ఈ మాస్క్‌లు మొక్కలవుతాయి

ABN , First Publish Date - 2021-04-28T05:30:00+05:30 IST

కరోనా దెబ్బకు కొత్తగా వచ్చిన సమస్య గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న మాస్క్‌లు. ఇళ్లు, వీధుల్లోని చెత్తబుట్టలే కాదు... సముద్రాలు, పర్యాటక ప్రాంతాలన్నీ వీటితో కలుషితమవుతున్నాయి.

ఈ మాస్క్‌లు మొక్కలవుతాయి

కరోనా దెబ్బకు కొత్తగా వచ్చిన సమస్య గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్న మాస్క్‌లు. ఇళ్లు, వీధుల్లోని చెత్తబుట్టలే కాదు... సముద్రాలు, పర్యాటక ప్రాంతాలన్నీ వీటితో కలుషితమవుతున్నాయి. మరి దీనికి పరిష్కారం? ఈ ఆలోచనే ‘సీడ్‌ మాస్క్‌’ల ఆవిష్కరణ వైపు అడుగులు వేయించింది కర్ణాటక యువకుడు నితిన్‌ వాస్‌ని. ఇందులో ప్రత్యేకత ఏంటో తెలుసా..! వాడి పడేసిన మాస్క్‌లు మొక్కలవుతాయి! ఎలా? 


నితిన్‌ వాస్‌... ‘పేపర్‌ సీడ్‌ కంపెనీ’ వ్యస్థాపకుడు. సామాజిక కార్యకర్త. లాభార్జనే ధ్యేయంగా కాకుండా... సమాజ హితం కోసం వ్యాపారం చేస్తాడు అతడు. కర్ణాటక రాష్ట్రం... మంగళూరు సమీపంలోని మారుమూల గ్రామం పక్షికెరెలో నితిన్‌ నివాసం. ‘పేపర్‌ సీడ్‌ కంపెనీ’ సామాజిక హితం కోసం పని చేసే సంస్థ. విత్తనాలతో కూడిన ఆహ్వాన, కరపత్రాలు, విజిటింగ్‌ కార్డ్స్‌, నోట్‌ప్యాడ్స్‌ వంటివి అందులో తయారవుతాయి. స్థానికంగా చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించింది. అలాంటి సంస్థ కరోనా కాలంలో ఆర్థిక వనరులు లేక అవస్థలు పడింది. కానీ నితిన్‌ షట్టర్‌ దించలేదు. ఉన్నంతలో నెట్టుకొస్తూ... సాధ్యమైనంత మందికి పని ఇచ్చాడు. అతడిలోని సామాజిక కోణమే తాజాగా మరో వినూత్న ఆవిష్కరణకు నాంది పలికింది. అదే ఎకో ఫ్రెండ్లీ మాస్క్‌. 


పర్యావరణాన్నీ పట్టించుకోవాలి... 

‘‘మనం ఎప్పుడూ మన రక్షణ గురించే ఆలోచిస్తుంటాం. కానీ ఇతర జీవాలు, పర్యావరణం గురించి పట్టించుకోము. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే! కరోనా వచ్చినప్పటి నుంచి మాస్క్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా ఎక్కడ చూసినా వాడి పడేసిన సర్జికల్‌ మాస్క్‌లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తున్నాయి. ఈ వ్యర్థాలు ప్రపంచానికి మరో తలనొప్పిగా మారాయి. దీని పరిష్కారానికి నా వంతుగా ఏంచేయగలను? వీధులు, ఇతర ప్రాంతాల్లో పేరుకుపోతున్న మాస్క్‌లను తొలగించాలనుకున్నాను. వెంటనే దాని కోసం ఒక ప్రత్యేక డ్రైవ్‌ మొదలుపెట్టాం. దిగిన తరువాత కానీ లోతు తెలియలేదు. తొలగించిన కొద్దీ వ్యర్ణాలు వస్తూనే ఉన్నాయి. వేరే మార్గం కనుగొనాలి. ఏమిటదని ఆలోచిస్తున్నప్పుడు ‘సీడ్‌ మాస్క్‌’ తట్టింది’’ అంటూ చెప్పుకొచ్చాడు నితన్‌ వాస్‌. 


ఇదీ ప్రత్యేకత... 

సీడ్‌ మాస్క్‌లు పూర్తిగా పర్యావరణ హితమైనవి... సురక్షితమైనవి. వివిధ వస్త్ర పరిశ్రమల నుంచి సేకరించిన పనికిరాని కాటన్‌ గుడ్డ ముక్కలను రీసైక్లింగ్‌ చేసి, ఈ మాస్క్‌ తయారు చేస్తారు. ఒక లేయర్‌లో తులసితో పాటు తమోటా తదితర కాయగూరల విత్తనాలు ఉంటాయి. మాస్క్‌ వాడిన తరువాత మట్టిలో పడేసి, కొద్దిగా నీళ్లు పోస్తే అందులోని విత్తనాలు మొలకెత్తుతాయంటాడు నితిన్‌. వాటికి ఉపయోగించిన దారాలు కూడా ఇట్టే భూమిలో కలిసిపోతాయి. వైరస్‌ నుంచి కూడా రక్షిస్తాయి. ఒక మాస్క్‌ ధర రూ.25. 


‘‘పేపర్‌ సీడ్స్‌ ఉత్పత్తులు మాకు కొత్తేమీ కాదు. మట్టిలో పడేస్తే మొలకలెత్తే ఆహ్వాన పత్రికల వంటివి రూపొందించాం. అదే తరహాలో మాస్క్‌లు ఎందుకు చేయకూడదనిపించింది. ప్రయోగాత్మకంగా ముందు కొన్ని తయారు చేశాం. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి’’ అంటున్న నితిన్‌... దీని ద్వారా ఇప్పుడు చాలామందికి ఉపాధి చూపించాడు. 


