రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి

ABN , First Publish Date - 2022-09-29T06:46:05+05:30 IST

రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడ నుంచి తానాం వెళ్లే ప్రధాన రహదారిలోని స్థానిక ఊరచెరువు సమీపంలో జరిగి ఈ ఘటనకు సంబంధించి సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాలివి.

రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి
సత్యనారాయణ (ఫైల్‌)

పరవాడ, సెప్టెంబరు 28 : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పరవాడ నుంచి తానాం వెళ్లే ప్రధాన రహదారిలోని స్థానిక ఊరచెరువు సమీపంలో జరిగి ఈ ఘటనకు సంబంధించి సీఐ ఈశ్వరరావు తెలిపిన వివరాలివి. గొర్లివానిపాలెం పంచాయతీ పరిధి జేన్‌ఎన్‌ఎన్‌యూఆర్‌ కాలనీలో మడుతూరి సత్యనారాయణ (60) కుటుంబంతో నివాసముంటున్నాడు. ఫార్మాసిటీలోని ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. మంగళవారం ఎ-షిఫ్ట్‌ విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయల్దేరాడు. పరవాడ ఊర చెరువు సమీపానికి వెళ్లే సరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం  బలంగా ఢీకొనడంతో కింద పడ్డాడు. తీవ్ర గాయాలకు గురైన అతనిని కేజీహెచ్‌కు తరలించగా, అదే రోజు రాత్రి మృతి చెందాడు.  ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 


ప్రమాదవశాత్తూ చెరువులో పడి వ్యక్తి మృతి

గొలుగొండ, సెప్టెంబరు 28: ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒక వ్యక్తి మృతి చెందినట్టు ఎస్‌ఐ నారాయణరావు తెలిపారు. ఎస్‌ఐ అందించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో చీడిగుమ్మలలో చింతల వెంకటేష్‌(45) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం పశువులు కాస్తుండగా కాలుజారి చెరువులో పడి మృతి చెందినట్టు స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి తమకు సమాచారం అందించారన్నారు. 


‘తాండవ’లో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

పాయకరావుపేట రూరల్‌, సెప్టెంబరు 28 : మండలంలోని పెదరాంభద్రపురం వద్ద తాండవ నదిలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు.  ఇందుకు సంబంధించి పాయకరావుపేట పోలీసులు తెలిపిన వివరాలివి. పెదరాంభద్రపురం గ్రామానికి చెందిన పప్పుల రమణమ్మ ఈ నెల 23వ తేదీన చనిపోయింది. ఆమె మృతదేహానికి శ్మశానవాటికలో నిర్వహించిన దహనసంస్కరణలకు హాజరైన అదేగ్రామానికి చెందిన ఆచంట సూర్య నారాయణ  స్నానం చేసేందుకు తాండవ నదిలోకి దిగి నీటిలో మునిగి పోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అతని కోసం గాలించారు. చివరకు బుధవారం ఉదయం మండలంలోని పెంటకోట, రాజవరం గ్రామాల మధ్య తాండవ నది ఒడ్డున శవమై కనిపించాడు. మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ గోవిందరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.


పరవాడ గండివారి వీధిలో చోరీ

 ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరణ

 రంగంలోకి క్లూస్‌ టీమ్‌.... స్థానికుల పాత్రపై అనుమానం

పరవాడ, సెప్టెంబరు 28 : మండల కేంద్రమైన పరవాడ గండివారి వీధిలో గల ఓ ఇంట్లో చోరి జరిగింది. బీరువా లాకర్‌లో ఉన్న ఐదున్నర తులాల బంగారు ఆభరణాలను అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పరవాడకు చెందిన శేశెట్టి గణపతి పైడిరాజు టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి బీసీ కాలనీలో ఉంటున్న అత్తవారింటికి వెళ్లాడు. బుధవారం ఉదయం పైడిరాజు భార్య దేవి ఇంటికి వచ్చేసరికి ప్రధాన ద్వారం తాళం గడియ విరగ్గొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా, బెడ్‌ రూమ్‌లో ఉన్న బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువా లాకర్‌ను తెరిచి చూడగా అందులో ఉన్న ఐదున్నర తులాల బంగారు వస్తువులు కనిపించలేదు.  బాధితులు తాళాలను బెడ్‌ రూమ్‌లో గల ఒక బ్యాగ్‌లో పెట్టి బీసీ కాలనీ వెళ్లారు. దొంగలు తెలివిగా బ్యాగ్‌ తీసి అందులో ఉన్న తాళాలతో బీరువా లాకర్‌ను తెరిచి తమ పనిని సులభంగా ముగించారు. అనంతరం తాళాలను యథావిధిగా వేసి బ్యాగ్‌లో పెట్టి జారుకున్నారు. చోరీ జరిగిన తీరును చూస్తే స్థానికులే ఈ పనికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. సీఐ ఈశ్వరరావు సిబ్బందితో ఆ ఇంటిని పరిశీలించారు. క్లూస్‌ టీం రంగంలోకి దిగి వివరాలు సేకరించే పనిలో ఉంది.

Updated Date - 2022-09-29T06:46:05+05:30 IST