అన్నదాతకు ఇంధన సెగ

ABN , First Publish Date - 2021-11-08T05:00:28+05:30 IST

కాడెద్దుల వ్యవసాయం కనుమరుగవుతోంది. చాలా మంది రైతులు యంత్ర పరికరాలపైనే ఆధారపడుతున్నారు.

అన్నదాతకు ఇంధన సెగ

  1. ఇప్పటికే సంక్షోభంలో వ్యవసాయం
  2. పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలతో కుదేలు
  3. వ్యవసాయంలో యంత్ర పరికరాల వినియోగం
  4. రెండున్నరేళ్లలో 50 శాతం పెరిగిన పెట్టుబడి ఖర్చు


పెట్రోలు ధరలు పెరిగితే వాహనదారులు ఇబ్బంది పడతారు. బైకు, కారు, లారీ, బస్సు.. ఇలా ఏ వాహనం వాడినా ఖర్చు పెరుగుతుంది.  పెట్రో ధరలు పెంచినప్పుడు   కేవలం ఈ వర్గాల ప్రజల గురించే చర్చ జరుగుతుంది. రవాణా,  ప్రయాణ చార్జీలు,  నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయని ఆందోళనకు దిగుతారు. ఇది నిజమే. కానీ.. ఇంధనం ధరల పెరుగుదల ఈ వర్గాల కంటే   మరో వర్గానికి ఎక్కువ భారంగా మారుతుంది.  వాళ్లను కోలులేనంత సంక్షోభంలోకి నెట్టుతుంది. ఆ వర్గమే.. రైతాంగం. సేద్యంలో యంత్ర పరికరాల వినియోగం బాగా పెరిగింది. పశువులు, మనషులు చేసే చాలా పనులను ఇప్పుడు యంత్రాలు  చేస్తున్నాయి. అందువల్ల  ఇంధనం ధరలు పెరిగితే వ్యవసాయం మరింత భారమైపోతుంది.  ఇప్పటికే వ్యవసాయంలో పెట్టుబడులు పెరిగిపోయాయి. ప్రకృతి విపత్తులు, మార్కెట్‌ మాయాజాలం   సేద్యం సంక్షోభంలోకి తోసేశాయి. భారీగా అప్పులు తెచ్చి  వ్యవసాయం చేయకతప్పడం లేదు. ఇప్పుడు దీనికి ఇంధనం ధరల పెరుగుదల తోడైంది. ఇటీవల పెరిగిన పెట్రో ధరల వల్ల సేద్యం ఖర్చులు రెట్టింపు అయ్యాయని రైతులు అంటున్నారు.  తాజాగా కేంద్రం పెట్రోలు, డీజిల్‌పై పన్ను కొంత తగ్గించింది. అయితే  పెరిగిన ధరలతో పోలిస్తే ఇది ఏమంత ప్రయోజనకరం కాదని రైతులు అంటున్నారు.


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 7: కాడెద్దుల వ్యవసాయం కనుమరుగవుతోంది. చాలా మంది రైతులు యంత్ర పరికరాలపైనే ఆధారపడుతున్నారు. ఎద్దుల పోషణ భారం భరించలేకపోవడే ఇందుకు కారణం. ఇప్పుడు యాంత్రిక సేద్యం కూడా భారంగా మారింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల సెగ రైతులను తాకింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిరోజూ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతున్నాయి. దీంతో రైతుల కంటికి కునుకు లేకుండా పోయింది. రెండున్నర సంవత్సరాల్లో డీజిల్‌ ధర 50 శాతం పెరిగింది. ఫలితంగా రైతు పెట్టుబడి ఖర్చు ఎకరాకు రూ.3 వేల వరకు పెరిగింది. ఇంధన ధరలకు అనుగుణంగా వాహన యజమానులు రవాణా చార్జీలను పెంచారు. జిల్లాలో ఖరీఫ్‌లో 6.30 లక్షల హెక్టార్లు, రబీలో 3.50 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తున్నారు. మొత్తంగా 9 లక్షల హెక్టార్లకు పైగానే సాగు అవుతుంది. ఇంతటి విస్తీర్ణానికి ఇంధనం ఖర్చు రూ.వేల కోట్లు అవుతుంది. దుక్కి దున్నడం, విత్తనం, కలుపు తీత, రసాయన ఎరువుల వినియోగం.. అన్నింటికీ యంత్రాలు అవసరం. పంట కోత, నూర్పిడి, మార్కెట్‌కు తరలింపు.. అన్నీ వాహనాలు, యంద్రాల పనులే. దశాబ్దం క్రితం వరకూ ఎక్కువ శాతం పనులు ఎద్దులపై ఆధారపడి పూర్తి చేసేవారు. ఇప్పుడు వాటి స్థానాన్ని యంత్ర పరికరాలు, వాహనాలు ఆక్రమించాయి. 