లాభార్జన లేకుండా... 

ఒక్కసారికి మాత్రమే ఉపయోగపడే మాస్క్‌ను పాతిక రూపాయలు పెట్టి ఎవరు కొంటారని అడిగితే... ‘‘ఇందులో నాకు పెద్దగా మిగలదు. దీని తయారీకి అయ్యే ఖర్చు ఎక్కువ. మా వద్ద పెద్ద పెద్ద మిషన్లు లేవు. అంతా చేత్తోనే చేయాలి. పైగా ఇందులో విత్తనాలు ఉండడంవల్ల ఒక్కసారే పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయడం కుదరదు. ఒకవేళ అమ్ముడు పోకపోతే కొంత కాలం తరువాత అవి ఎందుకూ పనికిరావు. అందుకే మేము సామర్య్థానికి మించి ఆర్డర్లు తీసుకోవడం లేదు. తొలుత పల్ప్‌ షీట్స్‌ చేయడానికి ఎనిమిది గంటలు పడుతుంది. ఆ తరువాత 12 గంటలు ఆరబెట్టాలి. వాటిని చేత్తో కత్తిరించి, మాస్క్‌లు కుట్టాలి. ఎంతో శ్రమతో కూడుకున్నది. ఇవన్నీ లెక్కేసుకొంటే మేం నిర్ణయించిన ధర సమంజసమే’’ అంటాడు అతడు. సీడ్‌ మాస్క్‌లు ఊహించనదాని కంటే ఎన్నో రెట్లు ఆదరణ పొందాయి. ధర ఎక్కువైనా అందులోని కాన్సెప్ట్‌ నచ్చి కొనేవారు అధికమయ్యారు. డిమాండ్‌ కూడా విపరీతంగా పెరిగింది. అయితే ఈసారి చాలా జాగ్రత్తపడుతున్నాడు నితిన్‌. భారీ లాభాలు ఊహించుకొని లాట్లు పేర్చడంలేదు. మూడు వేల మాస్క్‌లకు మించిన ఆర్డర్లు అంగీకరించడంలేదు. అదికూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచే!  


లక్ష్యం... పేపర్‌ సీడ్‌ గ్రామం... 

ప్రస్తుతం నితిన్‌ వాస్‌ వ్యాపారాన్ని క్రమంగా విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాడు. దాని కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాడు. అయితే ‘పేపర్‌ సీడ్‌ విలేజ్‌’ ఒకటి ఏర్పాటు చేయాలన్నది అతడి కల. ‘‘ఇది అనుకున్నంత సులువు కాదు. దీని కోసం అధిక సంఖ్యలో వర్క్‌షాప్‌లు నిర్వహించాలి. అందుకు సరైన వ్యవస్థను నిర్మించాలి. ఈ ప్రాజెక్ట్‌కు డబ్బు బాగా ఖర్చవుతుంది. వాస్తవానికి మాకు చాలా రకాల వ్యాపార అవకాశాలు వస్తున్నాయి. అయితే ఆ మాయలో పడితే సామాజిక హితం పక్కన పెట్టాల్సి వస్తుంది. దానివల్ల నా సంకల్పమే చెదురుతుంది. అలాకాకుండా గ్రామాల అభ్యున్నతికి ఉపయోగపడే ఆలోచనతో ఎవరైనా వస్తే తప్పకుండా కలిసి పనిచేస్తా’’ అంటున్న నితిన్‌లో అణువణువూ సమాజ శ్రేయస్సు కనిపిస్తుంది.


ఉపాధీ ముఖ్యమే... 

ఈ మాస్క్‌ల తయారీ వెనుక పర్యావరణ హితం ఒక్కటే చూడలేదు నితిన్‌. తనను నమ్ముకున్న, తన గ్రామస్థుల ఉపాధి గురించి కూడా ఆలోచించాడు. ‘‘మాది వ్యాపార దృక్పథంతో నడిచే సంస్థ కాదు. గాంధీ ఆచరించి చూపిన స్వదేశీ వస్తువుల వినియోగం నాకు ఆదర్శం. అందుకే నా ఉన్నతితో పాటు భవిష్యత్‌ తరాలకు కూడా ఉపయోగపడేలా ప్రయోగాత్మక విధానాలు అవలంభిస్తున్నాను. మా గ్రామంలోని యువత, నిరుద్యోగులకు ఉపాధి మార్గాలు చూపిస్తున్నాను. అదే సమయంలో తమ కాళ్లపై తాము నిలబడేలా వృత్తి నైపుణ్య శిక్షణనిస్తున్నాను. కరోనాకు ముందు నా వద్ద 300 మందికి పైగా పనిచేసేవారు. కానీ లాక్‌డౌన్‌తో మేం సిద్ధం చేసిన ఉత్పత్తులన్నీ గోడౌన్‌కే పరిమితమై, వ్యర్థమయ్యాయి. దీంతో చాలామందిని తగ్గించుకోవాల్సి వచ్చింది’’ అంటున్న నితన్‌ వాస్‌ చదువు తరువాత కార్పొరేట్‌ కొలువుల వైపు పరుగెత్తలేదు. తనకంటూ ఒక ప్రత్యేకత, ఎంచుకున్న రంగంలో సామాజిక ప్రయోజనం ఉండాలనే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా ‘పేపర్‌ సీడ్‌ కంపెనీ’ ప్రారంభించాడు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు.  



Updated Date - 2021-04-28T05:30:00+05:30 IST