విత్తనోత్పత్తీ ఇక్కడే!

ABN , First Publish Date - 2020-09-23T06:35:45+05:30 IST

కోనసీమ తరహాలో సిద్దిపేట జిల్లాలోనూ విత్తనోత్పత్తి చేయడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. విత్తనాల

విత్తనోత్పత్తీ ఇక్కడే!

సిద్దిపేట జిల్లాలో వరి, మొక్కజొన్న విత్తనాల సాగు

రానున్న రబీలో 30 వేల ఎకరాల్లో..

మంత్రి హరీశ్‌ చొరవ.. నేడు సీడ్‌ కంపెనీల నిర్వాహకులతో సమీక్ష

మండలాల వారీగా వ్యవసాయాధికారులకు అవగాహన

కాళేశ్వరం నీళ్ల రాకతో కొత్త అడుగులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, సెప్టెంబరు 22 : కోనసీమ తరహాలో సిద్దిపేట జిల్లాలోనూ విత్తనోత్పత్తి చేయడానికి అడుగులు వేగంగా పడుతున్నాయి. విత్తనాల కోసం ఇతర ప్రాంతాలపై ఆధారపడకుండా ఇక్కడే ఉత్పత్తి చేసి ఎగుమతి చేసే బృహత్తరమైన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవ చూపడంతో జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులకు ప్రయోజనం చేకూరనున్నది. 


సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 5.22 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, కంది, మినుము ఇతర పంటలు ఉన్నాయి. అయితే విత్తనోత్పత్తి సాగు మాత్రం అతి స్వల్పంగా ఉంది. జిల్లా అంతటా లెక్కిస్తే కేవలం 2 వేల ఎకరాలు దాటడం లేదు. సీడ్‌ను ఉత్పత్తి చేసే విధానంపై రైతులకు అవగాహన లేకపోవడమే ఇందుకు కారణం. ఇక జిల్లాలోని రైతులే విత్తనాల సాగు చేపట్టే దిశగా అడుగులు వేస్తున్నారు. 


30 వేల ఎకరాలతో మొదలు

ప్రస్తుతం జిల్లాలో 2 వేల ఎకరాల్లో ఉన్న విత్తనోత్పత్తి సాగును వచ్చే యాసంగిలో 30 వేల ఎకరాలకు పెంచడానికి నిర్ణయించారు. వరి, మొక్కజొన్నతో పాటు వేరుశనగ, శనగ విత్తనాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకుగాను ఎంపిక చేసిన కొన్ని గ్రామాలను ఆయా సీడ్‌ కంపెనీలకు అప్పగించనున్నారు. గజ్వేల్‌ పరిధిలోని ప్రసాద్‌ సీడ్‌ కంపెనీ తరఫున సిద్దిపేట రూరల్‌ మండలం ఇర్కోడు, బుస్సాపూర్‌, దుబ్బాక మండలం అప్పనపల్లి, గజ్వేల్‌ మండలం ముద్దాపూర్‌ గ్రామాల్లో వరి, మొక్కజొన్న విత్తనాలను పండించనున్నారు. ఇదే విధంగా జిల్లాలో 14 సీడ్‌ కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటికి కూడా జిల్లాలోనే విత్తనోత్పత్తి చేసే ప్రక్రియలో భాగం చేయనున్నారు. తొలుత లక్ష ఎకరాల్లో సీడ్‌ సాగు చేద్దామని అనుకున్నప్పటికీ ఈ ఏడాది మాత్రం 30 వేల ఎకరాలకే కుదించారు. 


