120 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2022-05-25T06:19:54+05:30 IST

జి.మాడుగుల మండలం దేవరాపల్లి నుంచి మైదాన ప్రాంతానికి కారులో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని కొయ్యూరు పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు.

120 కిలోల గంజాయి స్వాధీనం
స్వాధీనం చేసుకున్న గంజాయితో కొయ్యూరు ఎస్‌ఐ, సిబ్బంది

- ఒకరి అరెస్టు, పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు

- కారు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు సీజ్‌

కొయ్యూరు, మే 24: జి.మాడుగుల మండలం దేవరాపల్లి నుంచి మైదాన ప్రాంతానికి కారులో తరలిస్తున్న 120 కిలోల గంజాయిని కొయ్యూరు పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. కారు, రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను సీజ్‌ చేసి ఒకరిని అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు. కొయ్యూరు ఎస్‌ఐ డి.నాగేంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం ఎస్‌ఐ నాగేంద్ర తన సిబ్బందితో కలిసి చీడిపాలెం కూడలి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. రెండు ద్విచక్ర వాహనాలపై ఇద్దరు వ్యక్తులు, ఆ వెనుక ఓ కారు అతివేగంగా వస్తుండడాన్ని గుర్తించారు. ద్విచక్ర వాహనాలను ఆపే ప్రయత్నం చేయగా వారిలో ఒకరు పట్టుబడ్డారు. మరో వ్యక్తి కూతవేటు దూరంలో వాహనాన్ని నిలిపి పరారయ్యాడు. అలాగే వెనుక వస్తున్న కారు శరవేగంతో దూసుకుపోవడంతో పోలీసులు వెంబడించారు. కొయ్యూరు మార్గం వైపు మళ్లించి మధ్యలో కారును నిలిపి అందులోని వ్యక్తి జీడిమామిడి తోటల్లోకి పారి పోయాడు. కారును పరిశీలించగా అందులో 120 కిలోల గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి.  దాని విలువ సుమారు రూ.60 లక్షలు ఉంటుంది. గంజాయితో పాటు రెండు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై వస్తూ పట్టుబడిన వ్యక్తి జి.మాడుగుల మండలం దేవరాపల్లి గ్రామానికి చెందిన వంతల నారాయణగా గుర్తించారు. అలాగే పరారైన వారు అదే గ్రామానికి చెందిన పాంగి నారాయణ, సురేశ్‌గా తెలిసిందని, ఈ మేరకు కేసు నమోదు చేసి వంతల నారాయణను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. మిగిలిన ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ దాడుల్లో ఎస్‌ఐ వెంట పోలీసులు మూర్తి, నాయుడు, హోంగార్డు బోడేసు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-25T06:19:54+05:30 IST