ఇకపై గ్రూప్‌-1 అభ్యర్థుల ఎంపిక ఇలా..! జీవో జారీ

ABN , First Publish Date - 2022-04-26T15:30:18+05:30 IST

గ్రూప్‌-1కు ప్రిపేరవుతున్నారా!? ప్రిలిమినరీకి అర్హత సాధించిన తర్వాత 1:50 నిష్ఫత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో ఆరు పేపర్లు రాయాల్సి ఉంటుంది! ఒక్కొక్క పేపర్‌కు 150 చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష ఉంటుంది! గతంలో..

ఇకపై గ్రూప్‌-1 అభ్యర్థుల ఎంపిక ఇలా..! జీవో జారీ

6 పేపర్లు.. 900 మార్కులు

ఇంటర్వ్యూలు లేకుండానే గ్రూప్‌-1 అభ్యర్థుల ఎంపిక

గ్రూపు-2 పోస్టులకు కూడా ఇంటర్వ్యూలు రద్దు

పోస్టుల వర్గీకరణ, పరీక్ష విధానం, సిలబస్‌, 

మార్కులపై సర్కారు స్పష్టత.. జీవో జారీ చేసిన సీఎస్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): గ్రూప్‌-1కు ప్రిపేరవుతున్నారా!? ప్రిలిమినరీకి అర్హత సాధించిన తర్వాత 1:50 నిష్ఫత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో ఆరు పేపర్లు రాయాల్సి ఉంటుంది! ఒక్కొక్క పేపర్‌కు 150 చొప్పున మొత్తం 900 మార్కులకు పరీక్ష ఉంటుంది! గతంలో 1000 మార్కులకు పరీక్షలు, ఇంటర్వ్యూ ఉండేది. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎత్తేశారు కనక 900 మార్కుల రాత పరీక్షలోనే సత్తా నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉద్యోగాల భర్తీ, పరీక్షల విధానంపై ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. ఇంటర్వ్యూలు లేకుండానే గ్రూప్‌-1, గ్రూప్‌-2 పోస్టులను రాత పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తామని తెలిపింది.


టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్‌-1, 2, 3, 4 పోస్టుల వర్గీకరణ, పరీక్ష విధానం, ప్రశ్నపత్రాలు, సిలబస్‌, పరీక్షా సమయం, మార్కులు తదితర వివరాలతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ సోమవారం ఉత్తర్వులు (జీవో నంబర్‌ 55) జారీ చేశారు. నియామకాలు మరింత పారదర్శకంగా ఉండడానికే ఇంటర్వ్యూలు రద్దు చేశామని పేర్కొన్నారు. పోస్టుల వర్గీకరణ, పరీక్ష విధానంపై టీఎ్‌సపీఎస్సీ సందేహాలు లేవనెత్తిందని, వాటిపై స్పష్టత ఇస్తున్నామని తెలిపారు. ఎప్పట్లాగే, గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో ఓపెన్‌ కేటగిరీ అభ్యర్థులకు 40%; బీసీలకు 35%, ఎస్సీ, ఎస్టీలు, దివ్యాంగులకు 30ు కటాఫ్‌ మార్కులుగా పేర్కొన్నారు.


గ్రూప్‌-1 పోస్టులు ఇవీ..

గ్రూప్‌-1 కేటగిరీలో 19 రకాల పోస్టులుంటాయని సర్కారు తెలిపింది. అవి.. డిప్యూటీ కలెక్టర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (క్యాటగిరీ-2), కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్‌, డివిజనల్‌ ఫైర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌, మునిసిపల్‌ కమిషనర్‌ (గ్రేడ్‌-2), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (సోషల్‌ వెల్ఫేర్‌, డిస్ట్రిక్ట్‌ సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి, బీసీ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌, జిల్లా గిరిజన సంక్షేమాధికారి, జిల్లా ఎంప్లాయ్‌మెంట్‌ అధికారి, వైద్య ఆరోగ్య శాఖలోని అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌, ట్రెజరర్‌ (గ్రేడ్‌-2), అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ లెక్చరర్‌ ఇన్‌ ట్రెయినింగ్‌ కాలేజ్‌ అండ్‌ స్కూల్‌, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌, మండల పరిషత్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌.


గ్రూప్‌-2 పోస్టులు ఇవీ..

గ్రూప్‌-2లో 16 రకాల పోస్టులుంటాయి. అవి.. మునిసిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-3, అసిస్టెంట్‌ కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌, డిప్యూటీ తహసిల్దార్‌, సబ్‌ రిజిస్ట్రార్‌ గ్రేడ్‌-2, జూనియర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ (సహకార శాఖ), అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌, పంచాయతీరాజ్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌, ఎక్సైజ్‌ శాఖ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, చేనేత అసిస్టెంట్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌, దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-1, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (సెక్రటేరియట్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (లెజిస్లేచర్‌), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (ఆర్థిక శాఖ), అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ (న్యాయ శాఖ) పోస్టులుంటాయి. వీటికి కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూలను ఎత్తివేసింది. ఒకే రాత పరీక్ష ఉంటుంది. ఇందులో నాలుగు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 150 మార్కులుంటాయి.


గ్రూప్‌-3 పోస్టులు ఇలా..

గ్రూప్‌-3 కింద 8 కేటగిరీల పోస్టులుంటాయి. సీనియర్‌ అసిస్టెంట్‌ (ప్రభుత్వ బీమా సేవలు), ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌ సర్వీసెస్‌), సీనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీస్‌), సీనియర్‌ ఆడిటర్‌ (లోకల్‌ ఫండ్‌), అసిస్టెంట్‌ ఆడిటర్‌ (పే అండ్‌ అకౌంట్స్‌), జూనియర్‌ అసిస్టెంట్స్‌ (విభాగాధిపతులు), జూనియర్‌ అకౌంటెంట్‌ (ట్రెజరీస్‌), జూనియర్‌ అకౌంటెంట్‌ (లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌) పోస్టులుంటాయి. గ్రూప్‌-3కు కూడా ఒకే ఒక రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో మూడు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున మొత్తం 450 మార్కులుంటాయి.


గ్రూప్‌-4లో ఇలా..

గ్రూప్‌-4 విభాగంలో అన్ని శాఖల్లోని జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులుంటాయి. దీనికి 150 మార్కులతో జనరల్‌ స్టడీస్‌, మరో 150 మార్కులతో సెక్రటేరియల్‌ ఎబిలిటీస్‌ పేపర్‌ ఉంటాయి. మొత్తం 300 మార్కులతో ఈ పరీక్షను నిర్వహిస్తారు.

Updated Date - 2022-04-26T15:30:18+05:30 IST