దేవునితో సెల్ఫీ

ABN , First Publish Date - 2021-07-27T06:28:25+05:30 IST

చీకట్లో తడుముకుంటుంటే నీ స్మృతిశకలమొకటి చేతికి తగిలింది ఆ శకలమే సకలమై కళ్ళను తడిపింది...

దేవునితో సెల్ఫీ

చీకట్లో తడుముకుంటుంటే

నీ స్మృతిశకలమొకటి చేతికి తగిలింది

ఆ శకలమే సకలమై కళ్ళను తడిపింది

ఆసుపత్రివారు దూరం నుండి చూపించిన నీ ముఖమే

ఈ దృశ్యప్రపంచానికి చివరి రుజువు

లక్షలాది మందికి

లక్షల విషాదగాథల్ని మిగిల్చింది కరోనా

ప్రాణం సత్యం కన్నా దగ్గర

మరణం కథకు అందనంత దూరం

కాంతిసంవత్సరం చీకటి సంవత్సరంగా మారిందని

మౌనబాష్పం చేసిన భాష్యం

స్పర్శకు అందని నీ ఊహాలోకంలో

మా అందరి మీద నీ ఆత్మ గుండెపగిలిందేమో

‘చదువురాని మా అమ్మకు కూడ

అర్థమయ్యేదే కవిత్వం’ అన్న నీ నిర్వచనం

ఆనందవర్ధనునికే తట్టలేదు గోవింద్‌

పాతబస్తీ సాహసివి సమరశీలివి

నీవులేక మా ప్రపంచం చిన్నబోయింది

నీకేం

దేవునితో రోజుకో సెల్ఫీ దిగుతూ

హాయిగా ఉన్నావు

మనసుతో

మోసపూరిత ఒప్పందం చేసుకుంటే తప్ప

నిన్ను మేం మరచిపోలేం

అమ్మంగి వేణుగోపాల్‌

(కళాత్మక ఛాయాచిత్రకారుడు 

కె. గోవింద్‌ తొలి వర్ధంతి నేడు)

Updated Date - 2021-07-27T06:28:25+05:30 IST