కష్టాల సాగు!

ABN , First Publish Date - 2021-06-14T03:41:45+05:30 IST

కష్టాల సాగు!

కష్టాల సాగు!

- అన్నదాతను వెంటాడుతున్న విత్తన కష్టాలు

- ప్రభుత్వ సబ్సిడీపై కానరాని ఆసక్తి 

- దిగుబడి తగ్గడం, మద్దతు దక్కకపోవడమే కారణం

- ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న వైనం

(పాలకొండ)

ఖరీఫ్‌ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు విత్తనాల కష్టాలు వెంటాడుతున్నాయి. సాగుకు అవసరమైన విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గత మూడేళ్లుగా కొత్త రకం విత్తనాలు వేయాలని అధికారులు హడావుడి చేస్తున్నారు.  అలాంటివి సాగు చేస్తే.. ధాన్యం విక్రయించే సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. మిల్లర్లు కొత్త రకం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై అందజేసే విత్తనాలను సాగు చేస్తే దిగుబడి తగ్గి.. విక్రయాల సమయంలో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో విత్తనాల కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నామని పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి జిల్లా వాతావరణానికి అనుకూలమైన, నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. 

కష్టాల సాగులో రైతులు కొట్టుమిట్లాడుతున్నారు. ఖరీఫ్‌ సమీపిస్తున్న వేళ.. వరి విత్తనాల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 2.10 లక్షల హెక్టార్లలో వరిసాగు చేయనున్నారు. ఇందుకోసం 77.200 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు గుర్తించారు. ఇప్పటికే జిల్లాలో రైతు భరోసా కేంద్రాల్లో ఎంటీయూ 7029 స్వర్ణ రకం, ఎంటీయూ 1121 శ్రీధుతి రకం,  ఎంటీయూ 61 ఇంద్ర, బీపీటీ 3299, సోనామసూరి, సాంబమసూరి,  ఎంటీయూ-1064 రకం, 1224 మాటూరు సాంబ తదితర రకాలను అందుబాటులో ఉంచారు. రైతులు వీటిని కొనుగోలు చేయకుండా, ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. గత ఏడాది జిల్లాలో అధిక మొత్తంలో  ఎంటీయూ 1121 రకాన్ని రైతులు  సాగు చేశారు.  మిల్లర్లు వివిధ సాకులు చూపి.. దీని మద్దతు ధర తగ్గించేశారు. తాజాగా జిల్లాలో సుమారు 17 వేల క్వింటాళ్లు ఈ రకాన్నే పంపిణీ చేసేందుకు వ్యవసాయాధికారులు చర్యలు చేపట్టారు. కానీ గత ఏడాది అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది 1121 రకం విత్తనాలు వేసేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు.  ఎంటీయూ 7029 స్వర్ణరకం కూడా సాగు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. ఈ విత్తనాలపై వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడం.. మిల్లర్లు కూడా ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడమే ఇందుకు కారణం. 


1001 అనుకూలమైనా..

జిల్లాలో గతంలో 60 శాతానికిపైగా 1001 రకం విత్తనాలను రైతులు సాగు చేశారు. ఈ రకాన్ని నిలిపివేయడంతో ప్రభుత్వం అందించే నూతన వంగడాలపై రైతులు దృష్టి సారించారు. వాటిలో ప్రధానంగా 1075, 1010, 1156, 1153 రకాలు ఉన్నాయి. వీటిని ఒక ఏడాది సాగు చేయగా, రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. మిల్లర్లు ఈ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో ప్రభుత్వం ఈ విత్తనాల సరఫరాను నిలిపివేసింది. వీటిని వేయరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రైతులు సాగు చేయడం లేదు. వాస్తవానికి 1075, 1010, 1156, 1153 రకాలు జిల్లాలో సాగుకు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం మధ్యస్త సన్నరకం బియ్యాలను అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న నేపఽథ్యంలో ఈ రకాలను పక్కన పెట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. 


‘సంపద’పైనే ఆసక్తి

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేస్తున్న వరి విత్తనాలు.. జిల్లాలో సాగుకు అనుకూలంగా ఉండడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలను కొనుగోలు చేస్తున్నారు. ఐదారేళ్లుగా నూజివీడు సీడ్‌కు చెందిన సంపద రకం విత్తనాలను సాగు చేస్తున్నారు. ఈ విత్తనం నాణ్యతతో పాటు 30 బస్తాల దిగుబడి వస్తుంది. మిల్లర్లు కూడా ఈ ధాన్యం కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఈ ఏడాది జిల్లాలో అధిక శాతం రైతులు సంపద  రకం విత్తనాల సాగుపైనే దృష్టి సారించారు. వీటిని ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేయకపోవడంతో ప్రైవేటు డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న వివిధ రకాలైన వరి వంగడాలు 30 కేజీలు, 20 కేజీలు లభ్యమవుతున్నాయి. వీటి ధర సుమారు రూ.900 వరకు పలుకుతోంది. సంపద రకం వంగడాలు 20 కేజీలు రూ.1400 వరకు ప్రైవేటు డీలర్లు విక్రయిస్తున్నారు. దిగుబడి నేపథ్యంలో అధిక ధర చెల్లించి రైతులు వీటిని కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి.. జిల్లాలో వ్యవసాయ భూములకు అనుకూలంగా ఉండే విత్తనాల పంపిణీకి  చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 


మిల్లర్లు కొనుగోలు చేయడం లేదు 

రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించే వరి విత్తనాలను రైతులు సాగు చేస్తున్నారు. ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు ఏటా నష్టపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 1121 రకానికి అదే పరిస్థితి ఉంది. ఈ రకం విత్తనాలను గత ఏడాది అధిక మొత్తంలో సాగు చేయగా.. రైతులకు కనీస మద్దతు ధర దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలను కొనుగోలు చేసేందుకు రైతులు వెనుకంజ వేస్తున్నారు. 

