సెల్ఫీ వ్యసనం.. మరణంతో చెలగాటం!

ABN , First Publish Date - 2022-06-14T07:27:34+05:30 IST

స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక సెల్ఫీ అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. సందర్భం ఏదైనా ఓ సెల్ఫీ తీసుకుంటే కానీ సంతృప్తి చెందని రోజులొచ్చేశాయి. ఇదే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. సోమవారం రాత్రి కూడా తిరుపతిలో ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ బ్రిడ్జిపై నుంచి కిందపడ్డాడు. ఇతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

సెల్ఫీ వ్యసనం.. మరణంతో చెలగాటం!

యువత ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కల్గించే అంశం


స్మార్ట్‌ ఫోన్లు వచ్చాక సెల్ఫీ అనేది ఓ వ్యసనంగా మారిపోయింది. సందర్భం ఏదైనా ఓ సెల్ఫీ తీసుకుంటే కానీ సంతృప్తి చెందని రోజులొచ్చేశాయి. ఇదే ఇప్పుడు ప్రాణాల మీదకు తెస్తోంది. సోమవారం రాత్రి కూడా తిరుపతిలో ఓ విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ బ్రిడ్జిపై నుంచి కిందపడ్డాడు. ఇతడి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.

- తిరుపతి సిటీ


ఎక్కడికి వెళ్లినా.. ఎవరిని కలిసినా.. ఏ పని చేసినా వెంటనే ఫోన్లో ఓ సెల్ఫీ తీసుకుని, సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం అందరికీ అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా యువతలో ఈ ధోరణి ఎక్కువైంది. సెల్ఫీలు తీసుకునే మోజులో ప్రమాదాల బారినపడి, మృతి చెందే వారి సంఖ్య జిల్లాలో పెరుగుతోంది. అధికశాతం యువతీ, యువకులే ప్రాణాలను కోల్పోతుండటం ఆందోళన కల్గించే అంశం. 


నాయుడుపేటకు చెందిన దినేష్‌ అనే యువకుడు నెల్లూరులోని ఓ కళాశాలలో బీటెక్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను రోజూ కాలేజీకి నాయుడుపేట నుంచి నెల్లూరుకు రైల్లో వెళ్లి వస్తుంటాడు. గూడూరు సమీపానికి వచ్చేసరికి తలుపు వద్ద నిల్చొని సెల్ఫీ తీసుకుంటూ.. పట్టుతప్పి రైల్లో నుంచి కిందపడి మృతి చెందాడు. 


మూడు నెలల కిందట మదనపల్లెకు చెందిన కొందరు స్నేహితులు సరాదాగా గడిపేందుకు ద్విచక్ర వాహనాలపై తనకోన జలపాతం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఇద్దరు స్నేహితులు సెల్ఫీ తీసుకోవడానికి జలపాతంపైన ఉన్న కొండపైకి ఎక్కారు. సెల్ఫీ తీసుకునే క్రమంలో పట్టుతప్పి కిందపడ్డారు. ఒకరు మృతిచెందగా మరొకరికి చేతులు, కాళ్లు విరిగాయి. 


సెల్ఫీ మోజు.. మానసిక వ్యాధితో సమానం 


ఎప్పుడో ఒకప్పుడు అవసరాన్ని బట్టి సెల్ఫీ తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. అదే నిత్యం సెల్ఫీలు తీసుకుంటున్నా లేక రోజుకు ఐదు నుంచి ఆపై ఎన్ని ఎక్కువ సెల్ఫీలు తీసుకుంటుంటే వారిలో మానసిక వ్యాధి తీవ్రత అంత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాలి. ఇటువంటి వారు సెల్ఫీ కోసం ప్రమాదకరమైన పరిస్థితులనైనా లెక్క చేయరు. ఇటువంటి వారు తమతోపాటు ఇతరుల ప్రాణాలనూ ప్రమాదంలోకి నెట్టేస్తారు. ఇలాంటి వారిని సకాలంలో వైద్య నిపుణుల దగ్గరకు తీసుకురావడం వల్ల రెండు నుంచి మూడు వారాల్లో వ్యాధి తీవ్రతను బట్టి కౌన్సెలింగ్‌ ఇస్తారు. మందులు, ఇతర వైద్య పద్ధతులతో సెల్ఫీ వ్యసనానికి దూరం చేయవచ్చు.

- డాక్టర్‌ మానస, మానసిక వైద్య నిపుణురాలు, రుయాస్పత్రి


ఐకానిక్‌ బ్రిడ్జి నుంచి కిందపడిన విద్యార్థి


తీవ్రగాయాలతో పరిస్థితి ప్రమాదకరం


తిరుపతి(నేరవిభాగం), జూన్‌ 13: సెల్ఫీ తీసుకుంటూ ఓ విద్యార్థి బ్రిడ్జి నుంచి కిందపడిపోయిన ఘటన సోమవారం రాత్రి ఎస్వీయూ సమీపంలోని ఐకానిక్‌ బ్రిడ్జి వద్ద జరిగింది. స్థానికులు, ఎస్వీయూ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్వీయూ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మసీదు వీధికి చెందిన హారూన్‌బాష కుమారుడు రోషన్‌అలీ తొమ్మిదో తరగతి పూర్తి చేసుకుని పదో తరగతికి వచ్చాడు. రాత్రి సుమారు ఎనిమిది గంటలప్పుడు స్నేహితులతో కలిసి ఎస్వీ డెయిరీ ఫామ్‌ సమీపంలోని ఐకానిక్‌ బ్రిడ్జిపై సెల్ఫీ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో బ్రిడ్జి గోడపై నిలబడి సెల్ఫీ తీసుకోబోయాడు. పట్టుతప్పి బ్రిడ్జి మధ్య భాగంలోని ఖాళీ ప్రాంతం నుంచి కిందపడ్డాడు. గమనించిన స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. విద్యార్థిని రుయాస్పత్రికి తరలించారు. తల, నడుము, రెండు చేతులకు తీవ్రగాయాలైనట్లు వైద్యులు తెలిపారు. పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్టు సమాచారం. 

Updated Date - 2022-06-14T07:27:34+05:30 IST