
ఉప ఎన్నికలో వైసీపీ భారీ విజయం
మేకపాటి విక్రమ్‌రెడ్డి గెలుపు.. బీజేపీ అభ్యర్థికి 19,332 ఓట్లే
డిపాజిట్ కోల్పోయిన భరత్‌కుమార్.. బీఎస్పీ అభ్యర్థికి 4,897 ఓట్లు
నోటాకు 4,179 ఓట్లు.. బరిలోకి దిగని తెలుగుదేశం
నెల్లూరు, జూన్ 26(ఆంధ్రజ్యోతి): ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బరిలో లేకపోవడంతో ఆది నుంచి ఏకపక్షంగా సాగిన ఆత్మకూరు ఉప ఎన్నికలో వైసీపీ ఘనవిజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి 82,888 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ ఎన్నిక ల్లో ప్రధాన ప్రత్యర్థిగా పోటీకి దిగిన బీజేపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఆ పార్టీ అభ్యర్థి భరత్‌కుమార్ యాదవ్ కేవలం 19,332 ఓట్లకే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఎవరైనా ఎమ్మెల్యే మరణిస్తే ఆయన/ఆమె కుటుంబ సభ్యులకు టికెట్ లభిస్తే పోటీ చేయకూడదన్న ఆనవాయితీని పాటిస్తున్న టీడీపీ.. ఆత్మకూరులో ఆనవాయితీ కొనసాగించింది. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో వైసీపీ ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డిని బరిలోకి దించడంతో టీడీపీ బరిలోకి దిగలేదు. దీంతో ఒకదశలో ఉప ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించారు. అయితే బీజేపీ పోటీకి దిగింది. దీంతోపాటు బీఎస్పీ అభ్యర్థి సహా మొత్తం 14 మంది పోటీలో నిలిచారు. మొత్తం 2,13,338 ఓట్లుకు గాను 1,37,038 ఓట్లు పోలయ్యాయి. ఆత్మకూరులోని ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఆదివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో మొద టి నుంచీ వైసీపీ ఆధిక్యం చాటుకుంది. వైసీపీ అభ్యర్థి విక్రమ్‌రెడ్డికి 1,02,074 ఓట్లు, బీజేపీకి 19,332 ఓట్లు, బీఎస్పీ అభ్యర్థి నందా ఓబులేశుకు 4,897 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికలో లక్ష ఓట్ల మెజారిటీ సాధించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించింది. అయినా పాలక పక్షం అనుకున్న మేర పోలింగ్ శాతాన్ని పెంచుకోలేకపోయింది. దీంతో 82 వేల మెజారిటీతో సర్దుకోవలసి వచ్చింది. ఇక బీజేపీ నాయకులు గట్టి పోటీ ఇవ్వడానికి ప్రయత్నించారు. 40-50 వేల ఓట్లు సాధించి రాష్ట్ర పార్టీలో కొత్త ఊపు తీసుకురావాలని భావించారు. గతంలో ఎప్పుడూ లేని విఽధంగా నోటాకు 4,179 ఓట్లు పడ్డాయి.
వలంటీర్ల విజయం: సోము
భీమవరం: ఆత్మకూరు ఉపఎన్నికలో వైసీపీ ప్రభుత్వం దమనకాండతో విజయం సాధించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సో ము వీర్రాజు అన్నారు. ఇది వలంటీర్ల విజయమని అభివర్ణించారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆదివారం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఓటర్లను భయపెట్టిందన్నారు. ప్రతీ మండలానికి ఒక మంత్రి, ఎమ్మెల్యే డబ్బు పంచారని విమర్శించారు. కుటుంబ రాజకీయాలను వ్యతిరేకిస్తూ నిబద్ధతతో పోటీ చేశామని, ఈ ఎన్నికల్లో బీజేపీ వీరోచిత పోరాటం చేసి.. 14.1 శాతం ఓట్లు సాధించిందని వెల్లడించారు.