స్వీయ గౌరవ పోరాట ప్రవక్త

ABN , First Publish Date - 2022-09-16T06:20:59+05:30 IST

పెరియార్.. ఈ పేరు వినగానే చాలామందికి గుర్తు వచ్చేది గొప్ప నాస్తికుడు. అయితే ఆయన ‘స్వీయ గౌరవ పోరాట’ దిక్సూచి. కుల సమస్య పట్ల, ఇతర సామాజిక రుగ్మతల పట్ల...

స్వీయ గౌరవ పోరాట ప్రవక్త

పెరియార్.. ఈ పేరు వినగానే చాలామందికి గుర్తు వచ్చేది గొప్ప నాస్తికుడు. అయితే ఆయన ‘స్వీయ గౌరవ పోరాట’ దిక్సూచి. కుల సమస్య పట్ల, ఇతర సామాజిక రుగ్మతల పట్ల స్పష్టమైన దృక్పథం కలవాడు పెరియార్. తాను ఎంచుకున్న విధానంపై ఎట్టి పరిస్థితులలోనూ రాజీపడే మనస్తత్వం కలవాడు కాదు. ఎందుకంటే ప్రతీ విషయానికి మూలాలు తెలుసుకుని మాట్లాడేవాడు.


పెరియార్ పుట్టింది 1879 సెప్టెంబరు 17. తమిళనాడులోని ఈరోడ్‌లో బీసీ కులంలో పుట్టడం మూలంగా చిన్నతనం నుంచి అనేక అవమానాలు పొందాడు. ప్రతీచోటా బ్రాహ్మణ కుల ఆధిపత్యం కారణం అని తెలుసుకున్నాడు. దోపిడీకి, అసమానతలకు కారణం బ్రాహ్మణిజం అని తిరుగుబాటు చేశాడు. ప్రారంభంలో మహాత్మాగాంధీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెసు పార్టీలో చేరాడు. ఆ పార్టీ అధ్యక్షుడయ్యాడు. కానీ సామాజిక పరిస్థితులపై కాంగ్రెస్ నిజాయితీ లేకుండా, స్పష్టమైన వైఖరి ప్రదర్శించకపోవడం మూలంగా పార్టీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశాడు. బ్రాహ్మణ వర్గం  కష్టపడకుండా దేవుడు పేరు చెప్పి ప్రజల్ని ఏ విధంగా దోచుకుంటున్నారో ప్రజలకి వివరిస్తూ, చైతన్యవంతుల్ని చేస్తూ, ప్రత్యక్ష పోరాటానికి దిగేవాడు. దళితులకు దేవాలయ ప్రవేశం కొరకు ‘వైకో’ పోరాటం చేశాడు.


కాంగ్రెస్ పార్టీని వదిలిన తర్వాత కొంతకాలం కమ్యూనిస్టు భావాలకు ప్రేరేపితుడై రష్యా కూడా వెళ్లి వచ్చాడు. అప్పుడే కమ్యూనిస్టు అగ్రనేత ‘సింగార వేలు చెట్టియార్’తో ప్రయాణం సాగించాడు. 1933లో పెరియార్ ‘ఆత్మగౌరవ కమ్యూనిస్టు పార్టీ’ పేరుతో ఒక పార్టీని కూడా స్థాపించాడు. ఆ పార్టీ తరపున ‘పురచ్చి’ (విప్లవం) అనే పత్రిక నడిపాడు. బ్రిటీషు ప్రభుత్వం ఆత్మగౌరవ కమ్యూనిస్టు పార్టీని నిషేధించింది. కమ్యూనిష్టు పార్టీలో ఉండడం వల్ల తాను చేస్తున్న పోరాటం మధ్యలో ఆగిపోవడం మంచిది కాదని ఆ పార్టీ ప్రచారానికి స్వస్తి చెప్పాడు. జస్టిస్ పార్టీ వైపు సాగి 1944 నాటికి ద్రవిడ కజగం (డికె)గా మార్చారు పెరియార్. ఆనాటికి విద్యార్థి ఉద్యమ నాయకుడు అయిన అన్నాదురైను తన ప్రధాన శిష్యుడిగా చేసుకున్నాడు. అన్నాదురై నాయకత్వంలో 1948లో డిఎంకె ఆవిర్భవించి, అన్నాదురై అనంతరం అధికారంలోకి వచ్చిన కరుణానిధిని, డిఎంకెని చీల్చి అన్నాడిఎంకెని స్థాపించిన ఎంజిఆర్ వరకూ అందరూ పెరియార్ వారసులమనే ప్రకటించుకున్నారు. అంటే! పెరియార్ వేసిన రాజకీయ పునాది ఎంత బలమైనదో అర్థం అవుతుంది. దానికి ప్రధాన కారణం పెరియార్ చేసిన ‘స్వీయ గౌరవ పోరాటమే!’

పిల్లి సురేష్ కుమార్

(రేపు పెరియార్ జయంతి)

Updated Date - 2022-09-16T06:20:59+05:30 IST