సీమ కథల సేద్యగాడు

ABN , First Publish Date - 2021-03-01T06:46:36+05:30 IST

1941లో జి.రామకృష్ణగారి ప్రసిద్ధకథలు ‘చిరంజీవి’, ‘గంజికోసం’ వెలు వడిన రెండేళ్లకు సింగమనేని తెలుగు నేలమీద అనంతపురం జిల్లా మరూరు బండ మీద...

సీమ కథల సేద్యగాడు

1941లో జి.రామకృష్ణగారి ప్రసిద్ధకథలు ‘చిరంజీవి’, ‘గంజికోసం’ వెలు వడిన రెండేళ్లకు సింగమనేని తెలుగు నేలమీద అనంతపురం జిల్లా మరూరు బండ మీద పల్లెలో పుట్టాడు. 1978లో మొదటి కథ రాస్తున్నప్పటికీ రామకృష్ణ కథావారసుడు, మార్క్సిజంతోనూ శ్రీశ్రీ కవిత్వంతోనూ ప్రేరేపితుడైన యువకుడు అనంతకథాసేద్యం చేయడానికి తయారవుతూవున్నాడు.


సింగమనేని నారాయణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి, చుట్టూ వున్న రైతుల్నీ రైతుకూలీలనీ గమనించి కలంపట్టినవాడు కాబట్టే, వ్యవసాయమూ- రైతు-కరువుబారిన పడ్డనేల అనే త్రయాన్ని తన ప్రధాన కథల్లో దశలవారీగా చిత్రించాడు. ‘జూదం’ కథలో- సేద్యాన్ని నమ్ముకొని, రెండు పూటల తిండికోసం చేసే పోరాటం రైతు ప్రకృతితో ఆడే జూదం వంటిదంటాడు. కె. సభాగారి ‘పాతాళ గంగ’ కథకు కొత్త మలుపుగానూ, జూదం కథలోని నారప్ప బతుక్కి కొనసాగింపు గానూ ‘ఊబి’ (1982) కథ రాసాడు సింగమనేని. భూగర్భ జలాలకోసం బోర్లు వేయడమనే ఊబిలోకి కూరుకుపోయిన రైతు ఓటమినీ, దిగ్ర్భాంతినీ చెప్పిన కథది. ‘అడుసు’ (1991) మార్కెట్‌ వ్యవస్థలోని దోపిడీనీ చిత్రించి, ఆ బురదను అంటించుకోకుండా వుండలేక, కడుక్కోనూలేక ఉక్రోషంలో స్వంత చీనీ తోటను నరికేసుకున్న రైతుకథ. వర్షాధారిత సేద్యం జూదమనీ, నీళ్లకోసం బోర్లు అనే ప్రలోభం నిరాశే మిగులుస్తుందనీ దీనికి తోడు మార్కెట్‌ మాయాజాలం రైతును దారుణంగా మోసం చేస్తున్నదనే వాస్తవాలను రికార్డు చేస్తూ, 1990ల కల్లా దేశవ్యాప్తంగా కమ్ముకుంటున్న రైతు ఆత్మహత్యలనే కారుమబ్బుకు కారణాలను గొప్ప దృష్టి కోణంతో చిత్రించాడు సింగమనేని. ‘జూదం’ కథలో ఒకవైపు నారప్ప లాంటి రైతులు పతనమవుతున్నా, రామశేషయ్య లాంటి వ్యాపారస్తులు గుగ్గిళ్లు అమ్ముకునే స్థితి నుంచి రైతు రక్తాన్ని పీల్చే జలగల్లా వడ్డీలు తిప్పే దశకు చేరడాన్ని చూస్తాం. రైతులు కునారిల్లుతుంటే వ్యాపారులు వెలుగుతుండడం కన్పిస్తుంది. ‘విముక్తి’ (1988) కథలో కరువు సేద్యం చేసి అప్పులపాలవడం కంటే ప్రభుత్వం కల్పించే కరువు పనులకు కూలీగా పోవడం మేలనే నిర్ణయం తీసుకుంటాడు రైతు. ‘యక్ష ప్రశ్నలు’ (1998) కథలో, ఆహార పంటల నుండి వ్యాపార పంటలకు మళ్లినా, రైతులు నష్టపోవడానికి కారణాలేమిటనే, ఉద్వేగభరితమైన ప్రశ్నల్ని కథకుడు పాఠకుడ్ని అడుగుతాడు. ప్రశ్నలకు సమాధానంకోసం కాలంతోపాటు ఎదురుచూడమంటాడు. ‘జూదం’ కథలో గుగ్గిళ్ళు అమ్ముకొని వడ్డీలకు తిప్పుకునే స్థితికెదిగిన వ్యాపారిని చూసినా, ‘అడుసు’ కథలో నిస్సహాయంగా తన్నుతాను నరుక్కున్నట్లు చీనీచెట్లను నరికేసే దృశ్యం చూసినా, ‘యక్షప్రశ్నలు’ కథలోని ఆఖరి ప్రశ్నపరంపరను చూసినా కారా మాస్టారి ‘యజ్ఞం’ కథ స్ఫురిస్తుంది. కళింగాధ్రలోగానీ రాయలసీమలోగానీ స్వతంత్ర భారతదేశంలో సంభవించిన వ్యవసాయ పరిణామాలొకటేనని ఈ యిద్దరు కథామాస్టార్లు నిరూపించారని తెలుస్తుంది. తమ ఉత్పత్తులకు ధరలు నిర్ణయించడమనే వెసులుబాటు ఆయా ఉత్పత్తిదారులకు వుండగా, రైతులకు లేకపోవడాన్ని ‘జీవఫలం చేదువిషం’ (2012) కథలో చర్చించాడు. ఇట్లా వ్యవసాయ ఆర్థికరంగం పట్ల, ఒక ఆలోచనాపరుడిగా తన దృక్పథాన్ని ప్రతిబింబించాడు సింగమనేని.


