స్టేషన్‎లో హై టెన్షన్

ABN , First Publish Date - 2022-06-18T18:04:08+05:30 IST

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగిన ఆందోళనతో నగరంలో

స్టేషన్‎లో హై టెన్షన్

సికింద్రాబాద్‌లో ఉద్రిక్తత

నాంపల్లి రైల్వేస్టేషన్‌కు తాళం

పిల్లాపాపలతో ప్రయాణికుల పాట్లు

ప్రైవేటు వాహనాలు, ఆటోవాలాల దోపిడీ


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ కొనసాగిన ఆందోళనతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైల్వేస్టేషన్‌లో అప్పటి వరకూ రైళ్ల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఎగిసిపడ్డ ‘అగ్ని’ జ్వాలతో భీతిల్లిపోయారు. భయంతో బయటకు పరుగులు తీశారు. ఇంతలో పోలీసుల రాక.. కాల్పులతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఆందోళనకారులు స్టేషన్‌లో ఆవరణలోని స్టాళ్లు, డిస్‌ప్లే బోర్డులు ధ్వంసం చేయడంతో పాటు పార్శిల్‌లో వచ్చిన 40 వాహనాలు, ఇతర సామగ్రిని దహనం చేశారు. ఈ ఉదంతం నగర ప్రయాణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. లోకల్‌ రైళ్లు, మెట్రో రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 


హైదరాబాద్/మంగళ్‌హాట్‌/మౌలాలి/కుషాయిగూడ/బర్కత్‌పుర/చాదర్‌ఘాట్‌: అగ్నిపథ్‌ను నిరసిస్తూ చేపట్టిన ఆందోళన రైళ్లు, ఎంఎంటీఎస్‌, మెట్రో ప్రయాణికుల పై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని రైల్వేస్టేషన్లను శుక్రవారం ఉదయం మూసివేయగా, మరికొన్నింటిని సాయం త్రం పునరుద్ధరించారు. సాయంత్రం వరకూ నగరంలోని స్టేషన్లను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. నాం పల్లి రైల్వేస్టేషన్‌కు మధ్యాహ్నం తాళం వేశారు. హౌరా, సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉదయం 10 గంటలకు మౌలాలి రైల్వే స్టేషన్‌లో ఆపేశారు. స్టేషన్‌ నుంచి లాలాపేట బస్టాప్‌ వరకు 3, 4 కిలోమీటర్ల దూరం పిల్లలతో, లగేజీతో నడుచుకుంటూ వెళ్లి ప్రత్యామ్నాయాలను చూసుకోవడానికి ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. 


చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి వెనక్కి..

శబరి, పద్మావతి తదితర రైళ్లను సాయంత్రం రీ-షెడ్యూల్‌ చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నుంచి వెనక్కి మళ్లించారు. అయితే రైల్వే అధికారులు, సిబ్బంది మధ్య సమన్వయలోపంతో ప్రయాణికులకు ముందస్తు సమాచారం కొరవడింది. ఏ రైలు ఏ ప్లాట్‌ఫారంపై ఉందో తెలియక అటు, ఇటు పరుగులు తీశారు. 


కాచిగూడ నుంచి యధావిధిగా..

కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే యధావిధిగా నడిపించింది. దీంతో ఆ స్టేషన్‌పై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. స్టేషన్‌ వద్ద మూడు ప్లాటూన్ల పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే అనుమతించారు. జాయింట్‌ సీపీ భూపాల్‌రావు బందోబస్తును పర్యవేక్షించారు. కాగా, ఆందోళనల నేపథ్యంలో మలక్‌పేట, బేగంపేటతో పాటు పలు రైల్వే స్టేషన్లు బోసిపోయాయి. 42 ఎంఎంటీఎస్‌లు రద్దయ్యాయి. 

రైళ్లు, ఎంఎంటీఎస్‌లు, మెట్రో లేకపోవడం, శివార్లలో రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ప్రైవేట్‌ వాహనాలను ఆశ్రయించారు. వారు రెట్టింపు ధరలు వసూలు చేసినట్లు ప్రయాణి కులు ఆందోళన వ్యక్తం చేశారు. పలువురు ప్రయా ణికులు రైళ్ల కోసం రైల్వేస్టేషన్‌ పరిసరా ల్లోనే పడిగాపులు కాస్తున్నారు.

Updated Date - 2022-06-18T18:04:08+05:30 IST