Kuwait: కువైత్‌లో సెక్యూరిటీ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. భారత ప్రవాసుడు అరెస్ట్

ABN , First Publish Date - 2022-09-22T16:05:20+05:30 IST

గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రవాసుల (Expats)పై ఉక్కుపాదం మోపుతోంది.

Kuwait: కువైత్‌లో సెక్యూరిటీ అధికారుల ఆకస్మిక తనిఖీలు.. భారత ప్రవాసుడు అరెస్ట్

కువైత్ సిటీ: గల్ఫ్ దేశం కువైత్ (Kuwait) గత కొంతకాలంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న ప్రవాసుల (Expats)పై ఉక్కుపాదం మోపుతోంది. పోలీసు విభాగంతో కలిసి అంతర్గత శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తోంది. ప్రధానంగా వలసదారులు నివాసం ఉండే ప్రాంతాల్లో క్రమం తప్పకుండా సోదాలు జరుగుతున్నాయి. రెసిడెన్సీ ఉల్లంఘనలతో పాటు ఇతర నేరాలకు పాల్పడే ప్రవాసులను గుర్తించి జరిమానాలు విధించడంతో పాటు వెంటనే వారిని దేశం నుంచి బహిష్కరించడం జరుగుతోంది. ఇదే కోవలో తాజాగా సాల్మియా (Salmiya) ప్రాంతంలో సెక్యూరిటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 


ఈ సోదాల్లో పలువురు నివాస చట్టం ఉల్లంఘనదారులతో పాటు ఓ భారత ప్రవాసుడిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో భారత వ్యక్తి వద్ద స్థానికంగా తయారు చేసిన 35 మద్యం సీసాలు దొరికినట్లు అధికారులు తెలిపారు. దాంతో భారత ప్రవాసుడిని సెక్యూరిటీ అధికారులు అరెస్ట్ చేసి తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారుల వద్దకు పంపించారు. ఇక తనిఖీల్లో చట్ట విరుద్ధంగా దేశంలో ఉంటున్నవారు భారీ సంఖ్యలో పట్టుబడినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఆకస్మిక తనిఖీల్లో ఎడ్యుకేషన్ సెక్టార్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్, మేజర్ జనరల్ షేక్ ఫవాజ్ అల్-ఖాలీద్, అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ జనరల్ ఖలీద్ మహమూద్ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-22T16:05:20+05:30 IST