కాళేశ్వరం నీళ్ల రాకతో కొత్త అడుగులు

సాధారణంగా నీటి వనరులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే విత్తన పంటలను ఎక్కువగా వేస్తారు. అందుకే తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా సీడ్‌ ఉత్పత్తి చేస్తున్నారు. ఆ తర్వాత కరీంనగర్‌, మంచిర్యాల, గద్వాల ప్రాంతాల్లో కూడా విత్తనోత్పత్తి జరుగుతున్నది. ప్రస్తుతం జిల్లాలో అనంతగిరి, రంగనాయకసాగర్‌, కొండపోచమ్మసాగర్‌ రిజర్వాయర్లతో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లాలోని దాదాపు 2,900 చెరువులు, 579 చెక్‌డ్యాములు నిండి నీటితో కళకళలాడుతున్నాయి.. ఈ క్రమంలో వచ్చే రబీలో సీడ్‌ ఉత్పత్తికి అనుకూల వాతావరణం ఉంటుంది. పైగా నీటి రాకతో వాతావరణంలో తేమ శాతం కూడా పెరిగింది. 


కదిలిన వ్యవసాయశాఖ యంత్రాంగం

సోమవారం సాయంత్రం జిల్లాలోని వ్యవసాయశాఖ అదికారులు, సీడ్‌ కంపెనీల ప్రతినిధులతో మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామారెడ్డి సమీక్ష నిర్వహించారు. విత్తనోత్పత్తి పంటలపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర సీడ్‌ కార్పోరేషన్‌ ఎండీ కేశవులును కూడా ఆహ్వానించారు. ఈ క్రమంలో మంత్రి సూచనలను మంగళవారం జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులకు వివరించారు. కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని ఆసక్తి ఉన్న రైతులతో సమావేశాలు ఏర్పాటు చేశారు. విత్తనోత్పత్తి సాగు గురించి వివరించి వారిని ఈ దిశగా ఆలోచింపజేశారు. 


మంత్రి నిర్ణయంతో రైతులకు ప్రయోజనం

ఎకరం పొలంలో వరి ధాన్యం పండిస్తే వచ్చే లాభం కన్నా అదనంగా 20 శాతం ఆదాయం ఈ విత్తనోత్పత్తి సాగు ద్వారా వస్తుంది. పైగా సీడ్‌ కంపెనీలు పర్యవేక్షించడమే కాకుండా, వారే పెట్టుబడి పెడతారు. దిగుబడి విక్రయం తిప్పలు కూడా ఉండవు. చేయాల్సిందల్లా ఒక రైతుగా పంటను పరిరక్షించుకోవడమే. నీటి వసతి ఉన్న రైతులకు దీంతో మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే మంత్రి హరీశ్‌రావు ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని జిల్లాలకు సిద్దిపేట జిల్లా ఒక రోల్‌మాడల్‌గా ఉండాలనే తలంపుతో ఉన్నారు. ఇదే కాకుండా గెర్కిన్‌ అనే కీర దోసను కూడా జిల్లాలో సాగుచేయాలని, 3 వేల ఎకరాల్లో దీన్ని పండించాలని నిర్ణయించారు. 


సీడ్‌ కంపెనీల సీఈవోలతో నేడు సమీక్ష

జిల్లాలో విత్తనోత్పత్తి సాగును వేగిరం చేయడానికి మంత్రి హరీశ్‌రావు వెనువెంటనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఒకరోజు తేడాతోనే మళ్లీ సీడ్‌ కంపెనీల సీఈవోలతో సమీక్ష చేపట్టారు. నేడు వ్యవసాయశాఖ అధికారులు, సీడ్‌ కంపెనీల నిర్వాహకులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. జిల్లా రైతాంగాన్ని కొత్తబాట పట్టించడానికి ఈ సమావేశం దోహదం చేయనున్నది. 


రైతులు ఆసక్తిగా ఉన్నారు- శ్రవణ్‌, జిల్లా వ్యవసాయశాఖ అధికారి

విత్తనోత్పత్తి పంటలపై మంగళవారం రోజున మా శాఖ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో అవగాహన సమావేశాలు నిర్వహించాం. రైతుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా కాళేశ్వరం నీళ్లు రావడంతో రైతులు కూడా మార్పు కోరుకుంటున్నారు. మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు ఎంతో ప్రయోజనం కలగనున్నది.  

Updated Date - 2020-09-23T06:35:45+05:30 IST