భారీగా పెరిగిన వ్యయం

ఇంధనం ధరల పెరుగుదల కారణంగా ఐదు ఎకరాలు సాగు చేసే చిన్న రైతుపై ఏడాదికి రూ.15 వేలకు పైగా అదనంగా భారం పడుతోంది. గొర్రు, గుంటక, విత్తనం, అంతరసేద్యం తదితర పనులకు ఓ పంట కాలంలో ఆరు దఫాలుగా ట్రాక్టర్‌ వినియోగించాల్సి వస్తుంది.  గతంలో అయ్యే ఖర్చుకంటే ప్రస్తుతం ఎకరానికి రూ.వెయి దాకా ట్రాక్టర్‌ వినియోగ వ్యయం పెరిగిందని రైతులు వాపోతున్నారు. పంట నూర్పిడి ఖర్చు రూపంలోనూ మరో రూ.500 దాకా భారం పడింది. దిగుబడుల రవాణా ఖర్చు గతంలో రూ.500లోపే ఉండేది. ప్రస్తుతం రూ.వెయ్యికి పైగా ఖర్చు అవుతోంది. పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించాంటే క్వింటానికి గతంలో రూ.20 ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.100 దాకా  అవుతోంది. ఎకరాకు 25 క్వింటాళ్ల మిర్చి పండితే.. రవాణాకు రూ.3వేల దాకా రవాణా వ్యయం పెరిగింది. డోన, కోడుమూరు తదితర ప్రాంతాల నుంచి కర్నూలు మార్కెట్‌ యార్డుకు మిర్చి, ఉల్లి తదితర పంట ఉత్పత్తులను తెచ్చేందుకు గతంలో బస్తాకు రూ.40 దాకా ఖర్చు అయ్యేది. ఇప్పుడు రూ.80 పైగానే తీసుకుంటున్నారు. పొలంలో కలుపులు, కోతలు, నూర్పిడికి కూలీలను తరలించేందుకు ఆటోకు సగటున 10 కి.మీ. గతంలో రూ.500 నుంచి రూ.600 దాకా తీసుకునేవారు. ప్రస్తుతం ఈ ఖర్చు రూ.1000కి పెరిగిందని రైతులు వాపోతున్నారు. 


రూ.4 వేలకు పైగానే భారం 

జిల్లాలో కేసీ కెనాల్‌, తెలుగుగంగ, ఎల్లెల్సీ, హంద్రీనీవా తదితర కాలువల నుంచి 6 లక్షల ఎకరాలకు పైగానే ఆయకట్టుకు నీరు అందుతోంది. ఈ సంవత్సరం 2 లక్షల ఎకరాల్లో వరి  సాగు చేశారు. మిగిలిన పంటలతో పోలిస్తే.. వరి సాగుకు రైతులు పూర్తిగా ట్రాక్టర్లు, ఇతర యంత్ర పరికరాలను వినియోగిస్తారు. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా యంత్ర పరికరాల యజమానులు బాడుగలను కూడా పెంచేశారు. దీని వల్ల ఎకరా వరి పంట సాగుకు రూ.4,110 దాకా వ్యయం పెరిగిందని రైతులు అంటున్నారు. ఐదెకరాల్లో వరి వేసిన రైతులకు ఇంధనం ఖర్చు రూ.20 వేల పైగానే అదనంగా పెరిగింది. మొత్తం రెండు లక్షల ఎకరాలకు ఖర్చును లెక్కిస్తే దాదాపు రూ.8 వేల కోట్ల మేర రైతులకు పెట్టుబడి ఖర్చు పెరిగినట్లు స్పష్టమౌతోంది. ట్రాక్టర్‌ తోలకం సాలుకు రూ.200 దాకా పెరిగింది. వరి పంట సాగుకు ముందు రైతులు పొలాన్ని దున్ని దుక్కి చేయడం మొదలుకుని నారు వేసేందుకు యంత్ర పరికరాలను తప్పనిసరిగా వినియోగించాలి. రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వాహన యజమానులు ఆకుమడి నుంచి దమ్ము చేయించడం వరకు అన్ని రేట్లు పెంచేశారు. గతంలో పోలిస్తే.. సాలుకు రూ.100 నుంచి రూ.200 దాకా ఖర్చు పెరిగింది. డీజిల్‌ ధరతో పాటు యంత్ర పరికరాల ధరలు కూడా పెరిగాయి. 