వ్యవసాయ కథల్లో యేదో మేరకు భూస్వామ్య వ్యవస్థ ముద్రలను చిత్రించిన సింగమనేని, తను రాసిన యితర రంగాల కథలైన, విద్యా వ్యవస్థ కథల్లోనూ, కుటుంబ సంబంధాల కథల్లోనూ దేశంలో వేళ్లూనుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రతిఫలనాలను, పాత వ్యవస్థ పునాదుల్లోంచీ యెలా పరిణమిస్తున్నాయో చిత్రించాడు. వ్యవసాయ కథల ద్వారా ప్రాంతీయ జీవితం లోని వాస్తవికతను చెప్పాక, దాని పరిణామ శీలతను మిగతా కథల్లోకి తెచ్చాడు.


ఆధునిక చదువులు, ఏ ఆధునిక విలువలనూ అందివ్వడంలేదనీ, టీచర్లైయ్యుండీ తమకు న్యాయంగా రావాల్సిన హక్కుల్ని కూడా అడగలేకపోతున్నారని, ‘బుడగలు’ (1979)కథలో చెబితే, విద్యావ్యవస్థలోని పరీక్షలనే ప్రక్రియలోని లొసుగులు సమాజాన్ని పతన విలువలు వైపు నడిపిస్తున్నాయని ‘పరీక్ష’ (1979), ‘పరీక్షిత్తు’ (1991) కథలు చెబుతాయి. తన సాటి టీచర్లతో నమస్కారాలు పెట్టించుకోవాలనే ఫ్యూడల్‌ విలువ ఒక హెడ్మాస్టర్‌తో తప్పులు చేయించడం ‘విష్‌’ (1982) కథలో కన్పిస్తుంది. ఆదర్శవంతంగా ఉండాల్సిన టీచర్లలో ప్రబలిపోతున్న ధనస్వామ్య ప్రలోభం, ‘ట్రాజెడీ’ (1982) కథలో కన్పిస్తుంది. తను టీచర్‌గా పనిచేసివున్నందున, విద్యా వ్యవస్థలో తలెత్తిన యీ ధోరణులను సింగమనేని మంచి కథలుగా మలిచాడు.


