నారు నాణ్యమేనా.!

ABN , First Publish Date - 2021-10-30T06:27:11+05:30 IST

పెట్టుబడి ఎక్కువైనా, మిగతా వాటితో పోలిస్తే వాణిజ్య పంట అయిన మిర్చి సాగుకు సాధక బాధకాలు ఎక్కువగా ఉన్నా జిల్లాలోని రైతాంగం దాని వైపు అధికంగా మొగ్గు చూపుతోంది.

నారు నాణ్యమేనా.!

నర్సరీల్లో అమ్మే మిరపనారు నాణ్యతపై సందేహాలు

గడువు కన్నా ముందుగానే వినియోగంలోకి..

జిల్లాలో 135కుపైగా నర్సరీలు

కొరవడిన ప్రభుత్వ పర్యవేక్షణ 

నష్టపోతున్న రైతులు 

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 29 : పెట్టుబడి ఎక్కువైనా, మిగతా వాటితో పోలిస్తే వాణిజ్య పంట అయిన మిర్చి సాగుకు సాధక బాధకాలు ఎక్కువగా ఉన్నా జిల్లాలోని రైతాంగం దాని వైపు అధికంగా మొగ్గు చూపుతోంది. కాలం కలిసొచ్చి దిగుబడులు ఆశాజనకంగా లభించి, మార్కెట్‌లో అధిక ధర దక్కితే తమ కష్టాలు కడతేరతాయనే ఆశ వారిని మిర్చివైపు పరుగులు తీయిస్తోంది. అయితే ఆదిలోనే హంసపాదు అన్నతీరుగా నారు దశలోనే రైతాంగం మోసానికి గురవుతోంది. జిల్లాలోని రైతులు నర్సరీల్లో మిరపనారు కొనుక్కొని సాగు చేస్తుంటారు.  ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఏమీ లేకపోవడంతో జిల్లాలో నర్సరీలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకొచ్చాయి. లాభాపేక్షతో గడువుకన్నా ముందుగానే మిరపనారును తీయడం కోసం రసాయన మందుల వాడకాన్ని చేపడుతున్నారనే ఆరోపణలు నర్సరీల యాజమాన్యాలపై ఉన్నాయి. నర్సరీల్లో నారు కొనే రైతులు వాటి గడువుతోపాటు విత్తనాల రకాలను వారు చేపట్టే రిజిస్టర్లు కూడా పరిశీలించి కొనుక్కోవాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది.


45 రోజుల గడువు...

మామూలుగా నారు పెంచడానికి 45రోజుల వ్యవధిని నర్సరీలు తీసుకుంటాయి. కానీ కొన్ని రకాల రసాయనాలను పిచికారీ చేసి వాటిని 25 రోజుల వ్యవధిలోనే అందుబాటులోకి తెస్తున్నారు. జిల్లాలో ఉన్న నర్సరీల్లో చాలా వరకు గడువు నిబంధన పాటిస్తున్నప్పటికీ ఇటీవల కాలంలో లాభాపేక్షతో ఈ రంగంలోకి వచ్చిన వారు తక్కువ వ్యవధిలోనే నారును తీసి రైతులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా పర్చూరు సమీప ప్రాంతాల్లోనే ఉన్నట్లు సమాచారం. ముందుగా నారు తీయడం వల్ల వాటికి వ్యాధి నిరోధక శక్తి కూడా తక్కువగా ఉంటుంది. ఇందువల్ల రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరగడంతోపాటు దిగుబడులపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.


ఏటికేడు పెరుగుతున్న మిర్చిసాగు

జిల్లాలో ఏటా మిర్చి సాగులో గణనీయంగా పురోగతి కనపడుతోంది. గతేడాది దాదాపు 1,10,000 ఎకరాల్లో మిర్చి సాగైంది. సాధారణ విస్తీర్ణం కన్నా ఇది 14వేల ఎకరాలు అధికం. ప్రస్తుత ఏడాది ఇది దాదాపు 1,30,000 ఎకరాలకు చేరే అవకాశం ఉందని జిల్లా ఉద్యానశాఖ అంచనా వేస్తోంది. ఇప్పటికే చాలావరకు నాట్లు వేసేశారు. రబీలోనూ వేసేవారు ఉన్నారు. మిర్చికి మార్కెట్‌లో అధిక ధర పలకడంతోపాటు, బ్యాంకులు వాణిజ్య పంటలకు ఇచ్చే రుణ పరిమితి కూడా మిగతా పంటలతో పోలిస్తే ఎక్కువగా ఉండడంతో మిర్చిసాగును చేపట్టే రైతులు ఏటా పెరుగుతున్నారు. 


రైతులే విత్తనాలు తెచ్చుకుని..

చాలామంది రైతులు తామే విత్తనాలు కొనుక్కొచ్చుకుని నర్సరీల ద్వారా నారు పెంచుకుంటారు. ఇలాంటి వారికి పెద్దగా ఇబ్బంది ఉండదు. నిత్యం రైతులే వాటిని పర్యవేక్షించుకుంటారు. కేవలం నర్సరీలకు నిర్వహణ ఖర్చుల కింద మొక్కకి 40 పైసల నుంచి 50 పైసల దాకా చెల్లిస్తూ ఉంటారు. ఎప్పటినుంచో ఉన్న నర్సరీలు చాలావరకు విత్తనాలు వేసిన దగ్గర నుంచి నారు తీసేదాకా పూర్తి వివరాలతో నిర్వహించే రిజిస్టర్‌ను రైతాంగానికి అందుబాటులో ఉంచుతాయి. కానీ ఇటీవల ఈ రంగంలోకి అవగాహన లేకుండా అడుగుపెట్టిన నర్సరీల నిర్వాహకులు రైతులను నిలువునా వంచిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


ప్రభుత్వ పర్యవేక్షణ కరువు 

నర్సరీల నిర్వహణ కోసం ప్రభుత్వం వైపు నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు కానీ పర్యవేక్షణ కానీ లేదు. రెండేళ్లక్రితం వరకు వీటి సంఖ్య జిల్లావ్యాప్తంగా 50కి లోపే. ప్రస్తుతం అవి 135కు పైగా చేరినట్లు  అంచనా. సహజంగా పెరగాల్సిన నారును రసాయన పద్ధతుల ద్వారా పెంచేందుకు నర్సరీల యాజమాన్యం మొగ్గుచూపుతోంది. వాటిని కొనుక్కున్న రైతాంగం తర్వాత ఇక్కట్ల పాలవుతోంది. ఇలా కొన్న నారు కారణంగానే గతేడాది మిర్చి రైతులు భారీగా నష్టపోయారు. రకరకాల తెగుళ్లతోపాటు మధ్యలో మొక్క గిడసబారిపోవడం కూడా జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం వీటి నిర్వహణ తీరుతెన్నులపైనా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది.


Updated Date - 2021-10-30T06:27:11+05:30 IST