Advertisement

స్వీయ జాగ్రత్తే..!

Apr 22 2021 @ 23:54PM
నగరంలోని బిర్లాగేట్‌ వద్ద మాస్కు ధరించని వాహనదారులకు పోలీసుల కౌన్సెలింగ్‌

  1. సెకండ్‌ వేవ్‌లో పెరుగుతున్న కేసులు
  2. కరోనాపై ప్రజల్లో కొరవడిన అప్రమత్తత
  3. తీవ్రత పెరిగితే కఠిన నిబంధనలు తప్పవు
  4. హెచ్చరిస్తున్న నిపుణులు, అధికారులు

నగరంలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం దగ్గర్లో ఉండే అపార్ట్‌మెంట్‌ అది. 120 కుటుంబాలు నివసిస్తున్నాయి. 20 కుటుంబాలు పాజిటివ్‌ బారిన పడ్డాయి. తొలి దశలో అప్రమత్తంగానే ఉన్నారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ నుంచి తప్పించుకోలేకపోయారు. 

కర్నూలు జీజీహెచ్‌ , ఇరిగేషన్‌, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, జిల్లా పరిషత్‌, కార్పొరేషన్‌ వంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పలువురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన అధికారి కూడా కరోనా బారిన పడ్డారు. సహ ఉద్యోగులు పరీక్షలు చేయిం చుకుంటే మరో నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.

కర్నూలు, ఆంధ్రజ్యోతి: కరోనా సెకెండ్‌ వేవ్‌ సునామీలా చుట్టుముడుతోంది. మరణాలు కూడా అధికంగా సంభవిస్తున్నాయి. ఈ సీజన్‌లో తొలిసారిగా గురువారం వెయ్యి కేసులు దాటాయి. ఏప్రిల్‌ 1 నుంచి 21 మధ్య 24 మంది మృతి చెందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నో లాక్‌డౌన్‌ అని ప్రకటించడం ఊరటనిచ్చేదే. అలా అని జాగ్రత్తలు పాటించకపోతే ప్రభుత్వాలు కఠిన నిబంధనలు తెచ్చే ఆస్కారం కూడా ఉంది.  వైరస్‌ రాకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం ఎంత ముఖ్యమో.. పాజిటివ్‌ వచ్చిన వారి విషయంలో ప్రభుత్వమే బాధ్యతగా వ్యవహరించి మరొకరికి సోకుండా వైద్యం అందించాలి. తద్వారా మరణాలను కట్టడి చేయాలి. కానీ జిల్లాలో ఎక్కడా కరోనా జాగ్రత్తలు పాటించడంలేదు. దీంతో వైరస్‌ మరింత విజృంభిస్తోది.. 


జాగ్రత్తలు పాటించాల్సిందే

జీవితంలోని అనివార్యమైన పనుల వల్ల ఇళ్లలోనే ఉండటం వీలు కాదు. దీనికి కనీస పరిష్కారం మాస్క్‌లు, శానిటైజర్లు వాడటం. జేబులో సెల్‌ఫోన్‌, మనీ పర్సులాగే మాస్క్‌, శానిటైజర్‌ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించకుంటే వైరస్‌ సోకిన వ్యక్తి ద్వారా మరికొంత మందికి వ్యాప్తి చెందుతుంది. ఈ స్పృహ ప్రతిఒక్కరిలో ఉండాలి. బయటికి వెళ్లి వచ్చాక కాళ్లు, చేతులు కడుక్కోవాలి. వ్యాపార సంస్థలు, థియేటర్లు, ఇతర రద్దీ కూడళ్లలో వ్యాపారులు కూడా స్వీయ నిబంధనలు పాటిస్తే లాక్‌డౌన్‌ ముప్పును తప్పించుకున్నట్లవుతుంది. 


వేలాదిగా కేసులు, 24 మరణాలు

మార్చి చివరి నుంచి కేసులు అనూహ్యంగా పెరగడం మొదలైంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కేసులు వందల్లోకి చేరాయి. 21వ తేదీన 958 కేసులు, 22న 1367 కేసులు నమోదయ్యాయి. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమయ్యాక ఇదే అత్యధిక సంఖ్య. మార్చిలో 5 మరణాలు సంభవించగా, ఈ నెలలో 21వ తేదీ నాటికే 24 మరణాలు నమోదయ్యాయి. ఇవన్నీ అధికారికంగా ప్రకటించినవి మాత్రమే. అనధికారికంగా ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినట్లుగా నిర్ధారిస్తున్నవి రోజుకు మూడుకు పైగా ఉన్నట్లు సమాచారం. 