భూస్వామ్య వ్యవస్థలో భోగవస్తువుగా, వంటింటి మసిబట్టగా పరిమితమైన స్త్రీ, మెల్లగా వ్యాపిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో మగవాడికి, వరకట్నంతో, ఉద్యోగంతో ధనాగారమవుతున్నదనీ, స్త్రీ కన్నా ఆమె తెచ్చే డబ్బే మగవాడికి సర్వస్వంగా మారే ఒక పెడధోరణిని సింగమనేని గమనించాడు. ఈ ధోరణి చుట్టూ, దాని విరుగుడు చుట్టూ కొన్ని కథలు రాసాడు. స్త్రీ పురుష సంబంధాల్లో ఉండవలసిన ప్రజాస్వామ్య దృక్పథం గురించి, ‘నీకూ నాకూ మధ్య నిశీధి’ , ‘దృశ్యమూ-అదృశ్యమూ’, ‘ఒక గతి- ఒక శృతి’, ‘వాసంత తుషారము’ , ‘ఒక అసందర్భం’ లాంటి కథలు రాసాడు. ఈ కథల్లో సింగమనేని ఆధునిక మహిళా ఆలోచనలను వ్యక్తం చేస్తాడు. నేటి కాలపు మహిళలు పైపై మెరుగులతో చేసే ప్రేమ ప్రతిపాదనల మాయలో పడరని ‘నీకూ నాకూ మధ్య నిశీధి’ కథలోను, తన పెళ్లి కోసం కుంటుంబానికి ఆధారమైన పొలాన్ని పోగొట్టుకోవడం యిష్టం లేక, పెళ్లి మానుకొని యిల్లైనా విడిచివెళ్లగలరని ‘ఒక అసందర్భం’ కథలోను చెబుతాడు. పెళ్లిచూపుల పేరుతో మగవాడు ప్రదర్శించే ఆధిపత్యాన్ని బద్దలుచేయడానికి ఆడపిల్లలే పెళ్లి చూపులకు వెళ్లడం అటువైపు అబ్బాయి అమ్మ దాన్ని హర్షించడం ‘వాసంత తుషారం’ కథలో ఊహిస్తాడు. ఈ కథలు, సింగమనేని స్త్రీవాదాన్ని గుండెలకు హత్తుకు న్నాడని చెప్తాయి. స్త్రీపురుష సంబంధాలు కార్పొరేట్‌ సంబంధాలుగా మారడాన్ని, వ్యవసాయ భూములమ్మి ఆ డబ్బు ఫైనాన్స్‌ కార్పొరేషన్‌లలో పెట్టీ, పెంచీ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసెయ్యొచ్చు అనే వక్ర ఆలోచనలను తన కథల్లో ఖండిస్తాడు. సింగమనేని స్త్రీ పురుష సంబంధాల కథల్లోకి కూడా తనలోని వ్యవసాయ దారుడి దృష్టికోణం తీసుకొచ్చిన కథలివి. ఒకవైపు స్త్రీ పురుష సంబంధాల కథలుగా కన్పిస్తూనే అంత ర్లీనంగా భూమీ రైతూ ప్రయాణిస్తున్న వివిధ దశలను వివరించే ప్రయత్నాలను చూపుతాడు. ఆధునిక వస్తు వినిమయ వ్యవస్థ మనిషిని కంన్సూమరిజం అనే వ్యసనానికి బానిసగా మారుస్తున్నదని చెప్తూ, మార్కెట్‌ ఎకానమీ గురించి రాసిన ‘ప్రమాదవీణ’ (1993)కథ, సింగమనేని లోని మధ్యతరగతి సంసారాల్లోకి, వస్తున్న పరిణామాలను పట్టుకున్న ఆలోచనాపరుడిని పరిచయం చేస్తుంది.


