వావ్‌...వెర్మిసెల్లీ!

ABN , First Publish Date - 2021-01-16T05:47:46+05:30 IST

సేమ్యా అనగానే పాయసం గుర్తొస్తుంది. కానీ సేమ్యాతో నోరూరించే ఉప్మా, దోశలు కూడా చేసుకోవచ్చు. రాగి సేమ్యా, లెమన్‌ వెర్మిసెల్లీ వంటి రెసిపీలు బ్రేక్‌ఫాస్ట్‌లో తినడానికి బాగుంటాయి

వావ్‌...వెర్మిసెల్లీ!

సేమ్యా అనగానే పాయసం గుర్తొస్తుంది. కానీ సేమ్యాతో నోరూరించే ఉప్మా, దోశలు కూడా చేసుకోవచ్చు. రాగి సేమ్యా, లెమన్‌ వెర్మిసెల్లీ వంటి రెసిపీలు బ్రేక్‌ఫాస్ట్‌లో తినడానికి బాగుంటాయి.  కొత్త రుచులు ఆస్వాదించాలంటే ఈ వంటకాలను ప్రయత్నించండి.


సేమ్యా ఉప్మా


కావలసినవి

సేమ్యా - ఒక కప్పు, నూనె - రెండు టీస్పూన్లు, ఉప్పు - తగినంత, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - రెండు రెమ్మలు, వేరుసెనగలు - రెండు టేబుల్‌స్పూన్లు, అల్లం ముక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - చిటికెడు, క్యారెట్‌ - ఒకటి, క్యాప్సికం - ఒకటి, బీన్స్‌ - మూడు, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - ఒక కట్ట, పచ్చిబఠాణీ - రెండు టేబుల్‌స్పూన్లు.


తయారీ విధానం

  • ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్‌, క్యాప్సికం కట్‌ చేసుకోవాలి. 
  • స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. తరువాత మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగించుకోవాలి.
  • కాసేపు వేగిన తరువాత వేరుసెనగలు వేసి చిన్నమంటపై వేగనివ్వాలి.
  • అల్లం ముక్క, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసి 
  • కలియబెట్టుకోవాలి. 
  • ఇప్పుడు పచ్చిబఠాణీలు, క్యారెట్‌ ముక్కలు, క్యాప్సికం, బీన్స్‌ వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
  • పసుపు, కొద్దిగా ఉప్పు వేసి మరికాసేపు ఉడికించాలి. తరువాత సేమ్యా వేసి కలపాలి. 
  • చివరగా కొత్తిమీర వేసుకుని, నిమ్మరసం పిండి సర్వ్‌ చేసుకోవాలి. 
  • అల్పాహారంగా, సాయంత్రం స్నాక్స్‌గా దీన్ని తీసుకోవచ్చు.

సేమ్యా దోశ


కావలసినవి

సేమ్యా (వేగించినది) - అరకప్పు, ఉప్మా రవ్వ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, బియ్యప్పిండి - అర కప్పు, పెరుగు - పావు కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - రెండు, కరివేపాకు - రెండు రెమ్మలు, క్యారెట్‌ - ఒకటి. 


తయారీ విధానం

  • ఒక పాత్రలో వేగించిన సేమ్యా తీసుకోవాలి. అందులో ఉప్మారవ్వ, బియ్యప్పిండి, పెరుగు, తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్‌ ముక్కలు, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. మిశ్రమం దోశ పోసుకోవడానికి అనువుగా పలుచగా ఉండేలా చూసుకోవాలి.
  • ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి కాస్త నూనె రాసి పిండిని దోశలా పోయాలి. చిన్న మంటపై రెండు వైపులా కాల్చాలి. చట్నీతో తింటే సేమ్యా దోశ రుచిగా ఉంటుంది.

సేమ్యా బిర్యానీ


కావలసినవి

సేమ్యా (రోస్టేడ్‌) - పావుకేజీ, క్యారెట్‌ - ఒకటి, బీన్స్‌ - నాలుగు, క్యాప్సికం - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిబఠాణీ - ఒక కప్పు, గరంమసాలా - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, బిర్యానీ మసాలా - అర టీస్పూన్‌, పసుపు - ఒక టీస్పూన్‌, జీలకర్ర - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉప్పు - తగినంత.

పేస్టు కోసం : ఉల్లిపాయ-ఒకటి, సోంపు - టీస్పూన్‌, పచ్చిమిర్చి - మూడు, కొత్తిమీర-ఒక కట్ట, అల్లం-చిన్న ముక్క, వెల్లుల్లి-రెండు.


తయారీ విధానం

  • ముందుగా స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ, సోంపు, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర వేసి వేగించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి.
  • అదే పాన్‌లో మళ్లీ కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక జీలకర్ర, ఉల్లిపాయలు వేసి వేగించాలి. తరువాత క్యారెట్‌, క్యాప్సికం, బీన్స్‌, పచ్చిబఠాణీ వేసి మరికాసేపు చిన్నమంటపై వేగించుకోవాలి. తరువాత పసుపు, గరంమసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలియబెట్టాలి.
  • ఇప్పుడు సిద్ధం చేసి పెట్టుకున్న పేస్టు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక కప్పు నీళ్లు పోసి మరిగించాలి.
  • నీళ్లు మరుగుతున్న సమయంలో సేమ్యా వేయాలి. సేమ్యా ఉడికేంత వరకు ఉంచి, కొత్తిమీరతో గార్నిష్‌ చేసి దింపాలి.

