ఎరువేది.. విత్తేది?

ABN , First Publish Date - 2022-06-23T04:42:09+05:30 IST

విత్తనం వెయ్యాలంటే దుక్కిదున్నాలి.. చేను దున్నాలంటే ఎరువు కావాలి. దుక్కిలో కలిపి చల్లేందుకు కావలసిన ఎరువులు అందుబాటులో లేవు.

ఎరువేది.. విత్తేది?
నారుమడి సిద్ధం చేసే పనిలో రైతు

 నీరొదిలి చేతులు దులుపుకొంటే సరా?

 వ్యవసాయ ఖరీఫ్‌ ప్రణాళిక ఏదీ?

నల్లబజార్‌లో సూపర్‌ ఫాస్సేట్‌

సూక్ష్మ పోషకాల పరిస్థితీ ఇదే

వరి విత్తనాలకు ప్రైవేటు దుకాణాలే దిక్కు

ఆర్బీకేలలో ముందస్తుగా డబ్బు చెల్లిస్తేనే ఎరువైనా, విత్తనమైనా

అయోమయ పరిస్థితిలో అన్నదాత

 

 ఖరీఫ్‌ సీజన్‌ మొదలవుతున్న తరుణంలోనే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం కేవలం కాల్వలకు మాత్రం నీరొదిలి ఖరీఫ్‌కు మేము అంతా చేసేశాం అన్నట్టు చేతులు దులుపుకొంటోంది. దుక్కులు దున్నటం మొదలుపెట్టాక ఎరువుల అవసరం కూడా ఉంటుంది. దుక్కిలోనే కలిపి చల్లడానికి సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ వంటి ఎరువులను కూడా చల్లాల్సి ఉంటుంది. అయితే దీనికీ కరువొచ్చింది. ప్రభుత్వం వీటిని ముందస్తుగా కంపెనీల దగ్గర నుంచి కొనుగోలు చేయకపోవటంతో వ్యాపారులు వారి ఇష్టానుసారం రేట్లు పెంచి అమ్ముతున్నారు.


ఖరీఫ్‌లో వరి విత్తనాలు సగటున ఎన్ని కిలోలు అవసరమవుతాయో వ్యవసాయ శాఖకు ముందే తెలుసు. కానీ ముందస్తు ప్రణాళిక లేకపోవటం, ఆర్బీకేలకు ముందుగానే డబ్బు చెల్లించాల్సి రావటంతో రైతులు ముందుకు రాలేదు. డీసీఎంఎస్‌ల ద్వారా మాత్రమే అమ్మకానికి ఇప్పుడిప్పుడే సిద్ధం చేస్తున్నారు. ఇవి మొత్తానికి సరిపోవు. చివరకు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్న విత్తనాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది.

 

 తెనాలి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): విత్తనం వెయ్యాలంటే దుక్కిదున్నాలి.. చేను దున్నాలంటే ఎరువు కావాలి. దుక్కిలో కలిపి చల్లేందుకు కావలసిన ఎరువులు అందుబాటులో లేవు. పేరుగొప్ప... సామెతలా ఉన్న ఆర్బీకేలు మాత్రం అలంకార ప్రాయంగా మిగిలాయి. ముందస్తుగా డబ్బు చెల్లిస్తేనే ఎరువులైనా, విత్తనాలైనా తెప్పిస్తామంటూ ఆర్బీకేలు చెబుతున్న మాటలు కౌలు రైతులను ఇరకాటంలో పెడుతున్నాయి. ఖరీఫ్‌ సాగు 80 శాతం కౌలుదారులే చేస్తారు. కానీ వారికి ఈ సీజన్లో కౌలు ఖరారు కాక, కౌలు అర్హత కార్డులే అందక అయోమయంలో ఉన్నారు. ఈ తరుణంలో ముందుగానే డబ్బు చెల్లించాలనటం విడ్డూరమేననేది వారి వాదన. ఈ విషయంలో ఆర్బీకేల పరిస్థితి టీ కావాలంటే ఉండండి పాలు పితుక్కుని వస్తామని చెప్పినట్టుందంటూ రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 


గత ప్రభుత్వంలో..