- ఖండాపు ప్రసాదరావు, జిల్లా అభ్యుదయ రైతు


నాణ్యమైనవి సరఫరా చేయాలి

గత మూడేళ్లుగా రైతులు నాణ్యమైన విత్తనాలు అందక ఇబ్బందులకు గురవుతున్నారు. ఏటా రెండు మూడు రకాల విత్తనాలను సాగు చేయాలని అధికారులు చెబుతున్నారు. వాటిని పండించగా.. ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మిల్లర్లు ముందుకు రావడం లేదు. దీనిపై అధ్యయనం చేసి.. జిల్లాలో వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన, నాణ్యమైన విత్తనాలను సరఫరా చేయాలి.

- గంగరాపు సింహాచలం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి


స్వర్ణ, 1121 రకాలకు ప్రాధాన్యం 

జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్‌కు ఎంటీయూ 7029 స్వర్ణ రకం 24 వేల క్వింటాళ్లు, ఎంటీయూ 1121 శ్రీధుతి 17వేల క్వింటాళ్లు సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాం. సాంబ 12 వేలు, ఇంద్ర 1061, 1064 తదితర వాటిని అందుబాటులో ఉంచాం. వీటితో పాటు మరికొన్ని సన్న రకాలను సిద్ధం చేశాం. ఈ రకాలు జిల్లాలో వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి. మిల్లర్లకు కూడా ఇటీవల సమావేశం ఏర్పాటు చేసి 1121 రకాన్ని విధిగా కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. రైతులకు అవసరమైన ఎరువులను కూడా పూర్తిస్థాయిలో సరఫరా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. 

- కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ


గిరిజనులకు దక్కని ‘రాయితీ’ 

సీతంపేట : సీతంపేట ఐటీడీఏ పరిధిలోని ఏడు  గిరిజన ఉప ప్రణాళిక(టీఎస్పీ)  మండలాల్లో గిరిజన రైతులు సబ్సిడీ విత్తనాల కోసం పాట్లుపడుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇక్కడ రైతుభరోసా కేంద్రాల్లో 90 శాతం సబ్సిడీపై వరి విత్తనాలను  పంపిణీ చేయాల్సిఉంది. కానీ వ్యవసాయశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాయితీ విత్తనాలు తమకు అందడం లేదని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సీతంపేట మండలంలో ఆరు వేల ఎకరాల్లో వరి సాగు చేయనుండగా, కేవలం 600 క్వింటాళ్లు రాయితీ విత్తనాలు మంజూరు చేశారు. తొలివిడతగా 250 క్వింటాళ్లు విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మండలంలో 31 రైతుభరోసా కేంద్రాలు ఉన్నాయి. కేవలం ముత్యాలు, దిబ్బగూడ, పెద్దూరు, సోమగండి, పెదరామ, కోసంగిలోని రైతుభరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన ప్రాంతాల్లో విత్తనాలు పంపిణీ చేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. రైతుభరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా విత్తనాలు పంపిణీ చేయలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.  గిరిజన రైతులకు సరిపడా విత్తనాల పంపిణీకి  చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ ఏడీ రాజగోపాల్‌ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

 

ఎరువుల కొరత తీరేనా?

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఖరీఫ్‌ సీజన్‌లో ఎరువుల కొరత లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించారు. జిల్లాకు 1,14,500 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని గుర్తించారు. యూరియా 45,000 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 16,500, మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ 9,000, మిశ్రమ రకాలు(కాంప్లెక్స్‌) 35,000, ఎస్‌ఎస్‌పీ 9,000 మెట్రిక్‌ టన్నులు కావాలని ప్రతిపాదించారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన రసాయన ఎరువులను మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుభరోసా కేంద్రాలకు రవాణా చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 820, పట్టణాల్లో 18 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో కనీసం 5 మెట్రిక్‌ టన్నుల ఎరువులు నిల్వ చేసేలా చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆర్బీకేలను ఇకపై మూడు విభాగాలుగా (ఏ, బీ, సీ కేటగిరీలుగా) విభజించనున్నారు. వాటి ఆధారంగా ఆ ప్రాంత్రాల్లో ఉన్న భూమి, సాగయ్యే విస్తీర్ణం, ఏ పంటలు ఎక్కువగా సాగు చేస్తారు. మెట్ట, మాగాణి, వ్యవసాయ పైర్లు, ఉద్యాన తోటలు ఎంత విస్తీర్ణంలో పండిస్తున్నారని అధికారులు పరిశీలిస్తారు. వర్షాధారం, జల వనరులపై ఆధారపడి సాగవుతున్న వివరాలు సేకరించనున్నారు. వీటి ఆధారంగా రైతులకు అవసరమైన ఎరువులు పంపిణీ చేయనున్నారు. అధికారుల చర్యలు ఎంతమేరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాలి. ఇదిలా ఉండగా, జిల్లాలో కొన్నిచోట్ల కియోస్క్‌ యంత్రాలు లేవు. మరికొన్ని చోట్ల యంత్రాలు ఉన్నా సాంకేతిక, అంతర్జాల సమస్యతో పని చేయడం లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-06-14T03:41:45+05:30 IST