మిరప సాగులో రెట్టింపైన వ్యయం 

ఎకరాకు రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టే మిరప సాగులో యంత్ర సేద్యం క్రమంగా భారంగా మారుతోంది. ఈ పంటను సాగు చేస్తున్న రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. జిల్లాలో ఈ సంవత్సరం  దాదాపు 80 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. 2018లో ఈ పంట సాగుకు ఒక ఎకరపై రూ.14 వేల దాకా ఖర్చు వస్తే.. ప్రస్తుతం రూ.24 వేలకు పైగానే ఖర్చు అవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో యంత్ర సేద్యం మరింత భారమౌతోంది. జిల్లాలోని బెళగల్‌ ప్రాంతంలో రెండు నాగళ్లకు ఎకరానికి రూ.2,500 ఖర్చు అవుతోంది. గొర్రు, గుంటకలకు రూ.800 చొప్పున వసూలు చేస్తున్నారు. లాక్‌డౌన తర్వాత ఏ వస్తువు ధరలను చూసినా గుండె గుభేలుమంటోందని రైతులు అంటున్నారు. మిర్చిసాగు పెట్టుబడి భారీగా పెరుగుతోంది. ఎకరం పొలంలో మొక్క నాటేసరికి రూ.40వేల పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. కోతలతో కలిపితే.. ఈ ఖర్చు రూ.2 లక్షల పైమాటే. ఇతర పనులు చేయలేక, సేద్యాన్ని కొనసాగించలేక రైతులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 


ఐదెకరాల పత్తికి రూ.25 వేల భారం 

జిల్లాలో రెండున్న లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఇంధన ధరల పెరుగుదల నేపథ్యంలో గత రెండున్నర సంవత్సరాల నుంచి ఒక్కో ఎకరాపై రూ.5,200 దాకా ఖర్చు అధికమైందని రైతులు వాపోతున్నారు. 57 శాతం  వరకూ పెట్టుబడి ఖర్చులో పెరుగుదల కనిపిస్తోంది. ఐదెకరాలలో పత్తి వేస్తే.. రూ.25వేల దాకా అదనపు పెట్టుబడులు తప్పడం లేదు. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణాన్ని పరిశీలిస్తే.. రూ.500 కోట్ల మేర రైతులకు అదనంగా ఖర్చు అవుతోందని వ్యవసాయశాఖ అధికారులు అంటున్నారు.


వేరుశనగపై..

జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో వేరుశనగ సాగు అవుతోంది. పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఒక్కో రైతుపై అదనంగా రూ.6,200 భారం పడుతోందని అంచనా. ఖరీఫ్‌, రబీలో  డోన, పత్తికొండ, ఆళ్లగడ్డ, పాణ్యం, ఆదోని, ఆలూరు, ఎమ్మిగనూరు ప్రాంతాల్లో వేరుశనగ పంటను అధికంగా సాగు చేస్తున్నారు. 


వాతావరణం అనుకూలించకపోతే..

సాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు పంటలకు అదనపు ఖర్చులు పెద్దగా ఉండవు. కానీ ఎక్కువ వర్షాలు వచ్చినా, వర్షాభావ పరిస్థితులు తలెత్తినా యంత్ర పరికరాలు, మందుల వినియోగం పెరుగుతుంది. ఆ మేరకు ఇంధనం ఖర్చు పెరుగుతుంది. 



పత్తి సాగులో యంత్ర సేద్యభారం (ఎకరాకు రూ.) 

-------------------------------------------------------- 

పని 2018 2020 2021

----------------------------------------------------------- -------------------

రెండు నాగళ్లు 1500 1700 2000

గొర్రు, సాలు, గుంటక 1200 1500 2100

అచ్చుతోలకం 500 600 700

అంతర సేద్యం

(రెండుసార్లు) 1000 1200 2100

పురుగు మందుల పిచాకారి  1050 1200 1500

కూలీల తరలింపు

(కలుపులు, పత్తి తీతలు)  3000 3900 4200

పత్తి టిక్కీలు (ఇంటికి) 800 1200 1800

---------------------------------------------------------------- 

మొత్తం 9050 11000 14230

---------------------------------------------------------------------- 

ఖర్చు రెట్టింపు అయింది.. 

రైతులు ఆధునిక సేద్యానికి అలవాటు పడ్డారు. పొలం దున్నడం మొదలు పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించేదాకా యంత్ర పరికరాల పైనే ఆధారపడుతున్నారు. దీని వల్ల రైతులపై పెనుభారం పడుతోంది. ఈ ఖర్చులను తగ్గించుకునేందుకు రైతులు  ప్రయత్నం చేయాలి. 

- సాలురెడ్డి, ఏడీఏ, కర్నూలు



 



Updated Date - 2021-11-08T05:00:28+05:30 IST