స్వచ్ఛంద లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

స్వచ్ఛంద లాక్‌డౌన్‌

స్వచ్ఛంద లాక్‌డౌన్‌
సత్తుపల్లిలో మాట్లాడుతున్న అసోసియేషన్‌ సభ్యులు

ఖమ్మంలో రెండు వారాలపాటు టు వీలర్‌ ఆటోమొబైల్‌ షాపుల మూసివేత

సత్తుపల్లిలో నేటినుంచి వ్యాపార సంస్థలు..

ఖమ్మంటౌన్‌/సత్తుపల్లి/భద్రాచలం, మే 9: కరోనా రెండో దశ విజృంభిస్తుండటంతో వ్యాపారసంస్థలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ను పాటిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల ఎవరికివారు ఆంక్షలు విధించుకుంటున్నారు. నగరంలో రెండు వారాల పాటు టు వీలర్‌ ఆటోమొబైల్‌ షాపులను మూసివేస్తున్నట్టు అసోసియేషన్‌ నాయకులు నున్నా హరిబాబు, మల్లీదు వేణుమాధవ్‌ తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామ న్నారు. ఆదివారం నుంచి 23వ తేదీవరకు ఆటోమొబైల్‌ షాపులను స్వచ్ఛందంగా మూసివేస్తున్నామన్నారు. అలాగే సత్తుపల్లిలోనూ వ్యాపార, వాణిజ్య సంస్థల వారు సోమవారం నుంచి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించనున్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక కిరాణా మర్చంట్‌ కల్యాణ మండపంలో నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్‌ సభ్యులు మాట్లాడుతూ మధ్యాహ్నం 2గంటల వరకే షాపులు తెరచి ఉంటాయని, వ్యాపార వర్గాలు, ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో గోల్డ్‌, క్లాత్‌, మొబైల్‌, రెడీమేడ్‌, ఫ్యాన్సీ, ఎలక్ర్టికల్స్‌ అండ్‌ ఎలక్ర్టానిక్స్‌ తదితర బాధ్యులు పాల్గొన్నారు.

భద్రాద్రి రామాలయ దర్శన వేళలు కుదింపు

భద్రాచలం రామాలయ సమయాలను కూడా సోమవారం నుంచి కుదించారు. ఉదయం ఆరుగంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే భక్తులకు దర్శన సౌకర్యం ఉండనుంది. భద్రాచలం పట్టణంలో చిన్న హోటల్స్‌ అసోసియేషన్‌, పట్టణ హోటల్‌ యజమానుల సంఘం సభ్యులు సోమవారం నుంచి వారంరోజులపాటు స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిస్తూ తీర్మానం చేశారు. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో అన్ని దుకాణాలను మూసి వేసేందుకు చర్చిస్తున్నారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సైతం పట్టణంలో కరోనా ఉధృతి దృష్ట్యా వ్యాపారులు స్వచ్ఛంద లాక్‌డౌన్‌కు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST