మిర్చి విత్తనాల.. మాయాజాలం

ABN , First Publish Date - 2021-07-17T05:49:36+05:30 IST

జిల్లాలో కల్తీ, నకిలీ విత్తనాలపై అదుపు లేకుండా పోతోంది. వాణిజ్య పంటలకు జాతీయస్థాయిలో కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో కల్తీలు, నకిలీలు అదేస్థాయిలో వస్తున్నాయి.

మిర్చి విత్తనాల..  మాయాజాలం

 యథేచ్ఛగా నకిలీ విత్తనాలు, పురుగుమందుల విక్రయాలు

లైసెన్సు లేకుండానే కార్యకలాపాలు 

చూసీచూడనట్లు వ్యవసాయ శాఖ అధికారులు

నామమాత్రంగానే తనిఖీలు 

ఒకే లాట్‌ నంబర్‌తో నకలీ విత్తనాలు విడుదల

విత్తన శాంపిల్స్‌ పరీక్ష జాప్యం నకిలీలకు ఊతం

 మోసపోతున్న అన్నదాత

 

ఖరీఫ్‌ మొదలైంది. రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. ఇదే సమయంలో కల్తీ, నకిలీ విత్తన వ్యాపారులు చెలరేగిపోతున్నారు. ఈ దందాపై అధికారుల నిఘా కూడా లోపించిందనే విమర్శలు వస్తున్నాయి. నామమాత్రపు తనిఖీలు చేస్తూ అన్నీ సవ్యంగా ఉన్నాయనే చెబుతున్నారు. సరైన సమయంలో విత్తన శాంపిల్స్‌ను పరీక్షించకపోవడం కూడా నకిలీలు మార్కెట్‌లోకి రావడానికి కారణమని తెలుస్తోంది. 

 

గుంటూరు(ఆంధ్రజ్యోతి), సత్తెనపల్లి, జూలై 16: జిల్లాలో కల్తీ, నకిలీ విత్తనాలపై అదుపు లేకుండా పోతోంది. వాణిజ్య పంటలకు జాతీయస్థాయిలో కేంద్రంగా ఉన్న గుంటూరు జిల్లాలో కల్తీలు, నకిలీలు అదేస్థాయిలో వస్తున్నాయి. గతంలో గిడ్డంగులు, షాపులు, ప్రాసెసింగ్‌ యూనిట్లు, పార్సిల్‌ కార్యాలయాలు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, కొరియర్‌ కేంద్రాల్లో వీటి కోసం తనిఖీలు నిర్వహించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అధికారులు నామమాత్రపు తనిఖీలు చేయడంతో కొందరు వ్యాపారుల అక్రమాలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. ఈ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌లో కూడా నకిలీ విత్తనాల వ్యాపారులు తమ కార్యకలాపాలను యధావిఽధిగానే కొనసాగిస్తున్నారు. ప్రముఖ కంపెనీల లేబుళ్లతో తయారుచేసిన నకిలీ విత్తనాలను అక్రమార్కులు రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని విక్రయిస్తున్నారు. 


ఇలా బహిర్గతం..

ఆర్మూర్‌ హైబ్రిడ్‌ కంపెనీ ఈ ఏడాది మార్కెట్‌లోకి మిర్చి విత్తనాలను విడుదల చేసింది. వారు విడుదల చేసిన సరుకు కంటే ఎక్కువ విస్తీర్ణంలో  అదే విత్తనాల పేరుతో మన జిల్లాలో మిరప నారు పోశారు. దీంతో కంపెనీ ప్రతినిధులకు అనుమానం వచ్చింది. క్షేత్రస్థాయిలో పరిశీలించగా నకిలీ విత్తనాల వ్యవహారం బహిర్గతమైంది. దీని మూలాలు పెదకూరపాడు మండలంలో వెలుగులొకొచ్చాయి. 

 

పట్టుకొని వదిలేశారు..

నెలరోజుల క్రితం తాడికొండ పోలీసులు నకిలీ విత్తనాలు రవాణా చేస్తు న్న ఆటోను స్వాధీనం చేసుకొన్నారు. దానిని తరువాత వ్యవసాయశాఖ అధికారులకు అప్పగించారు. ఆటోను వ్యవసాయశాఖ అధికారులు వదిలేశారు. దానిపై అధికారులు, పొలీసులు పూర్తిస్థాయిలో దృష్టిపెడితే నకిలీ ఆర్మూర్‌ వ్యవహారం అప్పుడే వెలుగులోకి వచ్చేదని పలువురు భావిస్తున్నారు.

 

రాణిబెన్నూరు నుంచి..

నకిలీ వ్యాపారులు హైబ్రిడ్‌ మిర్చిని రాణిబెన్నూరు నుంచి తెస్తున్నారు.  నకిలీ, కల్తీ విత్తనాలకు ఇక్కడ ఆర్మూర్‌ పేరుతో కవర్లు తయారు చేయించారు. వాటిలో నింపి ఎవరికీ అనుమానం రాకుండా అమ్మారు. నకిలీ ఆర్మూర్‌ మిర్చి విత్తనాల పాకెట్లకు ఒకేలాట్‌ నంబర్‌ ఇవ్వటంతో కంపెనీ ప్రతినిధులు వీటిని వెంటనే గుర్తించారు. రాణిబెన్నూరు నుంచి కిలో హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలను రూ.8 వేల నుంచి రూ.10 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఆ విత్తనాలను ఆకర్షణీయమైన పాకెట్లలో వివిధ కంపెనీల పేరుతో కిలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షల చొప్పున అమ్ముతున్నారు. సుమారు నెల కిందట వినుకొండ, బొల్లాపల్లి వ్యాపారులు హైబ్రిడ్‌ మిర్చి విత్తనాలతో సూర్యాపేటలో తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డారు. అయినా జిల్లాయంత్రాంగం ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. 

 

సర్వీస్‌ శాంపిల్స్‌ను పరీక్షించలేదు...

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా షాపులు, గిడ్డంగుల్లో 1000 సర్వీస్‌ శాంపిల్స్‌ తీయించారు. అవి కమిషనర్‌ కార్యాలయానికి నెలరోజుల క్రితమే చేరాయి. ఇంతవరకు అధికారులు వాటిని లాబ్‌లకు పంపలేదు. విత్తన వ్యాపారులకు కమిషనరేట్‌ అధికారులు సహకరించటం వలనే సర్వీస్‌ శాంపిల్స్‌ లాబ్‌కు చేరలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వీస్‌ శాంపిల్స్‌ను పరీక్షిస్తే కల్తీ, నకిలీల బండారం నెల క్రితమే వెలుగులోకి వచ్చేదని కంపెనీ ప్రతినిదులు వాదిస్తున్నారు. 

  

సత్తెనపల్లి ప్రాంతంలో.. 

గత నెలలో ఓ వ్యక్తి ఐఎన్‌ఆర్‌ ఆర్మూరు విత్తనాల పేరిట ఎటువంటి లైసెన్సు లేకుండానే సత్తెనపల్లి, క్రోసూరు, పెదకూరపాడు, అచ్చంపేట ప్రాంతాల్లో విత్తనాలు విక్రయించాడు. కొంతమంది రైతుల దగ్గర అడ్వాన్సులు తీసుకున్నాడు. పది రోజుల నుంచి అతను తన కార్యాలయానికి తాళాలు వేసి ఉండటంతో రైతులు తాము మోసపోయామని గుర్తించి పట్టణ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వ్యవసాయ అధికారులు ఆ కార్యాలయానికి వెళ్లి చూడగా ఎటువంటి విత్తనాలు కనిపించలేదు. దీంతో కేవలం అతనికి హెచ్చరికలు మాత్రమే జారీ చేసి వచ్చారు. ఇటీవల క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలోనూ ఆర్మూరు నకిలీ విత్తనాలను కొంతమంది వ్యాపారులు విక్రయించారు. ఈ సమాచారం తెలుసుకున్న వ్యవసాయ శాఖాధికారులు గ్రామం వెళ్లి విచారణ చేశారు. రైతుల వద్ద బిల్లులు కూడా లేకపోవటం కారణంగా కేసు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అక్కడక్కడా అధికారులు తనిఖీలు చేసినప్పటికీ రాజకీయ వత్తిళ్లతో తిరిగి వ్యాపారం ప్రారంభించుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

 

నామమాత్రపు తనిఖీలు

సత్తెనపల్లి, ముప్పాళ్ల మండలాల్లో 110 వరకు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలున్నాయి. ఆయా దుకాణాల్లో ఏ కంపెనీలకు సంబంధించిన ఎరువులు విక్రయించారో, విత్తనాలు విక్రయించారో వాటికి సంబంధించిన బిల్లులు, ఇతర లావాదేవీలకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేయాలి. ప్రతి షాపును వ్యవసాయశాఖాధికారులు సంవత్సరంలో మూడుసార్లు తనిఖీ చేయాల్సి ఉంటుంది. వాటిని నామమాత్రంగా తనిఖీలు చేస్తూ అన్ని సవ్యంగా ఉన్నాయని వ్యవసాయశాఖాధికారులు కితాబిస్తున్నారు.


మా దృష్టికి వచ్చింది... 

సత్తెనపల్లి పట్టణంలో ఆర్మూరు మిరపవిత్తనాలు, మిరప మొక్కలు ఇస్తానని ఐఎన్‌ఆర్‌ చిల్లీస్‌ పేరుతో ఓ వ్యక్తి తన గృహంలో వ్యాపారం నిర్వహిస్తున్నాడని గత నెలలోనే మా దృష్టికి వచ్చింది. ఇతను కొంతమంది యువతి యువకులను ఏజెంట్లుగా పెట్టుకొని గ్రామాల్లో తిప్పుతూ విత్తనాల పేరిట డబ్బులు వసూలు  చేస్తున్నాడన్న సమాచారం మేరకు నేను, ఏవో వెళ్లి విచారించాం. తాము లైసెన్సుకోసం ప్రయత్నిస్తున్నానని, అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నానని మా దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ లైసెన్సు లేకుండా విత్తనాల పేరిట వ్యాపారం చేస్తే సహించేది లేదని హెచ్చరించి వచ్చాం.  

- ఏడీఏ అమలకుమారి

Updated Date - 2021-07-17T05:49:36+05:30 IST