షణీయంగా ఫలహార బండ్ల ఊరేగింపు 

సికింద్రాబాద్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి): బోనాల జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శివసత్తుల, పోతరాజుల విన్యాసాలు, ఫలహార బండ్ల ఊరేగింపు భక్తజనాన్ని అలరించాయి. ఆదివారం రాత్రి లష్కర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చిన ఫలహార బండ్లను చూసేందుకు జనం రోడ్లకు ఇరువైపులా బారులు తీరారు. 

మాస్కు ఓకే.. భౌతికదూరం కష్టమే..

లష్కర్‌ బోనాల జాతరలో కొవిడ్‌ నిబంధనల అమలు మెరుగ్గా ఉందని హర్షం వ్యక్తమైంది. భక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, లేకపోతే దర్శనానికి అనుమతించేది లేదని అధికారులు ముందుగా చేసిన ప్రకటనలు సత్ఫలితాలనిచ్చాయి. మాస్కులు పంపిణీ చేయడం, శానిటైజర్లు అందుబాటులో ఉంచడం గమనార్హం. భౌతిక దూరం మాత్రం కనిపించ లేదు. 


జగదాంబిక అమ్మవారికి ఐదో పూజ

లంగర్‌హౌస్‌, జూలై 25 (ఆంధ్రజ్యోతి) : బోనాల సందర్భంగా గోల్కొండ శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారి ఐదో పూజ ఆదివారం ఘనంగా జరిగింది. భక్తులు తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు కోటకు తరలివచ్చారు. ఆలయ మెట్లకు బొట్లు, బోనాల సమర్పణతో మొక్కులను తీర్చుకున్నారు. తొట్టెలు సమర్పించారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని సాక సమర్పించారు. 


Updated Date - 2021-07-26T06:12:15+05:30 IST