రేటింగ్‌లు, రివ్యూలు చూసి ఆన్‌లైన్‌లో వస్తువులు కొంటున్నారా? మీరు బొక్కబోర్లా పడకూడదనుకుంటే.. ఈ వివరాలు చదవండి!

ABN , First Publish Date - 2021-12-11T13:40:33+05:30 IST

ఏదైనా వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేముందు..

రేటింగ్‌లు, రివ్యూలు చూసి ఆన్‌లైన్‌లో వస్తువులు కొంటున్నారా? మీరు బొక్కబోర్లా పడకూడదనుకుంటే.. ఈ వివరాలు చదవండి!

ఏదైనా వస్తువును ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేముందు వినియోగదారులు ఆ ఉత్పత్తికి లభించిన రేటింగ్, సమీక్షలను నమ్ముతుంటారు. అయితే కొన్ని దిగ్గజ ఈ-కామర్స్ కంపెనీల ప్లాట్‌ఫారమ్‌లపై రేటింగ్‌లు, సమీక్షలు అక్రమంగా జరుగుతున్నాయనే విషయం చాలామందికి తెలియదు. దేశంలోని రెండు అతిపెద్ద ఇ-కామర్స్ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో చాలా మంది విక్రేతలు తమ ఉత్పత్తికి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలని కొనుగోలుదారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. Amazon నుంచి వెయిట్ మెషీన్‌ను కొనుగోలు చేసిన ఢిల్లీకి చెందిన ఒక వినియోగదారుడు విశ్వాస్ షా మాట్లాడుతూ.. Amazonలో ఈ వస్తువును కొనుగోలు చేసిన తర్వాత,  తమకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వాలని విక్రేత నుండి కాల్ వచ్చిందని, ఆ తర్వాత తాము ఆ వస్తువుపై గల వారంటీని ఇమెయిల్ చేస్తామని వారు తెలియజేశారన్నారు. అదేవిధంగా, ఫ్లిప్‌కార్ట్ నుండి షాపింగ్ చేసిన సూరత్‌కు చెందిన ఒక వినియోగదారుడు మాట్లాడుతూ.. పలువురు విక్రేతలు వారి  ఉత్పత్తులకు ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన తర్వాతనే ఆయా వస్తువులకు 6 నెలల అదనపు వారంటీ ఇస్తున్నారని తెలిపారు. సాధారణ ఉత్పత్తి అయినా కూడా దానికి అధిక రేటింగ్ ఇవ్వాలని విక్రేతలు ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ఈ విధంగా విక్రేతలు తమ సాధారణ ఉత్పత్తులను కూడా పెద్ద ఎత్తున అమ్ముకోవాలని భావిస్తున్నారన్నారు. 




వినియోగదారుల హక్కుల సంస్థ 'కన్స్యూమర్ వాయిస్' చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అసిమ్ సన్యాల్ మాట్లాడుతూ.. అభివృద్ధి చెందిన పలు దేశాలలో నకిలీ సమీక్షలను, రేటింగ్‌లను అరికట్టేందుకు చట్టాలు ఉన్నాయని, భారతదేశంలో అటువంటి చట్టాలు లేవన్నారు. దీనిని అనువుగా చేసుకుని ఈ-కామర్స్ కంపెనీల ద్వారా వస్తువులను విక్రయించేవారు చెలరేగిపోతున్నారని ఆరోపించారు. ఆ ఆరోపణలపై స్పందించిన అమెజాన్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. 'నకిలీ సమీక్షలు, రేటింగ్‌లను గుర్తించి, వాటిని నిరోధించడానికి తమ బృందం పని చేస్తున్నదన్నారు. 2020లో తాము 20 కోట్లకుపైగా ఉన్న అనుమానాస్పద నకిలీ సమీక్షలను తొలగించామన్నారు. ఈ నకిలీ సమీక్షలలో 99 శాతానికి మించినవాటిని తామే స్వయంగా గుర్తించామన్నారు. ఈ విషయంపై ఫ్లిప్‌కార్ట్ ఇంకా తన స్పందన తెలియజేయలేదు. కాగా బ్రిటిష్ రెగ్యులేటర్ 'కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ' (CMA) ఈ ఏడాది జూన్‌లో అమెజాన్, గూగుల్‌పై నిఘా సారించింది. ఫేక్ రివ్యూల సమస్యను పరిష్కరించడానికి అమెజాన్, గూగుల్ ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదని ఇది UKలోని చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆరోపించింది. CMA CEO ఆండ్రియా కోసెలీ మాట్లాడుతూ.. ఆన్‌లైన్ విక్రేతలు ఇస్తున్న నకిలీ సమీక్షలను చూసి, వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. కొంతమంది విక్రేతలు తమ ఉత్పత్తులకు నకిలీ ఫైవ్ స్టార్ రివ్యూలు క్రియేట్ చేస్తూ వారి ఉత్పత్తులు, సేవలను వృద్ధి చేసుకుంటన్నారన్నారు. ఇటువంటి చర్యలను చట్టం ద్వారా నిరోధించాలన్నారు. 

Updated Date - 2021-12-11T13:40:33+05:30 IST