560 కిలోల గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2022-05-24T06:43:26+05:30 IST

మండలంలోని గిరిజన గ్రామం రొచ్చుపణుకు నుంచి తరలించేందుకు ఓ వ్యాన్‌లో సిద్ధం చేసి గంజాయిని కొత్తకోట పోలీసులు పక్కా సమాచారంతో పట్టు కున్నారు.

560 కిలోల గంజాయి పట్టివేత
గంజాయి, నిందితులను చూపుతున్న సీఐ లక్ష్మణమూర్తి

ఇద్దరి అరెస్టు, మరో వ్యక్తి పరారీ


రావికమతం, మే 23 : మండలంలోని గిరిజన గ్రామం రొచ్చుపణుకు నుంచి తరలించేందుకు ఓ వ్యాన్‌లో సిద్ధం చేసి గంజాయిని కొత్తకోట పోలీసులు పక్కా సమాచారంతో పట్టు కున్నారు. ఈ సందర్భంగా 560 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దర్ని అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి కొత్తకోట సీఐ ఎస్‌.లక్ష్మణమూర్తి తెలిపిన వివరాలివి. రొచ్చుపణుకు గ్రామం నుంచి పెద్దఎత్తున గంజాయి తరలించేందుకు సిద్ధమవుతున్నట్టు ఆదివారం రాత్రి తమకు సమాచారం అందిందన్నారు. దీంతో వెంటనే ఎస్‌ఐ అప్పలనాయుడు, సిబ్బందితో వెళ్లి దాడిచేశామన్నారు. ఓ వ్యాన్‌లో  తరలించేందుకు సిద్ధం చేసిన 24 బస్తాల్లో గల 560 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, మాకవరపాలెం మండలం సీతన్న అగ్రహారానికి చెందిన చొప్పా రాజుబాబు, జి.కోడూరుకు చెందిన నమ్మి రాంబాబులను అదుపులోకి తీసుకున్నామన్నారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. సోమవారం నిందితుల్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించామన్నారు. ఈ ఘటనలో ఓ బైక్‌ను సైతం సీజ్‌ చేశామన్నారు.


విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొన్న బైక్‌.. కాలేజీ ఉద్యోగి మృతి 

చీడికాడ, మే 23 : బైక్‌పై వెళుతూ ప్రమాదవశాత్తు విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొని ఓ ప్రభుత్వ కళాశాల ఉద్యోగి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ కె.సుధాకర్‌ తెలిపిన వివరాలివి. చీడికాడ మండలం శిరిజాం గ్రామానికి చెందిన యడ్ల నారాయణమూర్తి(53) చోడవరం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ప్రతి రోజూ శిరిజాం నుంచి రాకపోకలు సాగిస్తుండేవాడు. ఇందులో భాగంగా సోమవారం మధ్యాహ్నం చోడవరంలో బైక్‌పై బయల్దేరిన నారాయణమూర్తి జి.కొత్తపల్లి ఆశ్రమం తరువాత ఉన్న స్తంభానికి ఢీకొనడంతో తీవ్ర గాయాలకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. అతడి భార్య రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ చెప్పారు. 


వివాహితపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తి అరెస్టు 

నర్సీపట్నం అర్బన్‌, మే 23 : మండలంలోని చెట్టుపల్లిలో ఓ వివాహితపై అత్యాచారానికి ప్రయత్నించిన యువకుడ్ని అరెస్టు చేసినట్టు రూరల్‌ ఎస్‌ఐ ఎస్‌.రమేష్‌ తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన తెలిపిన వివరాలివి. చెట్టుపల్లికి చెందిన శానాపతి జగదీశ్‌ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను గత కొంత కాలంగా ప్రేమ పేరిట వేధిస్తుండేవాడు. ఆదివారం మధ్యాహ్నం ఆమె భర్త ఇంట్లో లేని సయమంలో జగదీశ్‌ ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారానికి యత్నించగా, బాధిత మహిళ కేకలు వేయడంతో అక్కడి నుంచి పరుగుతు తీశాడు. ఈ ఘటనపై సోమవారం అందిన ఫిర్యాదు మేరకు నిందితుడ్ని అరెస్టు చేసి, కోర్టుకు తరలించినట్టు ఎస్‌ఐ చెప్పారు. 


రైల్వే గడ్డర్‌ను ఢీకొన్న లారీ

అనకాపల్లి టౌన్‌, మే 23: స్థానిక విజయరామరాజుపేట అండర్‌ బ్రిడ్జి వద్ద సోమవారం సాయంత్రం త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. గంధవరం నుంచి తూర్పుగోదావరి జిల్లా మండపేటకు వెళ్లేందుకు అనకాపల్లి పట్టణంలోకి ధాన్యం బస్తాల లోడుతో వస్తున్న లారీ గడ్డర్‌పై నుంచి దూసుకుపోయింది. గడ్డర్‌ చాలా వరకు ఒరిగిపోవడంతో లారీ గడ్డర్‌ కింద చిక్కుకుపోయింది. అదే సమయంలో చోడవరం వైపు వెళ్తున్న కారు ప్రయాణికుల పరిస్థితిని గమనించి సంఘటనా స్థలానికి కొద్ది దూరంలో నిలిపివేయడంతో ప్రమాదం తప్పింది. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పోలీసులు వచ్చి నాయుళ్లవీధి, లక్ష్మీదేవిపేట మీదుగా గుండాలవీధి జంక్షన్‌కు వాహనాలను మళ్లించారు. ఆర్పీఎఫ్‌ అధికారులు లారీ డ్రైవర్‌, సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.


క్విక్కర్‌ జాబ్‌ వెబ్‌సైట్‌పై కేసు నమోదు

సబ్బవరం, మే 23: ఉద్యోగాల పేరిటి రూ.26 వేలు వసూలు చేసి ప్లేటు ఫిరాయించిన క్విక్కర్‌ జాబ్‌ వెబ్‌సైట్‌పై సోమవారం కేసు నమోదు చేసినట్టు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. సీఐ అందించిన వివరాల ప్రకారం... మండలంలోని చింతగట్ల అగ్రహారం గ్రామానికి చెందిన పైల బంగారునాయుడు బీటెక్‌ చదువుకుని ఖాళీగా ఉన్నాడు. నెట్‌లో క్విక్కర్‌ జాబ్స్‌ వెబ్‌సైట్‌ తెరిచి పరిశీలిస్తుండగా వర్క్‌ హోమ్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ కనిపించింది. అది ఒపెన్‌ చేయగానే ఓ మెసేజ్‌ వచ్చింది. దాని ప్రకారం ఫోన్‌ చేస్తే రిజిస్ర్టేషన్‌ ఫీజు, యాక్టివేషన్‌, జీఎస్టీ చార్జెస్‌, సాలరీ అగ్రిమెంట్‌ ఫీజు అంటూ దఫదఫాలుగా రూ.26 వేలు లాగేశారు. ఇవన్నీ తిరిగి చెల్లించేస్తామనీ, మరో రూ.15 వేలు పే చేయాలని కోరడంతో అనుమానం వచ్చిన బాధిత యువకుడు, ఉద్యోగం వద్దని తన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేయడంతో ఫోన్‌ కట్‌ అయింది. అక్కడ నుంచి ఫోన్‌ స్విచాఫ్‌ రావడంతో సోమవారం పోలీసులుకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. 


Updated Date - 2022-05-24T06:43:26+05:30 IST