Sena MPs Against Uddhav : థాక్రేకి ఇంకో షాక్.. సీఎం షిండేతో టచ్‌లో 12 మంది సేన ఎంపీలు.. వెంటనే ‘వై’ కేటగిరి భద్రత

ABN , First Publish Date - 2022-07-19T20:16:18+05:30 IST

శివసేన(Shivasena) ఎమ్మెల్యేల అనూహ్య తిరుగుబాటుతో షాక్‌లో ఉన్న మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే(Uddav Thackerey)కి మరో భారీ షాక్ తగలబోతోందా ?..

Sena MPs Against Uddhav : థాక్రేకి ఇంకో షాక్.. సీఎం షిండేతో టచ్‌లో 12 మంది సేన ఎంపీలు.. వెంటనే ‘వై’ కేటగిరి భద్రత

న్యూఢిల్లీ : శివసేన(Shivasena) ఎమ్మెల్యేల అనూహ్య తిరుగుబాటుతో షాక్‌లో ఉన్న మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే(Uddav Thackerey)కి మరో భారీ షాక్ తగలబోతోందా ?.. పార్టీ ఎంపీలు సైతం సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని రెబల్స్ గూటికి చేరబోతున్నారా ? అంటే ఔననే సమాధానాలు వినిపిస్తున్నాయి. శివసేన పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు సీఎం షిండేతో టచ్‌లో ఉన్నారని, రెబల్ వర్గంలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతున్నారని ఆ పార్టీ విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఎంపీలంతా లోక్‌సభలో ప్రత్యేక బృందంగా వ్యవహరించనున్నారని ఆయావర్గాలు తెలిపాయి. ఈ రిపోర్టులు వెలువడగానే ఈ 12 మంది ఎంపీలకు ‘ వై ’ కేటగిరి భద్రత కల్పిస్తూ ప్రకటన వెలువడడం ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది. కాగా మహారాష్ట్ర కేబినెట్‌పై బీజేపీ అధినాయక్వంతో చర్చించేందుకు షిండే ఢిల్లీకి వెళ్లిన సమయంలోనే ఈ పరిణామం చోటుచేసుకుంది.


లోక్‌సభలో శివసేనకు మొత్తం 19 మంది ఎంపీలు ఉండగా అందులో 18 మంది మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 18 మందిలో 12 మంది సీఎం ఏక్‌నాథ్ షిండే సోమవారం నిర్వహించిన వర్చువల్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఏక్‌నాథ్ షిండే నాయకత్వానికి వారంతా మద్ధతు తెలిపారు. దీంతో 12 మంది ఎంపీలకు వై కేటగిరి భద్రత కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 


లోక్‌సభ స్పీకర్‌కు లేఖ..

లోక్‌సభలో ప్రత్యేక బృందంగా వ్యవహరించడంపై స్పీకర్ ఓం బిర్లాకు 12 ఎంపీలు సోమవారం రాత్రి ఒక లేఖ కూడా రాశారు. తమ గ్రూపుకి ముంబై సౌత్ సెంట్రల్ ఎంపీ రాహుల్ షెవాలే నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ఈ గ్రూపు చీఫ్ విప్‌‌గా యవట్మాల్ ఎంపీ భావన గౌలీ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని తెలిపారు. కాగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఇటివలే భావన పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి ఉద్ధవ్ థాక్రే తొలగించారు. ఆమె స్థానంలో రజన్ విచారేని నియమించారు. అయితే ఈ నియామకానికి స్పీకర్ కార్యాలయ ఆమోదం ఇంకా లభించలేదు. లోక్‌సభ‌లో ప్రత్యేక గ్రూపుగా గుర్తింపు విషయమై స్పీకర్ నిర్ణయం తర్వాత శివసేన సింబల్‌ కోసం 12 మంది ఎంపీలు ప్రయత్నించే అవకాశం ఉంది.


కాగా గతవారమే పార్టీల ఎంపీలతో సమావేశమైన ఉద్ధవ్ థాక్రే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపతి ముర్ముకి మద్దతు ప్రకటించారు. ఒంటరైన ఉద్ధవ్ థాక్రే విధిలేని పరిస్థితుల్లో ఎంపీల అభిప్రాయానికే ఓటు వేశారని వార్తలు కూడా వచ్చాయి. ఈ మేరకు ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పించాయి. 


మరోవైపు ఎమ్మెల్యేల తిరుగుబావుటాపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్ట్ తీర్పు కోసం ఉద్ధవ్ థాక్రే, ఏక్‌నాథ్ షిండే వర్గాలు ఎదురుచూస్తున్నాయి. పార్టీ బాస్ ఎవరనేది సుప్రీంకోర్ట్ తీర్పు ఆధారంగా తేలే అవకాశాలున్నాయి. శివసేన ఎమ్మెల్యేలు అత్యధికులు ఏక్‌నాథ్ షిండే వర్గంలో చేరిపోయారు. దీంతో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం కుల్పకూలింది. ఏక్‌నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Updated Date - 2022-07-19T20:16:18+05:30 IST