గత ప్రభుత్వ కాలంలో ముందస్తు వ్యవసాయ ప్రణాళిక ప్రకారం మండలానికి విత్తనాలు కానీ, ఎరువులు, సూక్ష్మపోషకాలు ఎంతెంత కావాలనేది ముందే గుర్తించి, ముందస్తు డబ్బు చెల్లింపులతో పనిలేకుండా సిద్ధం చేసి ఉంచేవారు. కానీ ప్రస్తుతం విత్తనాలు, ఎరువుల కోసం ఆర్బీకేలు, మార్క్‌ఫెడ్‌పై కాకుండా ప్రయివేటు వ్యాపారులపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో సబ్సిడీ అటుంచితే, అసలు ప్రభుత్వ నిర్ణయ ధర కాకుండ బ్లాక్‌ మార్కెట్‌ రేట్లకు అమ్మేసుకుని రైతులను నిలువునా లూటీ చేస్తున్నారు. వ్యాపారులు అమ్ముతున్న వరి విత్తనాలపై తనిఖీలు లేకపోవటం కూడా రైతులకు పరీక్షగానే మారుతోంది. నకిలీలు పుట్టుకొచ్చి తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నా వ్యవసాయ శాఖలో నామమాత్రపు దాడులు మినహా చర్యలు శూన్యమే అవుతున్నాయి.

 

 



సూపర్‌ ఫాస్సేట్‌ నల్లబజార్‌లోనేనా!

ఏరువాక నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాలో వ్యవసాయ పనులు ఊపందుకోవటం పరిపాటి. దుక్కిలోనే కలిపి చల్లేయటానికి ధాతులోపాలు లేకుండా సూక్ష్మ పోషకాలు ఉండేలా చూడటం, మట్టి సారాన్ని వృద్ధి చేసి, మొక్క ఎదుగుదలకు, వేరు వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు అవసరమైన సింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌ వంటి ఎరువులను కూడా చల్లాల్సి ఉంటుంది. ఎకరాకు కనీసం మూడు బస్తాల సూపర్‌ ఫాస్పేట్‌ ఎరువు అవసరం  అని వ్యవసాయ శాఖ  సిఫార్సు చేసింది.  కొన్ని ప్రాంతాల్లో రైతులు నాలుగు బస్తాల వరకు చల్లుతున్నారు. అంతే దీని ప్రకారం కృష్ణా పశ్చిమ డెల్టాలో ఉన్న 5,71,351 ఎకరాలకు 17.14 లక్షల బస్తాల సూపర్‌ ఫాస్సేట్‌ అవసరం ఉంటుంది. అయితే గతంలో ఉన్న ఎస్‌.ఎస్‌.పి బస్తా ధర గతంలో రూ.480 వరకు ఉంటే, ఇప్పుడు దీని రేటును రూ.630కి పెంచేశారు. దీనికి కారణం ఈ ఎరువు తయారు చెయ్యటానికి అవసరమైన ముడి పదార్ధాల రేట్లు అంతర్జాతీయ మార్కెట్‌లో పెరిగిపోవటమే. ఇదే భారమనుకుంటుంటే, ప్రభుత్వం వీటిని ముందస్తుగా కంపెనీల దగ్గర నుంచి కొనుగోలు చేయకపోవటంతో వ్యాపారులు వారి ఇష్టానుసారం రేట్లు పెంచి అమ్ముతున్నారు. రూ.630 వరకు అమ్మాల్సిన బస్తాను రూ.700 వరకు అమ్మేస్తున్నారు. అంటే ఒక్కో బస్తాకు రూ.220 వరకు అదనంగా రైతులు భరించాల్సి వస్తోంది.


అందని సూక్ష్మ పోషకాలు

దీనికితోడు జింకు ధాతు లోపం లేకుండా ఉండటానికి ప్రతి ఎకరాకు 20 కిలోల చొప్పున పట్టి పరీక్షలతో పనిలేకుండా అందరూ చల్లాల్సిందేనని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. ఇదీ ఆర్బీకేల దగ్గర, మరెక్కడ లేకపోవటంతో మన గ్రోమోర్‌ కంపెనీల దగ్గరే రైతుల కొనాల్సిన పరిస్థితి. అటు చవుడు నేలల్లో చల్లాల్సిన జిప్సం ఒక్క డీసీఎంఎస్‌ మినహా మరెక్కడా ఇవీ అందుబాటులో లేదు. దీంతో రైతులు అధిక రేట్లకు బయట కొనాల్సిన పరిస్థితి. 


విత్తు కోసం ప్రైవేటు దుకాణాలే దిక్కు

ఖరీఫ్‌లో వరి విత్తనాలు చల్లాలంటే ఎకరాకు నారుమళ్లకు 20 కిలోలు, వెద పద్ధతిలో చల్లటానికి 12 కిలోలు అవసరం అవుతాయి. గుంటూరు జిల్లాలో 1,84,190 ఎకరాలకు 27.62 లక్షల కిలోలు, బాపట్ల జిల్లాలోని 3,79,997 ఎకరాలకు 56.99 లక్షల కిలోలు, ప్రకాశం జిల్లాలోని 7,164 ఎకరాలకు లక్ష కిలోల వరి విత్తనాలు అవసరం అవుతాయి. ఈ మొత్తం విస్తీర్ణంలో సగటున ఇన్ని కిలోల విత్తనాలు అవసరమవుతాయని వ్యవసాయ శాఖకు ముందే తెలుసు. కానీ ముందస్తు ప్రణాళిక లేదు. ఆర్బీకేలకు ముందుగానే డబ్బు చెల్లించాల్సి రావటంతో రైతులు ముందుకు రాలేదు. డీసీఎంఎస్‌ల ద్వారా మాత్రమే అమ్మకానికి ఇప్పుడిప్పుడే సిద్ధం చేస్తున్నారు. ఇవి మొత్తానికి సరిపోవు. చివరకు ప్రైవేటు వ్యాపారులు అమ్ముతున్న విత్తనాలపైనే ఆధారపడాల్సి వస్తోంది.  అయితే వీటిలో నాణ్యత ఎంతవరకు అనేదికూడా ప్రశ్నార్ధకమే. గత సీజన్‌లో అమృతలూరు, బాపట్ల, పొన్నూరు, ప్రాంతాల్లో రైతులు వేసిన విత్తనాలు సరిగా మొలకెత్తక, మొలిచినా, కంకులు రాక నష్టపోయిన పరిస్థితి ఉంది. ఈ అనుభవాలున్నా వ్యవసాయ శాఖ విత్తన శాంపిళ్లు తీసుకుని పరీక్షించాల్సి ఉంటే, అవికూడా నామమాత్రంగానే సాగుతున్నాయి.


సాగుకు విముఖత!

దీంతో ఈ సీజన్‌ వరిసాగు గందరగోళ పరిస్థితుల మధ్య ఊగిసలాడుతోంది. కొన్ని మండలాల్లో అయితే పంట విరామానికే రైతులు మొగ్గు చూపుతున్నారు. అమృతలూరు మండలంలో కొన్ని గ్రామాలు పంట విరామాన్ని ప్రకటిస్తే, మిగిలిన ఊళ్లలో చాలామంది రైతులు సాగుకు విముఖత చూపుతున్నారు.  మరోపక్క కౌలు రైతులూ ఒప్పందానికి ఇంకా ఊగిసలాడుతూనే ఉన్నారు. ఈ తరుణంలోనే స్పందించాల్సిన వ్యవసాయ, నీటిపారుదల శాఖలు వారికి అవగాహన కల్పించి, అన్నిటిని అందుబాటులో కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఎరువులు, విత్తనాల అమ్మకాలు డీసీఎంఎస్‌ల ద్వారా మందకొడిగా సాగటంపై ఎండీ హరగోపాల్‌ను ప్రశ్నిస్తే ఇండెంట్‌లు పెట్టామని, వాటిని అందుబాటులో ఉంచుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే విత్తనాలు అందుబాటులోకి తెచ్చామని, ఎరువులుకూడా త్వరలో సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2022-06-23T04:42:09+05:30 IST