అప్పనంగా అమ్మేస్తున్నారు..

ABN , First Publish Date - 2022-06-27T06:47:39+05:30 IST

పట్టణం, పరిసర ప్రాంతాల్లో విలువైన భూములకు రెక్కలు వస్తున్నాయి. అనుభవంలో లే ని అసైన్టు భూములు, గుట్టలు, పోరంబోకు స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా మార్చేస్తున్నారు

అప్పనంగా అమ్మేస్తున్నారు..
గుట్టను చదునుచేసి, నెంబరు రాళ్లను పాతిన దృశ్యం

ప్రభుత్వ స్థలాలు, అసైన్డు భూములపై కన్ను

ప్లాటు రూ.6 లక్షల దాకా విక్రయం

రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు

గుంతకల్లు, జూన 26: 

పట్టణం, పరిసర ప్రాంతాల్లో విలువైన భూములకు రెక్కలు వస్తున్నాయి. అనుభవంలో లే ని అసైన్టు భూములు, గుట్టలు, పోరంబోకు స్థలాలను ఆక్రమించి ప్లాట్లుగా మార్చేస్తున్నారు. అసైన్డు భూములను పట్టా భూములని చెబుతూ ప్లాట్లకు భారీ రేట్లు ఫిక్స్‌చేసి వసూళ్లపర్వం చేపట్టారు. కసాపురం దేవస్థానానికి  సమీపంలో ఫోర్‌వేకు ఆనుకుని రెండు  వైపులా ఉన్న అసైన్డు భూమికి ఎంతో డిమాండ్‌ పె రగడంతో అందులో ప్లాట్ల పందేరానికి శ్రీకారం చుట్టారు. అలాగే పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో ఇందిరమ్మ తొలి, రెండవ విడతల్లో పేదలకు పంచిన లేఔట్లలో గత రెండేళ్లుగా కబ్జాల పర్వం కొనసాగుతోంది. ఇళ్లు కట్టుకోని లబ్ధిదారుల స్థలాలను చదనుచేసేసి నామ్కేవాస్తేగా సెంటు స్థలాల లేఔట్లు వేసి విలువైన స్థలాలను అధికార పార్టీకి చెందినవారు అమ్మి సొమ్ము చేసుకోవడానికి రంగం సిద్ధంచేశారు. ఇక్కడ దాదాపు ఐదెకరాల స్థలంపై వైసీపీ నాయకులు కన్నేశారు. 


అసైన్డ భూముల్లో ప్లాట్లు

పట్టణ శివారులో కసాపురం దేవస్థానానికి సమీపంలో 270-ఏ సర్వే నెంబరులో హెచ తిమ్మప్ప, హెచ జయరాముడు అనే రైతులకు ప్రభుత్వం డెభ్బైవ దశకంలో ఒక్కొక్కరికి 3.16 ఎకరాల చొప్పున అసైన్డు భూమిని ఇచ్చింది. కొన్నేళ్ల కిందటి వరకూ ఇందులో వ్యవసాయం జరిగేది. కసాపురం దేవస్థానానికి పదేళ్ల కింద ఫోర్‌వే నిర్మాణం జరిగినప్పుడు ఈ ఇరువురు రైతులకు చెందిన భూములలో దాదాపు 40 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం తీసుకుని రోడ్డును నిర్మించారు. మిగిలిన దాదాపు ఆరు ఎకరాల భూమిలో ఇప్పుడు వైసీపీ నాయకులు ప్లాట్లు వేస్తున్నారు. ఈ భూమిలో ప్రభుత్వం పేదలకు ఇళ్లను నిర్మించదలిస్తే స్వాధీపరుచుకుని నిబంధనల ప్రకారం ఒక సెంటు విస్తీర్ణంతో ప్లాట్లను విభజించి స్థలాలు లేని పేదలకు పంపిణీ చేయవచ్చు. కానీ ఇక్కడ పరిస్థితి మరోలా ఉంది.  ఈభూమి డైక్లాట్‌లో డీ కేటగిరి కింద ఉండటంతో రిజిస్ట్రేషన కావు కనుక ప్రభుత్వం నుంచి పట్టాను జారీ చేయిస్తామని నమ్మబలికి ఒకటిన్నర సెంటు స్థలానికి (76 గజాలకు) ఒక్కొక్కరి నుంచి రూ. 5 లక్షల నుంచి రూ. 6.50 లక్షలదాకా వసూలు చేస్తున్నారు. ఈ భూమిలో రాళ్లు ఎక్కువగా ఉండటంతో కసాపురం దేవస్థానానికి చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు దీన్ని చదను చేయడానికి ముందుకు వచ్చి, ప్రతిఫలంగా కొన్ని ప్లాట్లను తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. అలాగే ఈ భూమికి సమీపంలో ప్రభుత్వ భూముల్లో వాముదొడ్లను వేసుకున్న కొందరు దగ్గరలో ఉన్న 271 సర్వే నెంబరును వేసి ప్లాట్లను రిజిస్ట్రేషన కూడా చేస్తున్నారు. 


రిజర్వు సైట్‌లో పాగా

పట్టణంలోని దోనిముక్కల రోడ్డులో సర్వే నెంబరు. 548.3లో రిజర్వు సైట్‌గా ఉన్న దాదాపు ఐదెకరాల గుట్టను సైతం చదనుచేసి ప్లాట్లు వేశారు. ప్లాటు రూ. లక్షన్నరకు విక్రయించడానికి రంగం సిద్ధంచేశారు. ఎక్సకవేటర్లను ఉపయోగించి కిందటి నెలలో భూమిని చదునుచేసి లే-ఔట్‌ రాళ్లను నాటారు. ప్లాటు రూ. లక్షన్నర ధరను నిర్ణయించి అమ్మకానికి పెట్టారు. ఈ స్థలం రిజర్వు భూమి కావడంతో స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ భూమిలో స్థానిక ప్రజలకు మతాల వారీగా శ్మశానవాటికను ఏర్పాటుచేయాలంటూ గతంలో డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లపై గతంలో జేసీలు, ఆర్డీవోలూ సంబంధిత గుట్ట స్థలాలను పరిశీలించి వెళ్లారు. కబ్జాకు ఏదీ అనర్హం కాదన్న చందంగా ఈ భూమిపై అధికార పార్టీ నాయకులు కబంధ హస్తాలను చాటారు. ఇలా ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపించినా, పోరంబోకు, రిజర్వు సైట్లు కనిపిస్తే చాలు వైసీపీ నాయకులు వాలిపోతున్నారు. ఈ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అర్హులకు పంపిణీ చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2022-06-27T06:47:39+05:30 IST