Advertisement

ఆత్మ వంచన.. పర నింద!

Feb 9 2020 @ 04:54AM

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కూడా ముఖ్యమంత్రి జగన్‌ యూటర్న్‌ తీసుకున్నట్టే! ఎన్నికలకు ముందు హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఊదరగొట్టిన జగన్‌.. ఇప్పుడు ఆ ఊసే మరిచిపోయారు. అయితే ప్రజలను మభ్యపెట్టడానికై ‘మేము అడిగినట్టు చేస్తాం.. మీరు కాదన్నట్టు చెప్పండి’ అని బీజేపీ నాయకులతో అవగాహన కుదుర్చుకున్నట్టు కనపడుతోంది. చాలా రోజుల తర్వాత హోదా గురించి ప్రస్తావిస్తూ జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. అంతే... బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు స్పందిస్తూ.. ‘‘రాని, లేని హోదా గురించి మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది’’ అని హెచ్చరించారు. అంతే... వైసీపీ నాయకుల నోళ్లకు తాళాలు పడిపోయాయి. అదే ప్రతిపక్షంలో ఉండివుంటే జగన్‌ మరోలా వ్యవహరించేవారు. జీవీఎల్‌ అంతగా హెచ్చరించినా ‘‘ఏమి చేస్తారు? హోదా మా హక్కు’’ అని ముఖ్యమంత్రి ఒక్క మాట అనలేకపోయారంటే ఆయన బలహీనతలు ఏమిటో అర్థంకావడం లేదా?


