హాజరు ఉంటేనే అమ్మఒడి

ABN , First Publish Date - 2021-11-23T05:58:26+05:30 IST

అమ్మ ఒడి పథకానికి కొత్తగా హాజరు శాతాన్ని ప్రభుత్వం ముడిపెట్టింది.

హాజరు ఉంటేనే అమ్మఒడి

  1. 75 శాతం తప్పనిసరి 
  2. బయోమెట్రిక్‌తో ఇబ్బందులు
  3. ఆందోళనలో తల్లిదండ్రులు 


కర్నూలు-ఆంధ్రజ్యోతి: అమ్మ ఒడి పథకానికి కొత్తగా హాజరు శాతాన్ని ప్రభుత్వం ముడిపెట్టింది. ఇప్పటికే పెట్టిన అనేక అర్హతలకు కొత్తగా ఇది తోడైంది. ఇంట్లో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ఇస్తామని గత ఎన్నికల హామీగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఇంట్లో ఒక్కరికే ఇస్తామని అన్నారు. అదీ సక్రమంగా ఇవ్వడం లేదు. కరెంటు బిల్లు, కారు, భూమి అంటూ అర్హుల్లో పలువురిని పథకానికి దూరం చేశారు. అర్భాటంగా ప్రకటించిన పథకం రెండు సంవత్సరాలకే ప్రభుత్వానికి భారంగా మారింది. లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకే  అమ్మఒడి ఇస్తామని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. 


ఇదీ లెక్క..: జిల్లాలో లక్షలాది మంది విద్యార్థులు అమ్మఒడి లబ్ధి పొందారని అధికారులు చెబుతున్నారు. వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. గత సంవత్సరం జనవరి 10న మొదటిసారి తల్లులఖాతాల్లో నగదు జమ అయింది. 2019-20 విద్యా సంవత్సరాని జిల్లా వ్యాప్తంగా 1 నుంచి ఇంటర్‌ చదివే 7,81,348 మంది విద్యార్థుల వివరాలు సేకరించి 6,64,822 మందిని అర్హులుగా గుర్తించింది. వీరిలో 3,81,680 మందికి మాత్రమే అమ్మఒడి అందింది. 2020-21 సంవత్సరంలో 8,14,351 మంది విద్యార్థులు ఉండగా 6,84,197 మందిని అర్హులుగా గుర్తించింది. ఇందులో 4,12,884 మంది మాత్రమే అమ్మఒడి డబ్బులు అందుకున్నారు. ఈ లెక్కల ప్రకారం మొదటి విడతలో 2,83,142 మంది, రెండో విడతలో 2,71,213 మంది అర్హత ఉండి కూడా అమ్మఒడికి నోచుకోలేదు. రెండు విడతల్లో కలిపి దాదాపు 5.42 లక్షల మందికి పైగా పథకానికి దూరమయ్యారు. పాఠశాలల మరుగుదొడ్ల నిర్వహణ  పేరిట రెండో విడత ఒక్కొక్కరి నుంచి రూ.వెయ్యి కోత విధించింది. వీటన్నిటికీ తోడు ఇప్పుడు విద్యార్థుల హాజరుతో మెలిక పెట్టి మరో కోతకు సిద్ధమైంది. 


అడ్డంకులెన్నో..

 విద్యార్థుల హాజరుకు బయోమెట్రిక్‌ను ఆధారం చేసుకోవాలని, ఈ నెల 8 నుంచే పాఠశాలల్లో  ఈ విధానం అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. అది కూడా ఉదయం తొమ్మిది నుంచి పది గంటలలోపు హాజరు వేయించాలని స్పష్టం చేసింది. గత సంవత్సం కొవిడ్‌ కారణంగా 75 శాతం హాజరుకు మినహాయింపునిచ్చినా, ఈ సంవత్సరం తప్పనిసరి అంటోంది. దీని ప్రకారం వచ్చే ఏప్రిల్‌ 30 వరకు 130 పనిదినాల్లో 75 శాతం హాజరు అంటే 98 రోజుల హాజరు ఉండాల్సిందే. సాంకేతిక సమస్యతో బయోమెట్రిక్‌ హాజరు పడకపోతే విద్యార్థులు పాఠశాలకు వచ్చినా రానట్టే! ఒకవేళ బయోమెట్రిక్‌ యంత్రం ఎన్ని రోజులు పని చేయకపోతే అన్ని రోజులు విద్యార్థులు బడికి రానట్లే.  పల్లెల నుంచి వచ్చి పట్టణాల్లోని పాఠశాలల్లో చదువుకుకొనే విద్యార్థులకు ఆలస్యమైతే టైం దాటిపోయాక బయోమెట్రిక్‌ హాజరుకు అవకాశం ఉండదు. 75 శాతం హాజరును తప్పనిసరి చేయడమంటే పథకానికి దూరం చేయడమే. 


