అంతా మంత్రి తలసాని కనుసన్నల్లోనే...

ABN , First Publish Date - 2020-09-23T14:01:34+05:30 IST

టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణపై సహచర సభ్యులు మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం

అంతా మంత్రి తలసాని కనుసన్నల్లోనే...

సికింద్రాబాద్‌(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు ఉపాధ్యక్షుడు జె.రామకృష్ణపై సహచర సభ్యులు మంగళవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఫలితంగా రామకృష్ణ పదవి నుంచి దిగిపోవలసి వచ్చింది. కంటోన్మెంట్‌ చట్టం 2006 ప్రకారం నూతన ఉపాధ్యక్షుడి ఎన్నికను మరో నాలుగు రోజుల తర్వాత నిర్వహించనున్నారు. ఉదయం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డ్డు కార్యాలయం ఆవరణలోని డిఫెన్స్‌ ఎస్టేట్‌ ఆఫీసులో బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్‌ అభిజిత్‌చంద్ర అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి రామకృష్ణతో పాటు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాదా కేశవరెడ్డి, బి.అనితప్రభాకర్‌, పి.నళినీకిరణ్‌, కె.పాండుయాదవ్‌, ప్యారసాని భాగ్యశ్రీ, లోకనాథం, సీఈఓ అజిత్‌రెడ్డి హాజరయ్యారు. రామకృష్ణపై సోమవారం ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై చర్చ జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి అవసరమైన ఆరుగురు సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దాంతో అవిశ్వాస తీర్మానంనెగ్గినట్టయింది.


మంత్రి తలసాని కనుసన్నల్లోనే

గడిచిన కొద్ది సంవత్సరాలుగా సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌పై పట్టు సాధిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కనుసన్నల్లోనే అవిశ్వాస తీర్మానం కూడా కొనసాగింది. అప్పట్లో కంటోన్మెంట్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున నలుగురు మాత్రమే గెలిచారు. దాంతో స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించిన రామకృష్ణను టీఆర్‌ఎస్‌ గూటికి చేర్చడంలో తలసాని కీలక భూమిక పోషించారు. అనంతరం కేశవరెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి, తాజాగా రామకృష్ణపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం వరకు తలసానిని సంప్రదించిన తర్వాతనే మిగతా సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.


మంత్రులు, శాసనసభ్యుడి ఆదేశం మేరకు...

మంత్రులు తలసాని, మల్లారెడ్డి, శాసనసభ్యుడు సాయన్న, టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి లోక్‌సభ నియోజకర్గం ఇన్‌చార్జి మర్రి రాజశేఖరరెడ్డి ఆదేశాల మేరకు తాము కంటోన్మెంట్‌ అభివృద్ధికి పాటు పడతామని జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాదా కేశవరెడ్డి, బి.అనితప్రభాకర్‌, పి.నళినికిరణ్‌, కె.పాండుయాదవ్‌, లోకనాథం చెప్పారు. వారందరి సూచనల మేరకు తాము అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించామని, పార్టీ క్రమశిక్షణకు ఇదో నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నిధులు తీసుకువస్తామని తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా పార్టీకి రాజీనామా చేసిన రామకృష్ణకు గుణపాఠం చెప్పామని అన్నారు.

Updated Date - 2020-09-23T14:01:34+05:30 IST