బీజేపీతో ఉంటే సరేసరి.. లేదంటే చీలిక తప్పదు: తేల్చేసిన Eknath Shinde

ABN , First Publish Date - 2022-06-22T02:50:05+05:30 IST

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే సేన ఎమ్మెల్యేలను తీసుకుని

బీజేపీతో ఉంటే సరేసరి.. లేదంటే చీలిక తప్పదు: తేల్చేసిన Eknath Shinde

సూరత్: మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. శివసేన సీనియర్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే సేన ఎమ్మెల్యేలను తీసుకుని గుజరాత్‌లో క్యాంపు వేయడంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. సమస్య పరిష్కారం కోసం సేన నేత మిలింద్ నర్వేకర్ సూరత్ వెళ్లి హోటల్‌లో ఉన్న ఏక్‌నాథ్‌ను కలిశారు. దాదాపు రెండు గంటల పాటు వీరి మధ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం ఉద్ధవ్ థాకరేకు ఫోన్ కలిపిన మిలింద్ నర్వేకర్.. షిండేతో మాట్లాడించినట్టు తెలుస్తోంది. 


ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ.. తన వద్ద 35 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. బీజేపీతో ఉద్ధవ్ థాకరే పొత్తు పెట్టుకునేందుకు ముందుకొస్తే ఎలాంటి సమస్య ఉండబోదని, లేదంటే పార్టీలో చీలిక తప్పదని తెగేసి చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, తనకు ముఖ్యమంత్రి పీఠంపై కన్ను లేదని కూడా ఉద్ధవ్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. కాబట్టి తనపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పినట్టు సమాచారం. కాగా, షిండే తిరుగుబాటు తర్వాత ఆయనను సేన సీఎల్పీ నేత పదవి నుంచి పార్టీ తప్పించింది. ఈ నేపథ్యంలోనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. సేన కార్యకర్తలు తనకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడంపైనా షిండే అసంతృప్తి వ్యక్తం చేశారు.


 ఏక్‌నాథ్ డిమాండ్‌పై ఉద్ధవ్ మాట్లాడుతూ.. కాషాయ పార్టీ గతంలో శివసేన నేతలను ఇబ్బందులకు గురిచేసిందని చెప్పారు. దీనికి షిండే బదులిస్తూ.. ఎన్సీపీ, కాంగ్రెత్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని తనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. బీజేపీతో పొత్తుకు వారు ఓకే అని, లేదంటే మాత్రం పార్టీలో చీలక తప్పదని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 


Updated Date - 2022-06-22T02:50:05+05:30 IST