ఎక్స్‌క్లూజివ్: ‘లవ్‌ స్టోరి’ (థియేటర్) వర్సెస్ ‘టక్ జగదీష్’ (ఓటీటీ)

Aug 19 2021 @ 19:53PM

టాలీవుడ్‌లో ఫస్ట్ టైమ్ ఓ ఆసక్తికర పోటీ జరగబోతోంది. కరోనా టైమ్‌లో విజృంభించిన ఓటీటీలకు, అదే సమయంలో దిక్కుతోచని పరిస్థితులను ఎదుర్కొన్న థియేటర్లకు మధ్య ఇప్పుడు నువ్వా? నేనా? అనేలా యుద్ధ వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితులు కనబడుతున్నాయి. అందుకు శేఖర్ కమ్ముల ‘లవ్‌ స్టోరి’, నాని ‘టక్ జగదీష్’ చిత్రాలు వేదిక కాబోతున్నాయి. ‘లవ్‌ స్టోరి’ చిత్రం థియేటర్లలో, ‘టక్ జగదీష్’ ఓటీటీలో ఒకేరోజు.. సెప్టెంబర్ 10న విడుదలయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వాస్తవానికి ఈ రెండూ థియేటర్స్‌లో విడుదలవ్వాల్సిన చిత్రాలే. కానీ ‘టక్ జగదీష్’ నిర్మాతలు ఓటీటీ వైపు మొగ్గు చూపినట్లుగా, ఇందులో తన పాత్ర ఏం లేదన్నట్లుగా హీరో నాని కూడా రీసెంట్‌గా ఓ లేఖను విడుదల చేశారు. థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదలవుతోన్న నాని రెండో చిత్రమిది. అంతకుముందు ‘వి’ చిత్రం ఓటీటీలోనే విడుదలైంది. ఇప్పుడీ రెండు చిత్రాల రిజల్ట్‌తో థియేటరా, ఓటీటీనా? అనే దానిపై కూడా నిర్మాతలకు ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.

‘లవ్‌ స్టోరి’ వర్సెస్ ‘టక్ జగదీష్’

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్‌ స్టోరి’. ప్రేమకథా చిత్రాలను సెన్సిబుల్‌గా చెప్పడంలో శేఖర్ కమ్ముల సిద్ధహస్తుడు. ‘ఫిదా’ తరహాలో ఉన్న ఈ చిత్రంతో మరోసారి శేఖర్ కమ్ముల ప్రేక్షకులని ఫిదా చేయడం ఖాయం అనేలా ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి విడుదలైన పోస్టర్స్, ప్రోమోస్ తెలిపాయి. అలాగే డ్యాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి ఈ చిత్రానికి ప్రదాన ఆకర్షణ. ‘వచ్చిండే..’ అంటూ వచ్చిన పాట ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. అలాగే నిర్మాతలు కూడా ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలని.. ఇప్పటి వరకు వెయిట్ చేస్తూ వచ్చారు. మధ్యలో ఓటీటీల నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినా.. సినిమాపై ఉన్న నమ్మకంతో థియేటర్లలోనే విడుదల చేసి హిట్ కొట్టాలని వినాయకచవితికి వదలుతున్నారు. వారి నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూడాలి. 


ఇక ‘టక్ జగదీష్’ విషయానికి వస్తే నాని కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లుగా ఈ సినిమాకు సంబంధించి జరిగిన ‘పరిచయ వేడుక’లో కనిపించారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి హిట్ చిత్రాల దర్శకుడైన శివ నిర్వాణకు ఇది హ్యాట్రిక్ చిత్రం. పవర్ ఫుల్ కథతో ఈ చిత్రం తెరకెక్కినట్లుగా చిత్ర టీజర్ కూడా తెలియజేసింది. రీతూ వర్మ, ఐశ్వర్యరాజేష్ హీరోయిన్లు. జగపతిబాబు, నాజర్ వంటి వారితో ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ అయ్యేలా ఈ చిత్రం రూపొందింది. టక్ చేసుకున్నా.. ఈ సినిమాలో నాని చేసింది మాస్ క్యారెక్టర్ అనేది ఆల్రెడీ దర్శకుడు చూపించాడు. టీజర్ విడుదల తర్వాత సినిమాపై భారీగానే అంచనాలు పెరిగాయి. బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిన సినిమానే.. కానీ నిర్మాతలు ఓటీటీ బాట పట్టారు కాబట్టి.. ప్రేక్షకులను ఎంత వరకు ఈ సినిమా రీచ్ అవుతుందో చూడాలి.

శేఖర్ కమ్ముల వర్సెస్ నాని 

ఈ పోటీని సెన్సిబుల్ దర్శకుడికి, న్యాచురల్ స్టార్‌కి మధ్య పోటీగా కొందరు భావిస్తుండటం విశేషం. శేఖర్ కమ్ముల చిత్రాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌ని టార్గెట్ చేస్తూ శేఖర్ కమ్ముల చిత్రాలు చేస్తుంటాడు. ఇక నాని విషయానికి వస్తే.. ఆల్‌రౌండర్‌గా అన్ని తరహా పాత్రలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ సినిమాలో క్లాస్ టచ్‌తో మాస్‌గా కనిపిస్తున్నాడు. ఫైనల్‌గా ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇతి వృత్తంగా తెరకెక్కిన ఈ రెండు చిత్రాలు రెండు మాధ్యమాలలో ఎలాంటి స్పందనను అందుకుంటాయో వెయిట్ అండ్ సీ.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.