ధూల్‌పేట్‌లో కొకైన్‌ కలకలం

ABN , First Publish Date - 2022-05-25T17:19:33+05:30 IST

గుడుంబా, గంజాయి అంటే గుర్తుకు వచ్చే ధూల్‌పేట్‌లో తాజాగా డ్రగ్స్‌ మూలాలు బయట పడుతున్నాయి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరిని, కొనుగోలు చేసిన మరొకరిని ఎక్సైజ్‌

ధూల్‌పేట్‌లో కొకైన్‌ కలకలం

డ్రగ్స్‌ అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్‌  

56 గ్రాముల కొకైన్‌ స్వాధీనం 

మొన్న గుడుంబా.. నిన్న గంజాయి.. తాజాగా డ్రగ్స్‌


హైదరాబాద్/మంగళ్‌హాట్‌: గుడుంబా, గంజాయి అంటే గుర్తుకు వచ్చే ధూల్‌పేట్‌లో తాజాగా డ్రగ్స్‌ మూలాలు బయట పడుతున్నాయి. డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరిని, కొనుగోలు చేసిన మరొకరిని ఎక్సైజ్‌ అధికారులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 56 గ్రాముల కొకైన్‌, రూ.1.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అధికారులు వివరాలు వెల్లడించారు. ఈ నెల 23న రాత్రి 8.35 గంటల సమయంలో ఇద్దరు ద్విచక్ర వాహనంపై ధూల్‌పేట్‌ జుమ్మేరాత్‌ బజార్‌ ధర్తి మాతా దేవాలయం సమీపంలో అనుమానాస్పదంగా కనిపించడంతో ఎక్సైజ్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. విచారించగా సౌత్‌ ఆఫ్రికాకు చెందిన మౌరీస్‌ బసర్యీ ఓంషా, మాసబ్‌ ట్యాంక్‌ ప్రాంతానికి  చెందిన సందీప్‌ కుమార్‌ షాలుగా చెప్పారు.


తనిఖీల్లో సందీప్‌ కుమార్‌ షా వద్ద ఏడు గ్రాముల కొకైన్‌, రూ. 36 వేలు, మౌరిస్‌ వద్ద రూ. 58 వేలు లభించాయి. వారిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణలో తలాబ్‌కట్ట ప్రాంతానికి చెందిన సయ్యద్‌ లియాఖత్‌కు కొకైన్‌ విక్రయించినట్లు తెలిపారు. పోలీసులు సయ్యద్‌ లియాఖత్‌ను గుర్తించి తనిఖీ చేయగా, అతడి వద్ద 11 గ్రాముల కొకైన్‌ దొరికింది. తన యజమాని యజ్ఞానంద్‌ సూచన మేరకు మౌరీస్‌ వద్ద కొకైన్‌ తీసుకున్నట్లు సయ్యద్‌ లియాఖత్‌ అంగీకరించాడు. మరో బృందం సన్‌సిటీలోని మౌరీస్‌ ఫ్లాట్‌లో తనిఖీ చేయగా 38 గ్రాముల కొకైన్‌, కొంత నగదు లభించింది. ముగ్గురు నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి 56 గ్రాముల కొకైన్‌, రూ. 1.28 లక్షల నగదు, ఇన్నోవా, ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 


సౌత్‌ ఆఫ్రికా నుంచి..

నగరంలోని ప్రముఖ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన డ్రగ్స్‌ ఇప్పుడు ధూల్‌పేట్‌కు చేరడం కలకలం రేపుతోంది. సౌత్‌ ఆఫ్రికా నుంచి నేరుగా ధూల్‌పేట్‌ కేంద్రంగా అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఎక్సైజ్‌ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ధూల్‌పేట్‌ ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి కొన్నేళ్లుగా అక్కడే పాతుకుపోయి గంజాయి, బెల్ట్‌ షాపు నిర్వాహకుల నుంచి ముడుపులు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏ అధికారీ అటువైపు వెళ్లకుండా ఆయన చక్రం తిప్పుతున్నట్లు పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 

Updated Date - 2022-05-25T17:19:33+05:30 IST