యమ్మీ.. వెర్మిసెల్లీ

ABN , First Publish Date - 2020-07-04T05:46:27+05:30 IST

సేమ్యా అనగానే పాయసం గుర్తొస్తుంది. కానీ సేమ్యాతో చాలా రెసిపీలు తయారుచేసుకోవచ్చు. సేమ్యా బైట్స్‌, ఇడ్లీ, కబాబ్స్‌, కట్‌లెట్స్‌, దోశ

యమ్మీ.. వెర్మిసెల్లీ

సేమ్యా అనగానే పాయసం గుర్తొస్తుంది. కానీ సేమ్యాతో చాలా రెసిపీలు తయారుచేసుకోవచ్చు. సేమ్యా బైట్స్‌, ఇడ్లీ, కబాబ్స్‌, కట్‌లెట్స్‌, దోశ, బర్ఫీ... ఇలా రుచికరమైన వంటలు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకాలస్యం... సేమ్యా రుచులను మీరూ ట్రై చేయండి. 


సేమ్యా ఉప్మా

కావలసినవి

సేమ్యా - ఒక కప్పు, నూనె - మూడు టేబుల్‌స్పూన్లు, ఆవాలు - ఒక టీస్పూన్‌, మినప్పప్పు - అర టీస్పూన్‌, సెనగపప్పు - ఒక టీస్పూన్‌, ఎండుమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, అల్లం - చిన్నముక్క, పచ్చిమిర్చి - రెండు, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - అర టీస్పూన్‌, పచ్చిబఠాణీ - రెండు టేబుల్‌స్పూన్లు, వేరుసెనగలు - కొన్ని, క్యాప్సికం - రెండు టేబుల్‌స్పూన్లు, బీన్స్‌ - రెండు టేబుల్‌స్పూన్లు, నిమ్మకాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట. ఉప్పు - రుచికి తగినంత.


తయారీ

  • ముందుగా పాన్‌లో నూనె వేసి సేమ్యాను గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
  • ఇప్పుడు మరో పాత్రలో నీళ్లు పోసి మరిగించాలి.
  • నీళ్లు మరుగుతున్న సమయంలో సేమ్యా వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి సేమ్యా మెత్తగా అయ్యే వరకు ఉడికించి దింపాలి. నీళ్లన్నీ తీసేసి సేమ్యా చల్లారేలా చూడాలి.
  • తరువాత స్టవ్‌పై మరో పాన్‌పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి.
  • మినప్పప్పు, సెనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మరికాసేపు వేగనివ్వాలి.
  • ఇప్పుడు వేరుసెనగలు వేసి కలపాలి. అల్లం ముక్క, పచ్చి మిర్చి వేయాలి.
  • తరిగిన ఉల్లిపాయలు, పచ్చిబఠాణీ, క్యారెట్‌ తురుము, క్యాప్సికం వేసి మరికాసేపు వేగించుకోవాలి.
  • చివరగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి చిన్నమంటపై రెండు నిమిషాలు ఉడికించాలి.
  • ఇప్పుడు సేమ్యా వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌ చేయాలి.
  • నిమ్మరసం పిండుకుని వేడివేడిగా సర్వ్‌ చేసుకోవాలి.


కట్‌లెట్స్‌

కావలసినవి

సేమ్యా - 200గ్రాములు, బంగాళదుంపలు - 200గ్రాములు, బియ్యప్పిండి - అరకప్పు, క్యారెట్‌ - రెండు, ఉల్లిపాయ - ఒకటి, గరంమసాలా - ఒక టీస్పూన్‌, కారం - రెండు టీస్పూన్లు, కొత్తిమీర - ఒకకట్ట, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ

  • ముందుగా బంగాళదుంపలను ఉడికించి గుజ్జుగా చేయాలి.
  • ఒక పాత్రలో నీళ్లు తీసుకుని స్టవ్‌పై పెట్టి మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో సేమ్యా వేసి, ఒక టీస్పూన్‌ నూనె వేయాలి.
  • సేమ్యా మెత్తగా ఉడికిన తరువాత నీళ్లు తీసేసి సేమ్యాను ఒక పాత్రలోకి తీసుకోవాలి.
  • అందులో బంగాళదుంపలు, ఉల్లిపాయలు, క్యారెట్‌ తురుము, కారం, బియ్యప్పిండి, తగినంత ఉప్పు, కొత్తిమీర వేసి కలపాలి.
  • ఈ మిశ్రమాన్ని కట్‌లెట్స్‌గా చేసుకుంటూ నూనెలో డీప్‌ ఫ్రై చేయాలి. రెండు వైపులా గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి. 
  • ఈ కట్‌లెట్స్‌ను టొమాటో కెచప్‌తో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.



వెర్మిసెల్లీ బర్ఫీ

కావలసినవి

సేమ్యా - 50గ్రాములు, పంచదార - అరకప్పు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూన్‌, జీడిపప్పు - ఐదారు పలుకులు.