లెమన్‌ వెర్మిసెల్లీ


కావలసినవి

సేమ్యా - రెండు కప్పులు, కొబ్బరి తురుము - రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ - అర టీస్పూన్‌, ఉప్పు - తగినంత, పంచదార - అర టీస్పూన్‌, పసుపు - అర టీస్పూన్‌, కొబ్బరి నూనె - రెండు టీస్పూన్లు, నిమ్మరసం - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - ఒక కట్ట, ఆవాలు - అర టీస్పూన్‌, సెనగపప్పు - ఒక  టేబుల్‌స్పూన్‌, మినప్పప్పు - ఒక టేబుల్‌స్పూన్‌, వేరుసెనగ - రెండు టేబుల్‌స్పూన్లు, కరివేపాకు - కొద్దిగా.

పేస్టు కోసం : కొబ్బరి తురుము - అరకప్పు, పచ్చిమిర్చి - మూడు, ఆవాలు - అర టీస్పూన్‌.


తయారీ విధానం

  • ముందుగా కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఆవాలను మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. 
  • స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, సెనగపప్పు, మినప్పప్పు, వేరుసెనగ, కరివేపాకు వేసి వేగించాలి. పసుపు, ఇంగువ వేసి కలపాలి. కాసేపు వేగిన తరువాత సిద్ధం చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్టు వేయాలి.
  • ఇప్పుడు సేమ్యా వేసి కొద్దిగా ఉప్పు, పంచదార వేసి కలపాలి. చిన్నమంటపై రెండు నిమిషాలు 
  • వేగనివ్వాలి.
  • తరువాత కొబ్బరినూనె, కొబ్బరి తురుము, నిమ్మరసం, కొత్తిమీర వేసి కలియబెట్టాలి. కాసేపు వేగిన తరువాత దింపి సర్వ్‌ చేసుకోవాలి.

పెరుగు సేమ్యా


కావలసినవి

సేమ్యా - అరకప్పు, పెరుగు - ఒక కప్పు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, నూనె - సరిపడా, కరివేపాకు - కొద్దిగా, వేరుసెనగలు - పావు కప్పు, జీడిపప్పు - గార్నిష్‌ కోసం.


తయారీ విధానం

  • ముందుగా ఒక పాత్రలో రెండు కప్పుల నీళ్లు పోసి సేమ్యాను ఉడికించాలి. తరువాత నీళ్లు తీసేసి సేమ్యా పక్కన పెట్టుకోవాలి. వాటిపై చల్లటి నీళ్లు పోస్తే సేమ్యా అంటుకుపోకుండా ఉంటుంది. 
  • తరువాత స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక  వేరుసెనగలు వేసి వేగించి పక్కన పెట్టాలి.
  • ఆదే పాన్‌లో మళ్లీ కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, ఇంగువ వేసి వేగించాలి. 
  • ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సేమ్యా వేయాలి, తగినంత ఉప్పు వేసి కలియబెట్టుకోవాలి.
  • చివరగా పెరుగు వేసి కలపాలి. వేగించిన వేరుసెనగలు, జీడిపప్పు పలుకులతో అలంకరించి సర్వ్‌ చేయాలి.

రాగి సేమ్యా 


కావలసినవి

రాగి సేమ్యా - ఒకటిన్నర కప్పు, ఉల్లిపాయ - ఒకటి, క్యారెట్‌ ముక్కలు - అరకప్పు, పచ్చిబఠాణీ - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, ఇంగువ - చిటికెడు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టీస్పూన్‌, కరివేపాకు - కొద్దిగా, ఉప్పు - తగినంత, నిమ్మరసం - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం

  • ముందుగా కుక్కర్‌లో రాగి సేమ్యాను ఐదారు నిమిషాల పాటు ఉడికించాలి. నాలుగైదు నూనె చుక్కలు వేస్తే సేమ్యా ముద్దగా కాకుండా ఉంటుంది.
  • స్టవ్‌పై పాత్రను పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఇంగువ వేయాలి. తరువాత ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగించాలి. మినప్పప్పు వేగిన తరువాత ఉల్లిపాయలు వేయాలి. 
  • ఉల్లిపాయలు వేగిన తరువాత పచ్చిమిర్చి, క్యారెట్‌ ముక్కలు, 
  • పచ్చిబఠాణీ వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి ఐదారు నిమిషాలు పాటు ఉడికించాలి.
  • ఇప్పుడు రాగి సేమ్యా వేసి కలియబెట్టాలి. కాసేపు వేగిన తరువాత నిమ్మరసం పిండి వడ్డించాలి.

Updated Date - 2021-01-16T05:47:46+05:30 IST