‘‘ఆంధ్రప్రదేశ్‌ నుంచి కియా మోటార్స్‌ను తరలించే ఆలోచనలో యాజమాన్యం’’ అని రాయిటర్స్‌ వార్తాసంస్థ ఇచ్చిన వార్త జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ఒక కుదుపు కుదిపేసింది. ఈ వార్తను ప్రభుత్వంతోపాటు కియా యాజమాన్యం ఖండించినప్పటికీ ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. గిట్టనివారు ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు దుమ్మెత్తిపోశారు. అయినా నిప్పు లేనిదే పొగ వస్తుందా? అని సణుగుతున్నవారూ ఉన్నారు. ఈ పరిస్థితికి ప్రభుత్వ వ్యవహార శైలే ప్రధాన కారణం. ప్రతిపక్షాలను, మీడియాను నిందించవచ్చు గానీ, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, తీసుకుంటున్న నిర్ణయాలే ఈ పరిణామానికి దారితీశాయి. గత ప్రభుత్వ నిర్ణయాలను రద్దు చేయడం, లేదా తిరగదోడటం వల్లనే రాష్ట్రంలో ఒక రకమైన అనిశ్చిత వాతావరణం నెలకొంది. పెట్టుబడిదారుల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పరిశ్రమలకు గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను సమీక్షించబోతున్నామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ప్రకటించారు. దాంతో ఆందోళన చెందిన కియా మోటార్స్‌ యాజమాన్యం ప్లాంట్‌ తరలింపు ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు రాయిటర్స్‌ వార్తా సంస్థకు లీక్‌ చేసి ఉంటుంది. దీనివల్ల తమ సంస్థకు ఇచ్చిన రాయితీలను కొనసాగించేలా ప్రస్తుత ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే ఆ కంపెనీ వ్యూహం అయి ఉంటుంది. నిజానికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌రెడ్డి కియా పరిశ్రమ ఏర్పాటుపై పలు విమర్శలు చేశారు. అదో కుంభకోణం అని ఆరోపించారు. కియా ఏర్పాటులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర ఏమీ లేదన్నట్టుగా ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్‌రెడ్డి ఆ ప్లాంటును సందర్శించినప్పుడు కూడా ముభావంగా ఉన్నారు. ఆయన సమక్షంలోనే స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్‌ కంపెనీ సీఈఓ వైపు వేలెత్తి చూపి హెచ్చరించడం చూశాం. అక్కడితో ఆగకుండా కంపెనీ ఉత్పత్తి చేసిన కారుపై నిరసన వ్యాఖ్యలు రాశారు. ఈ చర్యలన్నీ అధికార పార్టీ వారే చేశారు కనుక ప్రతిపక్షాలనో, మీడియానో నిందించలేరు. జగన్‌ అండ్‌ కో వ్యవహార శైలిపై ఇంటా–బయటా విమర్శలు వస్తున్నప్పటికీ, వారు మాత్రం ఆత్మపరిశీలన చేసుకోవడానికి ప్రయత్నించకుండా మీడియాను నిందించడం అలవాటుగా పెట్టుకున్నారు. స్థానిక మీడియాను పచ్చ మీడియాగా అభివర్ణిస్తూ తమను తాము మభ్యపెట్టుకుంటున్నారు. జాతీయ మీడియాకు, అంతర్జాతీయ మీడియాకు పచ్చ రంగు పూస్తే బాగుండదు కనుక దుష్ప్రచారం అని బుకాయిస్తున్నారు. దేశంలో ఇన్ని రాష్ట్రాలుండగా, ఒక్క జగన్మోహన్‌రెడ్డినే విమర్శించవలసిన అవసరం జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ఎందుకు ఉంటుందని ఒక్క క్షణం కూడా ఆలోచించడానికి ఇష్టపడటం లేదు. సోషల్‌ మీడియాలో జగన్మోహన్‌రెడ్డికి ట్రోలింగ్‌ పెరిగిపోయింది. ఈ తరుణంలో ‘ది హిందూ’ పత్రిక చైర్మన్‌ ఎన్‌.రామ్‌ రెండు రోజుల క్రితం విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా జగన్మోహన్‌రెడ్డిని ప్రశంసించారు. అంతే.. అప్పటివరకు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసిన కలం యోధుడుగా పేరొందిన రామ్‌పై కూడా విమర్శలు మొదలయ్యాయి. జగన్మోహన్‌రెడ్డిపై తీవ్రమైన అవినీతి కేసులు ఉన్న విషయం రామ్‌కు తెలియదా? ఇంతమంది ముఖ్యమంత్రులు ఉండగా జగన్‌పై ఆయనకు ప్రత్యేక అభిమానం ఎందుకు? అంటూ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్‌.కృష్ణారావు ఏకంగా ట్వీట్‌ చేశారు. మూడు రాజధానుల నిర్ణయంపై అదే హిందూ పత్రిక ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించగా, 83 శాతం మంది వ్యతిరేకించారు. రాష్ట్రంలో స్థూలంగా నెలకొన్న పరిస్థితి ఇది! అన్న క్యాంటీన్‌లు మూసివేస్తున్నారు.. రాజధానికి బడ్జెట్‌లో రూ.500 కోట్లు మాత్రమే కేటాయించడాన్ని బట్టి అమరావతిని అభివృద్ధి చేయరు అని మీడియా విశ్లేషించినప్పుడు ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. రిలయన్స్‌, టాటా, అదానీ గ్రూపులు వెళ్లిపోతున్నాయి అన్నప్పుడు పచ్చ మీడియా పిచ్చి రాతలు అని నిందించారు. చివరకు అవన్నీ నిజం అయ్యాయి. నవరత్నాల పేరు చెప్పి అమలులో ఉన్న సంక్షేమ పథకాలను కుదించే పనిలో జగన్‌ సర్కారు ఇప్పుడు బిజీగా ఉంది. పెన్షన్లను కుదించారు. అనర్హుల పేరిట దాదాపు 20 లక్షల తెల్ల రేషన్‌ కార్డులు తొలగించబోతున్నారు. కళ్ల ముందు కనిపిస్తున్న ఈ వాస్తవాలకు కూడా పచ్చ రంగు పూసి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అసత్యాలు ప్రచురిస్తే మీడియాపై కేసులు పెట్టడానికి ప్రత్యేకంగా జీవో తెచ్చిన ఈ ప్రభుత్వంపై ఏ మీడియా కూడా దుందుడుకుగా వ్యవహరించదు. అయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చే వార్తలకు రంగులు పూస్తూ తమను తాము మభ్యపెట్టుకుంటున్నారు.


జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలను కేంద్ర మంత్రులే కాకుండా, హైకోర్టు కూడా తప్పుబట్టడం నిత్యకృత్యం అయ్యింది. వారికి కూడా రంగులు పూస్తారేమో తెలియదు. రాజధాని తరలింపును అధికార పార్టీవాళ్లు, ప్రభుత్వంతో పనులున్న వారు మినహా మిగతా అందరూ వ్యతిరేకిస్తున్నారు. అయినా పచ్చ మీడియా దుష్ప్రచారం అని సర్దిచెప్పుకొంటున్నారు. ఆత్మవంచన–పరనిందతో కాలక్షేపం చేస్తున్నారు. అమరావతి రైతులు మాత్రమే బాగుపడాలా? రాయలసీమ, ఉత్తర కోస్తాకు చెందిన రైతులు బాగుపడకూడదా? అని మొన్నటి వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుడిగా అధికారిక విధులు నిర్వహిస్తున్న కల్లం అజయ్‌రెడ్డి ఒక వితండవాదం చేస్తున్నారు. తన కులాన్ని తెలియజెప్పే రెడ్డి అనే పదం తన పేరు చివర ఉండకూడదని అజయ్‌ కల్లంగా పిలిపించుకున్న ఈ అధికారి.. ఇప్పుడు కుల విద్వేషంతో బుసకొట్టడం ఆశ్చర్యంగా ఉంది. సర్వీసులో ఉన్నప్పుడు అజయ్‌ కల్లం నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవహరించారు. అలాంటి అధికారి ఇప్పుడు ఇలా మారిపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. నిప్పుకు కూడా చెద పడుతుందని నమ్మాల్సిన పరిస్థితి కల్పించారు. అమరావతి అనేది స్థానిక రైతులకు మాత్రమే సంబంధించినది కాదు. రాష్ట్రాలు ఆర్థికంగా, పరిపుష్టిగా ఉండాలంటే మహానగరాలు అవసరం. రాజధాని ప్రాంతం మహానగరంగా అభివృద్ధి చెందితే రాష్ట్రం ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ వాస్తవాన్ని విస్మరించిన అజయ్‌ కల్లం.. రాజధానిని రైతుల సమస్యగా చిత్రించే ప్రయత్నం చేయడం ఆయనలోని సంకుచిత మనస్తత్వానికి నిదర్శనం. అమరావతిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పత్రికాధిపతులకు కూడా భూములున్నాయని విమర్శలు చేశారు. అక్కడ ఎవరు భూములు కొనుక్కున్నా ఆక్షేపించవలసింది ఏమీ లేదు. ఎకరం భూమి కొనుగోలు చేసినా, అందులో వారికి మిగిలేది 1,200 గజాలు మాత్రమే. మిగతా 3,600 గజాలు ప్రభుత్వానికి ఉచితంగా లభిస్తున్నాయి. రాజధాని రైతులు కూడా ఇదే విధంగా 1,200 గజాలు మాత్రమే పొందారు. రాజధాని నిర్మాణం జరిగితే తమకు దక్కే 1,200 గజాలకు మంచి ధర లభిస్తుందని రైతులు ఆశించడం అత్యాశ కాబోదు. రైతులకు దక్కేది ఎంత? అనే దానికన్నా ప్రభుత్వానికి.. అంటే రాష్ట్ర ప్రజలకు దక్కుతున్నది ఎంత? అన్న కోణంలోనే చూడాలి. ఇందుకు భిన్నంగా వాదించడం కుతర్కమే అవుతుంది. రాజధాని రైతులు చేసింది త్యాగం అనడానికి లేదనీ, ధరలు పెరుగుతాయన్న ఆశతో ఇచ్చారనీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. ఈ వాదనలో నిజం లేకపోలేదు.

రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో రాజధాని రైతులే కాదు ఎవరూ త్యాగాలు చేయరు. ఉభయకుశలోపరిగా ఉన్నప్పుడే ఏ ప్రతిపాదన అయినా ముందుకు సాగుతుంది. మేము ఏమీ అభివృద్ధి చేయం, మీ భూములను ఇవ్వండి అని అంటే.. ఇతర ప్రాంతాలవారు మాత్రం ఇస్తారా? ఇప్పుడు విశాఖపట్టణంలో భూసమీకరణను అక్కడి రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఉండవల్లి వంటివారు గమనించాలి. ప్రభుత్వంపై నమ్మకం ఉన్నప్పుడే ఏ ప్రతిపాదనకైనా ప్రజలు సానుకూలంగా స్పందిస్తారు. అమరావతి విషయంలో జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల ఆయనపై రాష్ట్రంలోని 13 జిల్లాల వారికీ నమ్మకం పోయింది. విశాఖలోనే కాదు.. మరెక్కడా కూడా ఇకపై ఏ ప్రభుత్వం కూడా భూసమీకరణ చేయలేని పరిస్థితిని జగన్‌ అండ్‌ కో కల్పించింది. ఎన్నికల ప్రచారంలో పేర్కొనని అంశాలపై నిర్ణయాలు తీసుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ఇదే అజయ్‌ కల్లం గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రచారం చేశారు. ఆస్ట్రేలియాలో విమానాశ్రయ నిర్మాణం విషయంలో అక్కడి ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరించింది అని కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ జగన్మోహన్‌రెడ్డి కూడా ఎన్నికలకు ముందు చెప్పకుండా రాజధాని తరలింపు నిర్ణయం తీసుకుంటున్నారు కనుక ప్రజాభిప్రాయం సేకరించాలని అజయ్‌ కల్లం చెప్పగలరా?


జగన్‌.. యూటర్న్‌లు!

జగన్మోహన్‌రెడ్డి నిర్ణయాలను మీడియా మాత్రమే కాదు.. సొంత పార్టీకి చెందిన నాయకులు, మంత్రులు కూడా ఆక్షేపిస్తున్నారు. అయితే బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేయడానికి ఎవరూ సాహసం చేయలేని పరిస్థితి! మా ముఖ్యమంత్రి ఆత్మపరిశీలన చేసుకోవలసిన తరుణం ఆసన్నమైందని ఒక మంత్రి ఇటీవల ప్రైవేట్‌ సంభాషణలలో వ్యాఖ్యానించారు. ‘‘అదేంటి.. ముఖ్యమంత్రిని గట్టిగా సమర్థించే మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు?’’ అని ప్రశ్నించగా... ‘‘ఏం చేస్తాం.. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంది మంత్రులను తప్పించి కొత్తవారితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకుంటానని మా వాడు మొదట్లో ప్రకటించాడు కదా? మంత్రులుగా కొనసాగే పది శాతంలో ఉండటానికే మేం ఇలా చొక్కాలు చించుకుంటున్నాం’’ అంటూ ఆ మంత్రి అసలు గుట్టు విప్పారు. ‘‘శాసనసభ్యుల సంగతి దేవుడెరుగు.. మంత్రులకు కూడా అపాయింట్‌మెంట్‌ లభించదు. అయినా భజన చేయక తప్పడం లేదు. మేం ఎవరిని ఏ రేంజ్‌లో తిట్టాలో స్ర్కిప్టు పంపుతారు.. ఆ ప్రకారమే తిట్టి పోస్తున్నాం. మాకు టికెట్లు ఇచ్చి గెలిపించింది అందుకే అని సర్దిచెప్పుకొంటున్నాం’’ అని అక్కడే ఉన్న ఒక ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ‘‘ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్యం ఉండదు. మా పార్టీలో అసలుకే ఉండదు’’ అని మరో నాయకుడు చెప్పుకొచ్చారు. ‘‘అయినా ప్రజలు కూడా ఇలా ఒక పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇవ్వకూడదు. ఇంత మందబలం ఉన్నప్పుడు పరిస్థితి ఇలాగే ఉంటుంది’’ అని ఇంకో మంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘పెన్షన్లు కట్‌ చేయడం, రేషన్‌ కార్డులు ఏరివేయడం రాజకీయంగా నష్టం కలిగిస్తుందని మా గత అనుభవం చెబుతోంది’’ అని కాంగ్రెస్‌ హయాంలో మంత్రిగా పనిచేసిన ఒకాయన గుర్తుచేశారు. ‘‘మా ముఖ్యమంత్రి ఎవరి మాటా వినరు కనుక నోటికి తాళం వేసుకున్నాం. మునిగితే అందరం మునుగుతాంలే అని గమ్మున ఉంటున్నాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.


వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ విచారణ కోరుతూ గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను జగన్మోహన్‌రెడ్డి ఇప్పుడు ఉపసంహరించుకోవడం కూడా రాజకీయంగా నష్టంచేస్తుందని అధికార పార్టీకి చెందినవారు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్‌రెడ్డి విలేకరుల సమావేశంలో సీబీఐ విచారణకు డిమాండ్‌ చేశారు. అప్పుడు ఆయన పక్కన వివేకా ఏకైక కుమార్తె డాక్టర్‌ సునీత కూడా ఉన్నారు. ఇప్పుడు జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎనిమిది నెలలు వేచి చూసిన డాక్టర్‌ సునీత.. సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పరిణామానికి బదులు ఇవ్వాల్సిన జగన్మోహన్‌రెడ్డి.. హైకోర్టులో గతంలో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. వివేకా హత్య జరిగిన రోజు గంటల తరబడి ఆయనది సహజ మరణంగా జగన్‌ మీడియా ప్రచారం చేసింది. ఆ తర్వాత మిగతా మీడియా ఆయనది హత్య అని ప్రసారాలు చేయడంతో.. హత్య వెనుక నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తం ఉందని జగన్‌ ఆరోపించడం మొదలుపెట్టారు. నారాసురవారి రక్తచరిత్ర అంటూ ఆయన మీడియాలో కథనాలు ప్రసారం చేయడంతోపాటు వాటిని ప్రచురించారు. ఆనాడు చంద్రబాబుపై అంతటి తీవ్ర ఆరోపణలు చేసిన జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు సీబీఐ విచారణ ఎందుకు వద్దు అంటున్నారో తెలియదు. పోనీ.. రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇప్పుడు తన చేతుల్లోనే ఉంది కనుక చంద్రబాబు పాత్ర ఉండి వుంటే రుజువు చేసి ఉండాల్సింది. ఈ రెండూ జరగకపోగా వివేకా హంతకులు ఎవరో కూడా ఇంతవరకు నిర్ధారణ కాలేదు. అంటే ఎన్నికలలో ప్రయోజనం పొందడానికి మాత్రమే ఆనాడు వివేకా హత్యను జగన్మోహన్‌రెడ్డి వాడుకున్నారని ఎవరు నిందించినా తప్పుపట్టాల్సింది లేదు. డేటా చౌర్యం జరిగిందంటూ అప్పట్లో జగన్‌ అండ్‌ కో చేసిన ప్రచారం కూడా ఈ కోవలోకే వస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల వ్యక్తిగత సమాచారం, బ్యాంక్‌ ఖాతాల వివరాలు చోరీకి గురయ్యాయనీ, అందుకు చంద్రబాబు, లోకేశ్‌ కారణమనీ అప్పట్లో నానా హడావుడి చేశారు. ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఈ వ్యవహారంలో అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహకారం తీసుకున్న జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ మౌనంగా ఉండటంలో ఆంతర్యం ఏమిటి? నిజానికి ఈ కేసులో తెలంగాణ పోలీసులు చేసిన దర్యాప్తులో ఏమీ తేలలేదు. అప్పుడు అంత హడావుడి చేసిన తెలంగాణ ప్రభుత్వం గానీ, పోలీసులు గానీ ఇప్పుడు మాట్లాడటం లేదు. చంద్రబాబుకు నష్టం చేయాలన్న లక్ష్యం నెరవేరింది కనుక ఇప్పుడు అందరూ సైలెంట్‌గా ఉన్నారని భావించవలసి ఉంటుంది. కోడి కత్తి కేసు కథ కూడా కంచికి చేరింది. ఇప్పుడు అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని కొత్త రాగం అందుకున్నారు.


నిజంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగివుంటే నిందితులను శిక్షించడానికి ఎనిమిది మాసాల సమయం సరిపోదా? ఎన్నికల ముందు రాజధాని అమరావతిలోనే ఉంటుందని జగన్‌ అండ్‌ కో ప్రకటించింది. అమరావతిలో రాజధాని ఏర్పాటును మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని నిండు సభలో ప్రతిపక్ష స్థానంలో ఉన్న జగన్మోహన్‌రెడ్డి అప్పట్లో ప్రకటించారు. ఆయన అలా ప్రకటించిన తర్వాత రాజధాని ప్రాంత రైతులలో విశ్వాసం ఏర్పడింది. అమరావతి నిర్మాణానికి అడ్డంకులు ఉండబోవని రైతులు భావించారు. ఫలితంగానే భూసమీకరణ సాఫీగా జరిగింది. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి యూటర్న్‌ తీసుకున్నారు. దీంతో ఇప్పటికే ఆ ప్రాంతంలో ఖర్చు చేసిన వేల కోట్ల రూపాయలు నిరర్ధకం అయితే, అందుకు జగన్మోహన్‌రెడ్డి కూడా బాధ్యత వహించవలసి ఉంటుంది. చంద్రబాబు మాత్రమే కాదు.. ఆయనకంటే ఎక్కువగా జగన్మోహన్‌రెడ్డి కూడా యూటర్న్‌లు తీసుకుంటారని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కూడా ముఖ్యమంత్రి యూటర్న్‌ తీసుకున్నట్టే! ఎన్నికలకు ముందు హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు లభిస్తాయని ఊదరగొట్టిన జగన్‌.. ఇప్పుడు ఆ ఊసే మరిచిపోయారు. అయితే ప్రజలను మభ్యపెట్టడానికై ‘మేము అడిగినట్టు చేస్తాం.. మీరు కాదన్నట్టు చెప్పండి’ అని బీజేపీ నాయకులతో అవగాహన కుదుర్చుకున్నట్టు కనపడుతోంది. చాలా రోజుల తర్వాత హోదా గురించి ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. అంతే... బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు స్పందిస్తూ.. ‘‘రాని, లేని హోదా గురించి మళ్లీ మళ్లీ ప్రస్తావిస్తే చంద్రబాబుకు పట్టిన గతే పడుతుంది’’ అని హెచ్చరించారు. అంతే.. వైసీపీ నాయకుల నోళ్లకు తాళాలు పడిపోయాయి. అదే ప్రతిపక్షంలో ఉండివుంటే జగన్‌ మరోలా వ్యవహరించేవారు. జీవీఎల్‌ అంతగా హెచ్చరించినా ‘‘ఏమి చేస్తారు? హోదా మా హక్కు’’ అని ముఖ్యమంత్రి‌ ఒక్క మాట అనలేకపోయారంటే ఆయన బలహీనతలు ఏమిటో అర్థంకావడం లేదా? కేంద్రంలో అధికారంలో ఉన్న కారణంగా రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, తెలుగుదేశంతో భారతీయ జనతా పార్టీ ఆడుకుంటున్నది. ఫలితంగా రాష్ట్ర ప్రయోజనాలు గాలికి పోతున్నాయి. తమిళనాడుకు, ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న తేడా ఇదే! ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని అవినీతి కేసుల భయం పట్టుకోగా, తనను కేసుల్లో ఇరికిస్తారేమోనన్న భయంతో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు భారతీయ జనతా పార్టీని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు. ఇది రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం! రెండు ప్రాంతీయ పార్టీలను దెబ్బతీసి ఎదగాలనుకుంటున్న బీజేపీ కూడా ఆ దిశగా అడుగులు వేయడం లేదు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఉన్నపళంగా ఢిల్లీ వెళ్లి బీజేపీతో ఎందుకు చేతులు కలిపారో అంతకంటే అర్థంకాని విషయం. రాజధాని కోసం పోరాటం చేస్తామంటూ ప్రకటనలు చేసి సరిపెట్టుకుంటున్నారు. మొత్తంమీద ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు, రాజకీయాలు అంతుపట్టని రీతిలో ఉంటున్నాయి. అందుకే కాబోలు తెలంగాణ సోదరుడు ఒకరు.. ఆంధ్రా ప్రజలను తిట్టిన తిట్టు తిట్టకుండా తన ఆవేదనను రికార్డు చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. రాష్ట్రం పట్ల తెలంగాణ వారికి ఉన్న ఆవేదన కూడా ఆంధ్రా ప్రజలకు లేకపోవడం ఒక విషాదం. ఆంధ్రులకు రాజధాని యోగం లేదని అంటుంటారు. అది నిజమేనని ఇప్పుడు అనిపిస్తోంది!

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

ఆర్కే

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.