ఒకవైపు స్థానిక ఫ్యాక్షన్‌ కథలాగా కన్పిస్తూనే, ‘ఫిరంగిలో జ్వరం’ కథ అంత ర్జాతీయ స్థాయిలో చోటుచేసుకున్న రాజకీయాలను కూడా ధ్వనిస్తుంది. ఈ కథలోని నాయుడూ, వీరారెడ్డి ఆధిపత్యం కోసం ఫ్యాక్షన్‌ నడిపిన వాళ్లే. మొదట వాళ్ల అనుచరుడిగా వుండి తర్వాత స్వతంత్రంగా సారావ్యాపారంలో యెదగాలని ప్రయత్నించే గణేనాయక్‌ యిప్పుడు ప్రత్యర్థిగా మారుతాడు. ఈ కథలోని నాయుడు అమెరికాకు, ఫ్యాక్షన్‌లో బలహీనమైపోయిన వీరారెడ్డి రష్యాకు ప్రతీకలు. గణేనాయక్‌ నాయుడి చీనీచెట్లను నరికించడం సెప్టెంబర్‌ 11 సంఘటనగా, గణేనాయక్‌ను వేటాడటం బిన్‌లాడెన్‌ కోసం వేటగా సాగే యీ కథ అంతరార్థ కథానిర్మాణ శిల్పానికి మంచి ఉదాహరణ.


సింగమనేని స్థానీయ స్వరంలో కథలు చెబుతూనే, రైతాంగ కథల ద్వారా, భవిష్యత్తు రైతాంగ అగచాట్లను చూపించాడు. స్త్రీపురుష సంబంధాల కథలు రాస్తూ, వేళ్లూనుకుంటున్న పెట్టుబడిదారీ వైపరీత్యాలను చూపాడు. స్థానీయ ఫ్యాక్షన్‌ కథ రాస్తూ, అంతర్జాతీయ ఏకధ్రువ రాజకీయాలను చెప్పాడు. ఆయన కథలు యిలా పలకడానికి, ఆయన అందిపుచ్చుకున్న దృక్పథమే కారణమని, అది మార్క్సిస్టు దృష్టి కోణం అవడం వలనే సాధ్యపడిందనీ అనిపిస్తుంది. సింగమనేని దళిత కథావస్తువుతో (‘ఉచ్చు’, ‘మకరముఖం’) రెండు కథలు రాసివుండిన ప్పటికీ ఆయన ప్రధాన కథాస్రవంతి అభ్యుదయ పాయదేననీ తెలుస్తుంది. స్త్రీ వాదాన్ని గాఢంగా హత్తుకున్నంతగా దళిత బహుజన వాదాన్ని అంగీకరించినట్లు కన్పించదు. ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాస్తారని గురజాడలాగే యీయనా నమ్ముతాడు. దానికి వుదాహరణ గానే గత సంవత్సరంలో ప్రచురితమైన తన కథ ‘గురజాడ అపార్ట్‌మెంట్‌’లో ఒక యువతి వంటింటి నుంచి విముక్తి పొందడానికి ‘కమ్యూనిటీ కిచెన్‌’ను నిర్వహిస్తుంది. కమ్యూనిటీ కిచెన్‌ అనేది సోషలిస్టు వ్యవస్థలో మాత్రమే సాధ్యమయ్యేది. మహిళలు యింటిచాకిరి నుంచి బయటపడి వ్యక్తులుగా సృజనాత్మకంగా జీవించాలంటే కమ్యూనిటీ కిచెన్లు రావాలని సింగమనేని కలగన్నారు. అది ఆయనలోని మార్క్సిస్టు కన్న కల.


సింగమనేని ఆకారంలో, ఆహార్యంలో ఒక పల్లెటూరితనం వుంది. మనుషులను నోరారా పలకరించే మోతుబరి రైతుతత్వమే ఆయన కథల కంఠస్వరం. అనుభ వంతో పండిపోయిన విషయాన్ని చెప్పడంలో వ్యక్తమయ్యే ఆత్మవిశ్వాసం వల్ల ఆ స్వరం ఖంగున మోగుతుంది. ఆయన పంచెకట్టు లాగానే కథను కట్టడం కూడా సరళ గంభీరంగా వుంటుంది. కథలలో సామాజిక సమస్యలను చిత్రించినా పరిష్కారాలను సూచించకుండా, ఒపెన్‌ ఎండెడ్‌గా వుంచుతాడు. కథకట్టడంలో, మాటలో, బట్టకట్టడంలో, పదహారణాలా తెలుగుదనం వుట్టిపడే సింగమనేని నారాయణ గారిని కథల సేద్యగాడని అక్షరాలా అనొచ్చు. 

జి. వెంకటకృష్ణ

Updated Date - 2021-03-01T06:46:36+05:30 IST