వైద్యులు చెబుతున్న కరోనా కొత్త లక్షణాలు

సెకెండ్‌ వేవ్‌లో కొన్ని కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. మొదట కొద్దిపాటి జ్వరం, అల సట, కండరాల నొప్పులు, దగ్గు, గొంతులో మంట, ముక్కు కారడం, వికారం, వాంతులు, కడుపులో నొప్పి, నీళ్ల విరోచనాలు వంటి లక్షణాలు ఉంటా యి. ఈ లక్షణాలున్న వారు సీటీ స్కాన్‌ పరీక్షలో వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు. వెంటనే హోం ఐసొ లేషన్‌కు వెళ్లాలి. ఆసుపత్రుల్లో చికిత్స పొందాలి. 

రెండో దశలో తరచూ కొద్దిపాటి జర్వంతో పాటు దగ్గుతో బాధపడుతున్నారు. వీరి ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులను వెంటనే ఐసొలేషన్‌ నుంచి ఆసుపత్రులకు తరలించాల్సి ఉంటుంది. 

మూడో దశలో తీవ్రమైన న్యుమోనియా వస్తుంది. ఫలితంగా శ్వాస వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. శ్వాస అందడం కష్టమై రక్తంలో ఆక్సిజన్‌ 92 శాతం కంటే కిందకు పడిపోతుంది. 

నాలుగో చాలా క్లిష్టమైన దశ అనే చెప్పాలి. ఈ దశలో కొవిడ్‌కు గురైన వ్యక్తులకు తీవ్రమైన శ్వాసకోశ సంబంధ ఇబ్బందులు తప్పవు. ఊపిరి తిత్తుల్లో రక్తం గడ్డ కట్టడం, మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు ఇతర శరీర భాగాలకు సరిపడినంత ఆక్సిజన్‌ అందక హార్ట్‌ ఎటాక్‌ రావచ్చు.


పోలీసు జరిమానాలు

మాస్క్‌లు వాడకుండా 30 శాతం పైగా ప్రజలు రోడ్ల మీద తిరుగుతు న్నారు. ఇది మిగిలిన వారిని భయాందోళనలకు గురి చేస్తోంది. పోలీసులు నెల నుంచి మాస్క్‌లు పెట్టుకోకుండా రోడ్లపైకి వచ్చే వాహనదారులు, పాదచారులకు రూ.100-120 చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. జిల్లాలో ఇలాంటి వారిపై 56,907 కేసులు నమోదు చేశారు. 19 రోజుల్లో రూ.40,83,700 జరిమానా వసూలు చేశారు. అయినా రోడ్లు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, థియేటర్లు ఇతరత్రా చోట్ల నిబంధనలు పాటించడం లేదు. 


పకడ్బందీగా అమలు చేయట్లేదు

కరోనా కేసులు పెరుగుతున్నా నామమాత్రపు చర్యలు తీసుకుంటు న్నారు. నిబంధనలు పకడ్బందీగా అమలు చేయడం లేదు. జరిమానాలు విధించడమే గాక ప్రజలకు అవగాహన కల్పించాలి. వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలి. ప్రధాన కూడళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్‌ మాల్స్‌ పని చేస్తున్నప్పుడు కరోనా వ్యాప్తిని ఎలా నియంత్రిస్తారు? - కందుకూరి సూర్యకుమార్‌, కర్నూలు


10 రోజులు లాక్‌డౌన్‌ పెట్టాలి

స్వీయ నిర్బంధం తప్పనిసరి. అది పాటించకుంటే ఢిల్లీ తరహాలో 10 రోజులు లాక్‌డౌన్‌ పెట్టాలి. చివరు తెలంగాణలో మాదిరి రాత్రి కర్ఫ్యూ అయినా పెట్టడం మంచిది. కరోనా వైరస్‌ను నియంత్రిం చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకోలేదు. - ఎన్‌.వెంకటరామరాజు, ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు 


వ్యాక్సిన్‌ వేసుకోవడమే పరిష్కారం

కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే వ్యాక్సిన్‌ వేసుకోవడమే పరిష్కారం. అనవసరంగా ఇంట్లో నుంచి బయటికి రాకూడదు. బయటికి వచ్చినా మాస్కులు ధరించాలి. ఈ రెండు నెలలు శుభకార్యాలు, ప్రయాణాలు రద్దు చేసుకోవడం మంచింది. - ఎన్‌.శేషగిరిరావు, కార్మిక శాఖ ఉప కమిషనర్‌

 
కర్నూలు సి.క్యాంప్‌ రైతు బజార్‌ వద్ద గురువారం ఇలా..


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.