స్వరాజ్యం నా జన్మ హక్కు

ABN , First Publish Date - 2022-03-04T06:50:35+05:30 IST

‘స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దాన్ని పొంది తీరుతాను’ అని బొంబాయి (నేటి ముంబై)లోని జైలు నుంచి బయటకు వస్తూ బాల గంగాధర్ తిలక్ గర్జించారు...

స్వరాజ్యం నా జన్మ హక్కు

‘స్వరాజ్యం నా జన్మ హక్కు. నేను దాన్ని పొంది తీరుతాను’ అని బొంబాయి (నేటి ముంబై)లోని జైలు నుంచి బయటకు వస్తూ బాల గంగాధర్ తిలక్ గర్జించారు. తిలక్ మాట భారత్‌కు ఒక కొత్త నినాదమయింది. అది భారత స్వాతంత్ర్య సాధనకు దారి తీసింది. భారత స్వాతంత్ర్యోద్యమానికి తిలక్ మొదటి లోకమాన్య నాయకుడు అయ్యారు. స్వాతంత్ర్య సాధనకు ఆయన మొదటి నుంచీ చాలవరకు తీవ్రవాద దృక్ఫథాన్ని అనుసరించినప్పటికీ అంతిమ సంవత్సరాలలో స్వరాజ్య సందేశాన్ని గ్రామీణ భారతదేశానికి తీసుకువెళ్ళే కర్తవ్యాన్ని నిర్వహించారు. భారత్‌కు హోం రూల్ (స్వపరిపాలన)ను ఆయన డిమాండ్ చేశారు. ఈ లక్ష్య సాధనకు 1916 ఏప్రిల్‌లో హోం రూల్ లీగ్‌ను ఏర్పాటు చేశారు. తిలక్ వెలువరించిన స్ఫూర్తిదాయక ప్రసంగాల ఫలితంగానే హోం రూల్ లీగ్‌కు ఆ ప్రజాదరణ లభించింది. దేశ వ్యాప్తంగా చర్చలు, ఉపన్యాసాలు నిర్వహించడంతో పాటు రీడింగ్ రూమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఆంగ్లంలోనూ, దేశీయ భాషలలోనూ వార్తపత్రికలు, కరపత్రాలను ప్రచురించింది. స్వాతంత్ర్యోద్యమ లక్ష్యాల గురించి ప్రజలను చైతన్యపరిచింది. 1917లో హోం రూల్ లీగ్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా స్వరాజ్య సాధన ప్రాధాన్యాన్ని వివరిస్తూ నాసిక్‌లో లోకమాన్య తిలక్ వెలువరించిన స్ఫూర్తిదాయక ప్రసంగంలోని కొన్ని భాగాలు:


‘స్వాతంత్ర్యం నా జన్మహక్కు. స్వాతంత్ర్య కాంక్ష నాలో సజీవంగా ఉన్నంతవరకు నేను వృద్ధుడిని కాబోను. ఈ స్వాతంత్ర్య కాంక్షను ఏ ఆయుధమూ నరికివేయలేదు, ఏ అగ్నీ దహించివేయలేదు, ఏ నీరూ దానిని ముంచివేయలేదు, ఏ ప్రచండ మారుతమూ దాన్ని విసిరివేయలేదు. మనం స్వపరిపాలనను అడుగుతున్నాం, దాన్ని మనం పొంది తీరుతాం. స్వపరిపాలన ద్వారా మనం సాధించగలిగేదాన్ని బానిసత్వం ద్వారా సాధించలేమని రాజకీయ విజ్ఞానం మనకు బోధిస్తుంది. రాజకీయ పురోగతే ఒక జాతికి మూలస్తంభం. స్వాతంత్ర్యానికి ఆరాటపడేలా మీ ఆత్మను ఆమంత్రించదలుచుకున్నాను. ఆ స్వేచ్ఛ రాజకీయ పురోగతి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది’.


పరాయి పాలనకు బందీ అయిపోయిన మన జాతి ఆత్మను మనం రక్షించుకుని తీరాలి. అందుకు మనం శ్రమించాలి. అయితే మన జాతిని మనం సంరక్షించుకోవడమమనేది మన జన్మ హక్కు. కాంగ్రెస్ ఈ స్వపరిపాలనా తీర్మానాన్ని ఆమోదించింది: మన దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యల సాకుతో భారతీయులు స్వపరిపాలన డిమాండ్‌ను కొన్ని స్వార్థపర శక్తులు వ్యతిరేకిస్తున్నాయి. నిరక్షరాస్యత అటువంటి సమస్యలలో ఒకటి. మనమందరమూ ఏకమైతే దానిని నిర్మూలించగలం. అటువంటి సమస్యలను సహకారంతో మాత్రమే పరిప్కరించుకోగలమనే విషయాన్ని గుర్తుంచుకోండి. మన దేశంలోని నిరక్షరాస్యులు కూడా స్వరాజ్‌ను ప్రగాఢంగా కోరుకుంటున్నారు. ఇది మనకు బలం కావాలి. తమ పనిని సులువుగా నిర్వర్తించగలిగేవారు నిరక్షరాస్యులు కావచ్చు గానీ వివేకరహితులు కారు. అటువంటి వారు విద్యావంతుల వలే తెలివైన వారు. అక్షరాస్యత ఒక వ్యక్తి తెలివితేటలకు కొలమానం కాదు’.


స్వరాజ్‌ను సాధించడం అంతకష్టమేమీ కాదు. అందుకు నిరక్షరాస్యత ఏ విధంగానూ అవరోధం కాబోదు. మన స్వపరిపాలన లక్ష్య సాధనకు విద్యావంతులు ఎంత ముఖ్యమో నిరక్షరాస్య సోదరులూ అంతే ముఖ్యం’. ‘పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవు. నేడు భగవంతుడు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. స్వపరిపాలనను సాధించుకునేందుకు మనం గరిష్ఠంగా ప్రయత్నించాలి. మన పోరాటాన్ని ఉధృతం చేయాలి. లక్ష్య సాధన నుంచి వెనుకకు మరలవద్దు. అంతిమ ఫలితాన్ని నిండు నమ్మకంతో భగవంతుడి కృపకు వదిలివేద్దాం’.

Updated Date - 2022-03-04T06:50:35+05:30 IST