అమ్మకం.. అణచివేత

ABN , First Publish Date - 2021-10-17T08:05:39+05:30 IST

‘అమ్మేయడం.. అమ్మేయడం.. అమ్మేయడం’.. ఇదే మోదీ ప్రభుత్వ విధానమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దుయ్యబట్టారు.

అమ్మకం.. అణచివేత

  • మోదీ ప్రభుత్వ విధానాలివే!
  • ఓట్లు దండుకునే పావుగా విదేశాంగ విధానం
  • మోదీ సర్కారుపై సోనియా మండిపాటు
  • పూర్తిస్థాయి, క్రియాశీల అధ్యక్షురాలిని నేనే
  • ఐకమత్యం, క్రమశిక్షణ, నియంత్రణ అవసరం
  • పార్టీ ప్రయోజనాలే పరమావధి: సోనియా
  • వచ్చే ఏడాది సెప్టెంబరులో అధ్యక్ష ఎన్నిక


న్యూఢిల్లీ, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ‘అమ్మేయడం.. అమ్మేయడం.. అమ్మేయడం’.. ఇదే మోదీ ప్రభుత్వ విధానమని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దుయ్యబట్టారు. ఆర్థిక పరిస్థితిని మళ్లీ గాడిలోకి పెట్టడానికి ప్రభుత్వం చెబుతున్న ఒకే ఒక జవాబు దశాబ్దాల తరబడి ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఆస్తుల అమ్మకమని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మడం తప్ప మోదీ ఆర్థిక విధానంలో ఏమీ లేదని, పెట్రోలు, గ్యాస్‌ సహా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి చేరుకున్నాయని ధ్వజమెత్తారు. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం శనివారం జరిగింది. సమావేశంలో పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్న వర్కింగ్‌ కమిటీ సభ్యులు.. వ్యవసాయ, రాజకీయ అంశాలపై మూడు తీర్మానాలను ఆమోదించారు. 


ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వ విధానాలను సోనియా తూర్పారబట్టారు. కొన్ని ప్రైవేట్‌ కంపెనీలకు ప్రయోజనం చేకూర్చేందుకే మోదీ ప్రభుత్వం సాగు చట్టాలను ఆమోదించిందని, లఖీంపూర్‌ ఖేరీ ఘటన ద్వారా అణచివేతే తమ విధానమని స్పష్టం చేసిందని విమర్శించారు. సహకార సమాఖ్య విధానం నినాదంగానే మారిందని, బీజేపీయేతర రాష్ట్రాలపై వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌లో ఇటీవల మైనారిటీలపై ఊచకోతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని, ఈ దుర్మార్గాలకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. విదేశాంగ విధానానికి సంబంధించి గతంలో విస్తృత ఏకాభిప్రాయం ఉండేదని, ప్రతిపక్షాలను కలుపుకొని వెళ్లేందుకు మోదీ విముఖత కారణంగా అది కాస్తా దెబ్బతిందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఓట్లను రాబట్టుకోవడానికి, ఓటర్ల మధ్య విభజన తీసుకు రావడానికి విదేశాంగ విధానాన్ని వాడుకోవడమనే దుష్ట సంప్రదాయం మొదలు పెట్టారని మండిపడ్డారు.


పూర్తిస్థాయి అధ్యక్షురాలిని నేనే

పార్టీకి తనను తాత్కాలిక అధ్యక్షురాలిగా ఎన్నుకున్నప్పటికీ గత రెండేళ్లుగా పూర్తిస్థాయి, క్రియాశీల అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్నానని సోనియా తేల్చి చెప్పారు. ఈ మేరకు పార్టీలో నాయకత్వం లేదని, ఎన్నికైన అధ్యక్షుడు లేరంటూ తిరుగుబాటు చేసిన జీ-23 నాయకులకు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. పార్టీ పునరుద్ధరణను అంతా కోరుకుంటారని, అయితే, పార్టీలో నేతలంతా ఐకమత్యంగా, క్రమశిక్షణతో, స్వీయ నియంత్రణతో ఉన్నప్పుడే అది సాధ్యమని స్పష్టం చేశారు. దీనికితోడు, పార్టీ ప్రయోజనాలే పరమావధిగా ఉండాలని వ్యాఖ్యానించారు. కరోనా రెండో ప్రభంజనం వల్ల సంస్థాగత ఎన్నికలు జరపలేకపోయామని చెప్పారు. 


కేంద్ర మంత్రిని తొలగించరా?

లఖీంపూర్‌ ఖేరీలో రైతులను అత్యంత దారుణంగా కారుతో తొక్కి చంపేసినా మోదీ సర్కారు అదే అహంకారాన్ని కొనసాగిస్తోందని సీడబ్ల్యూసీ మండిపడింది. ఈ ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి కొడుకును అరెస్టు చేసినా మంత్రివర్గం నుంచి మంత్రిని తొలగించలేదని దుయ్యబట్టింది.  


వచ్చే ఏడాది సెప్టెంబరులో అధ్యక్ష ఎన్నిక

వచ్చే ఏడాదిలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాలని, దేశంలో అన్ని ప్రజాస్వామిక పార్టీలు, శక్తులతో కలిసి మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలకు నిరసనగా కలిసికట్టుగా ఐక్య కార్యాచరణ చేపట్టాలని, రైతులు, రైతు కూలీలతో కలిసి ఉద్యమించాలని కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తీర్మానించింది. ఈ ఏడాది నవంబరు ఒకటో తేదీ నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు పెద్దఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఆగస్టు 21 - సెప్టెంబరు 20 మధ్య కాలంలో కొత్త నేతను ఎన్నుకోవాలని, సెప్టెంబరులో కానీ అక్టోబరులో కానీ ప్లీనరీని నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. సమావేశం తర్వాత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా మీడియాతో మాట్లాడుతూ, పార్టీ సంస్థాగత ఎన్నికల షెడ్యూలు ప్రకటించారు. 


పార్టీ సభ్యులకు సైద్ధాంతిక, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై విస్తృత శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలని వర్కింగ్‌ కమిటీ నిర్ణయించిందని తెలిపారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నవంబరు 14 నుంచి 29 వరకూ ఉద్యమాన్ని చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. తప్పుడు ఆర్థిక విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, అన్ని కీలక రంగాల్లో పెరిగిపోయిన ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని మోదీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ సీడబ్ల్యూసీ తీర్మానించిందని తెలిపారు. కాగా, సోనియా గాంధీ నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్ని సమావేశంలో నేతలు ప్రకటించారు. అలాగే, పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలంటూ సమావేశంలో రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీ్‌సగఢ్‌ ముఖ్యమంత్రులతోపాటు మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ తదితరులు అభ్యర్థించారని, ఈ విషయాన్ని తాను పరిశీలిస్తానని రాహుల్‌ గాంధీ ప్రకటించారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక, సంస్థాగత ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంపై జీ-23 నాయకులు గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-10-17T08:05:39+05:30 IST