Advertisement

విద్యా వితరణలోనూ స్వప్రయోజనమా?

Oct 9 2020 @ 00:26AM

జగనన్న విద్యాకానుక అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ద్వారా విద్యార్థులకు అందజేస్తున్న బ్యాగ్, బెల్ట్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పేరు ముద్రించుకోవడం హాస్యాస్పదం. అనునిత్యం పాఠశాల ఆవరణలో జగన్ నామస్మరణ జరిగేలా ప్రచార ఆర్భాటానికి శ్రీకారం చుట్టడం కచ్చితంగా పసిహృదయాలను కలుషితం చేయడమే. పాఠశాలకి వెళ్లే పసివాళ్ల మదిలో రాజకీయ నాయకుల మోము మదిలో మెదలాలనుకోవడం భావితరాల భవిష్యతును ప్రశ్నార్ధకం చేయడమే అవుతుంది. 


సర్వశిక్ష అభియాన్ పథకం కింద కేంద్రప్రభుత్వం అందజేసే నిధులతో విద్యార్థులకు కల్పించే సౌకర్యాలకు సైతం తన పేరు పెట్టుకుంటూ నిధులన్నీ తానే సొంతంగా ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం దారుణం. విద్యాలయాల ప్రాంగణంలో రాజకీయాలకు, కులసంఘాలు తావుండకూడదు. అయినా తమ పార్టీ గుర్తులో ఉన్న రంగులను పాఠశాలలకు, కార్యలయాలకు వేయించడంతో కోర్టులు కలుగజేసుకొని మొట్టికాయలు వేసినా ప్రభుత్వం తీరు మారడంలేదు. ఇప్పుడేమో విద్యార్థులకు అందిచే కిట్లలోనే 5 వస్తువులలో బ్యాగ్, బెల్టుల వంటి వాటిమీద జగన్ తనపేరు ముద్రించుకోవడం చూసి విద్యావేత్తలు నివ్వెరపోతున్నారు. బడుగువర్గాల పేదరికాన్ని, అమాయకత్వాని తనకు అనుకూలంగా మలుచుకునే రీతిలో జగన్‌మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. కొత్త పథకాల ప్రచారం కోసమంటూ తన పత్రికకే ప్రకటనల రూపంలో కోట్లరూపాయలు చెల్లించి ప్రజాధనాన్ని లూటిచేస్తున్నారు. తమ ప్రభ్వుతం ఇచ్చే ప్రకటనలలో కేంద్రప్రభుత్వ పథకాల పేర్లు మార్చి అవన్నీ తమవేనని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారు. బడి కిట్లు కాంట్రాక్టును తస్మదీయులకే అప్పజెప్పారు. సౌచాలయాలు లేకపోవడం వల్ల చదువు మానుకుంటున్న విద్యార్ధినుల సంఖ్యా పెరుగుతోందని గ్రహించి ప్రతి పాఠశాలకు భవనాలు, మౌలిక సౌకర్యాలతో పాటు సౌచాలయాల నిర్మాణం, నిర్వహణ కోసం ప్రత్యేకంగా నెలకు 5000 వరకు కేంద్రం నిధులు సమకూరుస్తోంది. కేంద్రప్రభుత్వ నిధులతో సమకూరుస్తున్న పుస్తకాల్ని అందించడంతోపాటు, పౌష్ఠికాహారపథకాన్ని రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా అమలు చేస్తుంది. అయితే మధ్యాన్న భోజన పథకం పేరు మార్చి గోరుముద్ద అని పెట్టి సొంత మీడియాతో, వందిమాగదులతో భజన చేయంచుకున్నంత మాత్రాన ప్రజలకు నిజాలు తెలియవనుకోవడం అమాయకత్వమే అవుతుంది. గతంలో ప్రతిఏడాది 2 జతలు బట్టలు కుట్టించి ఇచ్చేవాళ్ళు దానికి ఒక జత మాత్రమే ఈ ప్రభుత్వం అదనంగా సమకూరుస్తోంది. కానీ మొత్తమంతా తామే ఇస్తున్నట్లు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటోంది. విద్యార్థినులకు ఇచ్చే సైకిళ్లు కూడా సర్వ శిక్ష అభియాన్ నిధుల నుంచి ట్రావెలింగ్ అలవెన్స్ పేరుతో కొని ఇస్తున్నవే. గత ప్రభుత్వం కొన్న సైకిళ్లను నేటి వరకు వైకాపా ప్రభుత్వం పంచక పోవడంతో అవి తుప్పు పట్టిపోతున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో అఖిలేష్ ప్రభుత్వం తన బొమ్మతో ముద్రించిన బ్యాగులను తరువాత వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పంచిన విషయాన్ని జగన్ తెలుసుకుని హుందాగా వ్యవహరిస్తూ ఇప్పటికైనా సైకిళ్లను విద్యార్థినులకు అందజేయాలి. NRHM కింద వచ్చే నిధులకు రాష్ట్రప్రభుత్వం 40 శాతం వాటాను సమకూర్చి 108, 104 లాంటి పథకాలకు తానే అంకురార్పణ చేసినట్లు భ్రమలు కల్పించడంలో జగన్ దిట్టగా నిలిచాడు. ఇప్పుడు ఈ జగనన్న విద్యా దీవెన పథకాన్ని కూడా తనకు అనుగుణంగా మలచుకొని ప్రయోజనం పొందడానికి ప్రయత్నించడం ఆయన చౌకబారు మనస్తత్వానికి నిదర్శనం. ఇకనైనా ఇటువంటి పిచ్చి పోకడలు పోకుండా ప్రజారంజకంగా పాలన సాగించడంపైన, రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపించడంపైన ఆయన దృష్టి పెట్టాలి.

నాగోతు రమేష్ నాయుడు

బిజెపి రాష్ట్ర కార్యదర్శి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.