అలా చేస్తే.. మేము ఇంకా ఎక్కువ సక్సెస్ అయినట్లు భావిస్తా: శేఖర్ కమ్ముల

Sep 24 2021 @ 19:28PM

నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా సెన్సిబుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవ్ స్టోరి’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్ల సక్సెస్ టాక్‌ని సొంతం చేసుకుంది. ఈ సక్సెస్ సంతోషాన్ని లవ్ స్టోరి టీమ్ పాత్రికేయులతో పంచుకుంటూ.. ఏషియన్ సినిమాస్ సంస్థ కార్యాలయంలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘‘ఎన్నో కష్టాలు పడి ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ప్రేక్షకులు మా సినిమాకు గొప్ప విజయాన్ని అందించారు. లవ్ స్టోరి సినిమా తమకు బాగా నచ్చిందని చెబుతున్నారు. ఈ విజయం గురించి వింటుంటే మాటలు రావడం లేదు. ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. కులం పేరుతో ఇబ్బందులు పడే హీరోకు, చిన్నప్పటి నుంచి వివక్షకు, బాధలకు గురైన అమ్మాయికి మధ్య తెరకెక్కించిన ఈ కథను ప్రేక్షకులు బాగా రిసీవ్ చేసుకున్నారు. నిర్భయ ఘటన జరిగిన తర్వాత సొసైటీకి మంచిని చెప్పే ఒక సినిమా చేయాలని అనుకున్నాను. ఆ తర్వాత స్కూల్స్, కాలేజీలకు వెళ్లి ధీర నువ్వే ధీర అనే అవేర్‌నెస్ ప్రోగ్రాం చేశాం. ఈ కార్యక్రమంలో ఇంటిలో, బయటా ఇబ్బందులకు గురయ్యే అమ్మాయిలను నిర్భయంగా మాట్లాడమని చెప్పాం. అక్కడి నుంచి ఈ సినిమా కథకు ఇన్సిపిరేషన్ దొరికింది. లవ్ స్టోరి కథను తెరకెక్కించడం కత్తి మీద సాము. అలాంటి కథను బాగా చూపించామని చెబుతుండటం సంతోషంగా ఉంది. తాము పడుతున్న ఇబ్బందులను ఒక ఆడపిల్ల బయటకు చెప్పుకోగలిగే ధైర్యం ఈ సినిమా చూసి తెచ్చుకుంటే, వివక్షకు గురైన ఒక ఊరి అబ్బాయి ఇది నా కథ అని రిలేట్ చేసుకుంటే మేము ఇంకా ఎక్కువ సక్సెస్ అయినట్లు భావిస్తాను. నా సినిమాల మీద ఉన్న నమ్మకంతో థియేటర్లకు వచ్చిన ఆడియెన్స్‌కు థాంక్స్. నాగ చైతన్య, సాయిపల్లవి తమ క్యారెక్టర్స్‌లో లీనమై సహజంగా నటించారు. మా యూనిట్‌లోని ప్రతి ఒక్కరికి ఈ సందర్బంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను..’’ అన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.