కట్టడిగా ఉంటేనే కరోనా దూరం

May 9 2021 @ 00:25AM

ఇల్లే క్వారంటైన్‌.. అనవసరంగా గడప దాటొద్దు

కట్టుబడి ఉంటేనే కరోనా దూరం


మెదక్‌ అర్బన్‌, మే 8: మెదక్‌ జిల్లాను కరోనా కలవరపెడుతున్నది.  పదుల సంఖ్యలో ప్రాణాలను పొట్టనపెట్టుకుంటున్నది. ఇంట్లోంచి కాలు బయటపెడితే ఎవరికి పాజిటివ్‌ ఉందో.. ఎవరు కొవిడ్‌ బాధితులో తెలియడం లేదు. ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో అర్థం కావడం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో మహమ్మారిని కట్టడి చేయాలంటే ఇల్లు దాటకుండా ఉండటమే ఏకైక మార్గం. ఇంటినే క్వారంటైన్‌గా మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. అత్యవసరమయితే తప్ప గడప దాటొద్దని నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమై బయటకు వచ్చినా పూర్తి జాగ్రత్తలతోనే ఇంటి నుంచి కదలాలని, తిరిగివచ్చిన అనంతరం పూర్తిగా శానిటైజేషన్‌ చేసుకున్న తర్వాతే ఇంట్లోకి రావాలని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో కఠినమైన స్వీయనిబంధనలు పెట్టుకుంటే తప్ప కొవిడ్‌ కట్టడిచే అవకాశాలు కన్పించడం లేదు.


స్వీయ జాగ్రత్తలతో మేలు

ప్రసుత్త పరిస్ధితుల్లో కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్‌ వేసుకుంటూ సరిపోదు. స్వచ్ఛందంగా ఎవరికివారే నిబంధనలు పెట్టుకొని, వాటికి కట్టుబడి ఉంటేనే మహమ్మారి గొలుసును తెంచేందుకు అవకాశం ఉంటుంది. వైరస్‌ వ్యాప్తి నేపథ్యం తెలిసికూడా చాలామంది కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో వారితో పాటు మిగితావారికీ ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. సెకండ్‌వేవ్‌ జిల్లాలో ప్రధానంగా పల్లె ప్రాంతాల్లో దూసుకుపోతున్నది. ఇందుకు ప్రధాన కారణం గ్రామాల్లో ప్రజలకు అవగాహన లేకపోవడం. అతివిశ్వాసం కారణంగా జాగ్రత్తలు పాటించకపోవడం. ఓవైపు కరోనా బారినపడి ప్రాణాలు పోతున్నా చాలామంది మాస్కులు కూడా ధరించకుండా పట్టణ ప్రాంతాలకు వచ్చేస్తున్నారు. ఇక్కడి నుంచి వైర్‌సను పల్లెకు తీసకువెళ్లి మిగతావారినీ బాధితులుగా మార్చేస్తున్నారు. పిల్లలు, యువత కూడా ఇంటి బయటకు వెళ్లడం, మార్కెట్లలో తిరగడం చేస్తున్నారు. ఇలాంటివారి ద్వారా ఇంట్లోకి వైరస్‌ అడుగుపెడుతున్నది. నిర్లక్ష్యంగా ఉన్న చాలామంది తమకు తెలియకుండానే వైర్‌సకు వాహకంగా మారుతున్నారు.


ఎవరికివారే కట్టడి చేసుకోవాలి

కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వాలు ఏంచేసున్నాయి అని ప్రశ్నించేముందు తామేం చేస్తున్నామని ఎవరికివారు ప్రశ్నించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికీ చాలామంది ప్రభుత్వం సూచిస్తున్న నిబంధనలను పాటించడం లేదు. కరోనాను కట్టడి చేసేందుకు రాత్రి పూట కర్ఫ్యూ పెట్టినా అనవసరంగా బయటకు వెళ్తున్నవారు ఉన్నారు. ఇప్పుడున్న పరిస్ధితుల్లో స్వచ్చందంగా ఎవరికీ వారు పరిమితులు పెట్టకుంటేనే కరోనానా ఎక్కడికక్కడ కట్టడి చేయగలుగుతామని అధికారులు పేర్కొంటున్నారు. ఏ చిన్న అవకాశాన్ని వైర్‌సకు ఇవ్వకుండా పక్కాగా ఉంటేనే మహమ్మారి బారినుంచి బయటపడతామంటున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో లాక్‌డౌన్‌, కంటైన్మెంట్‌జోన్లు పాటించడం సాధ్యంకావు. అందుకే ఎవరికివారు తమ ఇంట్లోనే స్వీయ క్వారంటైన్‌లో ఉన్నట్టు ఉండాలని నిపుణులు చెబుతున్నారు.


అందరూ సహకరించాలి – డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు, డీఎంహెచ్‌వో, మెదక్‌ 

జిల్లాలో ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ప్రజల సహకారం ఉంటేనే కొవిడ్‌ను కట్టడి చేయగలుగుతాం. అర్హులైనవారందరూ దగ్గరలోని వ్యాక్సినేషన్‌ కేంద్రంలో టీకా తీసుకోవాలి. పాజటివ్‌ వచ్చినవారికి ప్రభుత్వంతోపాటు ప్రైవేటులోనూ కరోనా వైద్య సేవలు అందుతున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటక వెళ్లొద్దు. సాధ్యమైనంతవరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలి.


Follow Us on: