ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో Shimla రైల్వేస్టేషన్‌లో భారీభద్రత

ABN , First Publish Date - 2021-11-23T14:55:20+05:30 IST

హిమాచల్ ప్రదేశ్ అధికారులు సిమ్లా హెరిటేజ్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు...

ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో Shimla రైల్వేస్టేషన్‌లో భారీభద్రత

 సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ అధికారులు సిమ్లా హెరిటేజ్ రైల్వే స్టేషన్ వద్ద పోలీసు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో సిమ్లా రైల్వేస్టేషన్ వద్ద హైఅలర్ట్ ప్రకటించారు.సిమ్లా రైల్వే స్టేషన్‌తో సహా దేవాలయాలపై దాడి చేస్తామని ఈ నెల ప్రారంభంలో ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఉగ్రవాద కార్యకలాపాలను నివారించేందుకు వీలుగా రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేశారు.సిమ్లా రైల్వే స్టేషన్‌లో వివిధ రైల్వే శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి స్టేషన్‌లో భద్రతా చర్యలను పటిష్ఠం చేశామని సిమ్లా రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్ జోగీందర్ సింగ్ తెలిపారు.


‘‘గవర్నమెంట్ రైల్వే పోలీస్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో సహా మా భద్రతా బలగాలు ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నాయి. సమావేశంలో పెట్రోలింగ్‌ను మెరుగుపర్చాలని నిర్ణయించాము. ప్రజలకు అవగాహన కల్పించాలని కూడా నిర్ణయించుకున్నాం’’. అని సింగ్ చెప్పారు.సిమ్లా హెరిటేజ్ రైల్వే స్టేషన్‌లో మోహరించిన స్థానిక పోలీసులను ప్రతి రైలు వచ్చే సమయంలో స్టేషన్‌లో ప్రయాణికులు, లగేజీని తనిఖీ చేయాలని ఆదేశించారు. కల్కా-సిమ్లా రైళ్ల ద్వారా ఇక్కడికి వచ్చే ప్రయాణికులు రైలులో ప్రయాణించడం సురక్షితంగా భావిస్తుంటారు. భారతీయ రైల్వేలలోని కల్కా-సిమ్లా రైల్వే విభాగం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది. వారసత్వ హోదా ఉన్న 2 అడుగుల 6 అంగుళాల న్యారో-గేజ్ లైన్‌లో ఉన్న టాయ్ రైలు దేశీయ, విదేశీ పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తుంది.


Updated Date - 2021-11-23T14:55:20+05:30 IST