తయారీ

  • ఒక పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి సేమ్యా, జీడిపప్పును గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
  • మరొక పాత్రలో నీళ్లు తీసుకుని మరిగించాలి. నీళ్లు మరుగుతున్న సమయంలో పంచదార వేయాలి. 
  • పంచదార కరిగాక వేగించి పెట్టుకున్న సేమ్యా వేయాలి. యాలకుల పొడి వేసి నెమ్మదిగా కలుపుతూ మరగనివ్వాలి. తరువాత కొద్దిగా నెయ్యి వేయాలి. 
  • ఒక వెడల్పాటి ప్లేట్‌ తీసుకుని నెయ్యి రాయాలి. అందులో సేమ్యా మిశ్రమం పోయాలి. 
  • చల్లారిన తరువాత చతురస్రాకారం షేప్‌లో కట్‌ చేయాలి. జీడిపప్పుతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేసుకోవాలి.


సేమ్యా దోశ

కావలసినవి

సేమ్యా - అరకప్పు, రవ్వ - ఒకటిన్నర టేబుల్‌స్పూన్‌, బియ్యప్పిండి - అరకప్పు, పెరుగు - పావుకప్పు, ఉప్పు - అర టీస్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, పచ్చిమిర్చి - ఒకటి, కరివేపాకు - కొద్దిగా, క్యారెట్‌ తురుము - పావు కప్పు.


తయారీ

  • ముందుగా సేమ్యాను కొద్దిసేపు వేగించాలి.
  • ఒక పాత్రలో వేగించిన సేమ్యా, రవ్వ, బియ్యప్పిండి, పెరుగు, తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, క్యారెట్‌ తురుము, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి.
  • స్టవ్‌పై దోశ పాన్‌ పెట్టి వేడి అయ్యాక మిశ్రమాన్ని స్పూన్‌తో దోశెలా పోయాలి. 
  • దోశ చక్కగా కాలేందుకు కొద్దిగా నూనె వేయాలి. 
  • గోధుమరంగులోకి మారే వరకు కాల్చాలి. దోశ ఒకవైపు బాగా కాలిన తరువాత తిప్పి మరోవైపు కొద్దిగా కాల్చాలి.
  • చట్నీతో వేడి వేడిగా వడ్డించాలి.


సేమ్యా ఇడ్లీ

కావలసినవి

సేమ్యా - రెండు కప్పులు, పెరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - మూడు, అల్లం ముక్క - చిన్నది, కొత్తిమీర - ఒకకట్ట, క్యారెట్లు - మూడు, ఆవాలు - ఒక టీస్పూన్‌, నూనె - సరిపడా, ఉప్పు -రుచికి తగినంత, సెనగపప్పు - ఒక టేబుల్‌స్పూన్‌. 


తయారీ 

  • ఒక పాత్రలో పెరుగు తీసుకొని అందులో క్యారెట్‌ తురుము, తగినంత ఉప్పు, పచ్చిమిర్చి. తరిగిన అల్లం వేసి కలిపి పక్కన పెట్టాలి.
  • పాన్‌ను స్టవ్‌పై పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక ఆవాలు వేసి వేగించాలి. తరువాత సెనగపప్పు వేయాలి. కాసేపు వేగిన తరువాత సేమ్మా వేసి గోధుమరంగులోకి మారే వరకు వేగించాలి.
  • ఇప్పుడు పెరుగు మిశ్రమం వేసి బాగా కలియబెట్టి పక్కన పెట్టాలి.
  • పావు గంట చల్లారిన తరువాత కొత్తిమీర వేసి కలపాలి.
  • ఇడ్లీ పాత్రలకుు నూనె రాసి, అందులో సేమ్యా మిశ్రమాన్ని వేయాలి.
  • ఇడ్లీ కుక్కర్‌లో పది నుంచి పన్నెండు నిమిషాల పాటు ఉడికించాలి.
  • ఆవిరి తీసేసిన తరువాత సేమ్యా ఇడ్లీలను బయటకు తీయాలి.
  • వీటిని చట్నీతో తింటో భలేగా ఉంటాయి.


వెర్మిసెల్లీ బైట్స్‌

కావలసినవి

సేమ్యా - రెండు కప్పులు, నెయ్యి - రెండు టేబుల్‌స్పూన్లు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ - అరకప్పు, కొబ్బరి తురుము - పావు కప్పు, ప్లాస్టిక్‌  టీకప్పు - ఒకటి, జీడిపప్పు - ఐదారు పలుకులు.


తయారీ

  • స్టవ్‌పై ఒక పాన్‌ పెట్టి నెయ్యి వేసి, కాస్త వేడి అయ్యాక సేమ్యా వేసి వేగించాలి.
  • తరువాత కొబ్బరి తురుము వేసి కలపాలి.
  • జీడిపప్పు పలుకులను దంచి వేయాలి. 
  • కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలిపి ఐదారు నిమిషాల పాటు చిన్నమంటపై వేగనివ్వాలి.
  • మిశ్రమాన్ని చల్లారినివ్వాలి. తరువాత చేతికి కాస్త నూనె రాసుకుని వెర్మిసెల్లీని చిన్న ప్లాస్టిక్‌ టీకప్పులో వేస్తూ గట్టిగా ఒత్తాలి. షేప్‌ సరిగ్గా ఉండేలా చూసుకుంటూ ప్లేట్‌లో వేయాలి. 
  • అంతే.. వెర్మిసెల్లీ బైట్స్‌ రెడీ. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Updated Date - 2020-07-04T05:46:27+05:30 IST