సక్రమంగా పనిచేస్తున్నాయా..?


పాఠశాలల్లో యాప్‌ విధానం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ఇటీవలే ఉపాధ్యాయలు డీఈవో కార్యాలయం ముందు ధర్నా చేశారు. నెట్‌వర్క్‌ సరిగా పనిచేయకపోవడం, అప్‌లోడ్‌ చేసే సమయంలో ఇబ్బందుల వల్ల యాప్‌లతోనే సమయమంతా సరిపోతోందని ఉపాధ్యాయులు అంటున్నారు. పిల్లలకు హాజరు తీసుకొనే సరికే ఒక పీరియడ్‌ వృథా అవుతోందని అంటున్నారు. దీనికి తోడు చాలా పాఠశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు సరిగా పనిచేయడం లేదని, వాటిని బాగుచేసే వారికి ప్రభుత్వం సరిగా డబ్బులు చెల్లించడం లేదని తెలుస్తోంది. దీంతో ఉపాధ్యాయులు జేబు డబ్బులు ఖర్చు చేసి బయోమెట్రిక్‌ యంత్రాలను బాగు చేయించుకుంటున్నట్లు సమాచారం. నెట్‌వర్క్‌ సరిగా పనిచేయని చోట్ల ఉపాధ్యాయల బాధలు వర్ణానాతీతం. దీంతో ఉపాధ్యాయులు బయోమెట్రిక్‌ హాజరు విధానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పదిహేను, నెల రోజులకోసారి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి పిల్లల హాజరు రిపోర్టులను పంపిస్తుంటామని, అమ్మఒడి పథకానికి ఈ రిపోర్టునే ప్రామాణికంగా తీసుకోవచ్చని, దాని కోసం ప్రత్యకంగా బయోమెట్రిక్‌ హాజరు అవసరం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.


ఆలస్యంగా అడ్మిషన్లు..: ఈ ఏడాది ఇంటర్‌ మీడియట్‌ అడ్మిషన్లు ఆలస్యంగా జరిగాయి. తొలుత అన్‌లైన్‌ ప్రవేశాలని ప్రభుత్వం చెప్పింది. కానీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయలేదు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించలేదు. చివరికి పాత పద్ధతిలోనే అడ్మిషన్లు చేపట్టారు. నెల రోజులకు పైగా ఆలస్యం కావడంతో ఈ ప్రభావం తరగతులపై పడింది. పాఠశాలల విలీన ప్రక్రియ సైతం ఒక కొలిక్కి రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హాజరు శాతం పరిగణలోకి తీసుకుంటే ఎలా? అని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 


 బయోమెట్రిక్‌ హాజరు విధానం తీసేయాలి

బయోమెట్రిక్‌ హాజరు 75 శాతం ఉంటేనే విద్యార్థులకు అమ్మఒడి ఇస్తామనడం సబబు కాదు. బయోమెట్రిక్‌ విధానంతో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్‌ యంత్రాలు సరిగా పనిచేయడం లేదు. మరికొన్ని చోట్ల నెట్‌వర్క్‌ సరిగా రావడం లేదు. దీనివల్ల హాజరు వేయడం ఇబ్బందిగా మారుతోంది. భౌతిక హాజరు విధానాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మంచిది. 


- కె.సతీశ్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు, బహుజన టీటర్స్‌ ఫెడరేషన్‌

Updated Date - 2021-11-23T05:58:26+05:30 IST