భారత్‌కు అడ్డుపడొద్దు.. అమెరికా అధ్యక్షుడికి సెనెటర్ల లేఖ

ABN , First Publish Date - 2021-10-28T02:50:06+05:30 IST

రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుకు అడ్డంకిగా మారే కాట్సా(CAATSA) చట్టాన్ని భారత్‌పై ప్రయోగించవద్దంటూ ఇద్దరు అమెరికా సెనెటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా లేఖ రాశారు.

భారత్‌కు అడ్డుపడొద్దు.. అమెరికా అధ్యక్షుడికి సెనెటర్ల లేఖ

వాషింగ్టన్: రష్యా నుంచి ఆయుధాల కొనుగోలుకు అడ్డంకిగా మారే కాట్సా(CAATSA) చట్టాన్ని భారత్‌పై ప్రయోగించవద్దంటూ ఇద్దరు అమెరికా సెనెటర్లు అధ్యక్షుడు జో బైడెన్‌కు తాజాగా లేఖ రాశారు. రష్యా రూపొందించిన ఎస్-400 ట్రయంఫ్ క్షిపణి వ్యవస్థ కొనుగోలు విషయంలో భారత్‌కు ఇబ్బందులు కలుగ చేయవద్దని సూచించారు. ఈ చట్టం నుంచి భారత్‌కు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ.. డెమాక్రెటిక్ పార్టీకి చెందిన మార్క్ వార్నర్, రిపబ్లికన్ పార్టీకి చెందిన జాన్ కోర్నిన్  లేఖ రాశారు. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ థ్రూ సాంక్షన్స్ చట్టం. దీని ప్రకారం.. రష్యాతో పాటూ అమెరికా తనకు విరోధిగా భావిస్తున్న దేశాల నుంచి అత్యాధునిక ఆయుధ కొనుగోళ్లు చేపట్టడం నిషిద్ధం. దీన్ని అతిక్రమించిన దేశాలపై కూడా అమెరికా తన ఆంక్షల కొరడా ఝళిపిస్తుంది. 


కాగా.. అమెరికాకు భారత్ ముఖ్య భాగస్వామి అన్న విషయాన్ని వార్నర్, కోర్నిన్ తమ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాకుండా.. ఇటీవల కాలంలో అమెరికా-భారత్ బంధం బలపడుతోందని, రష్యా నుంచి భారత ఆయుధ కొనగోళ్లు కూడా ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయినట్టు వారు ప్రస్తావించారు. ఇటువంటి సమయంలో అమెరికా కాట్సా చట్టాన్ని ప్రయోగిస్తే భారత్‌లో అమెరికాపై అపనమ్మకం పెరిగే అవకాశం ఉందని కూడా వారు హెచ్చరించారు. ఇందుకు బదులు.. అమెరికా రక్షణ వ్యవస్థలు భారత అవసరాలకు తగినవని చెప్పే ప్రయత్నం చేయాలని సూచించారు.


 ప్రాంతీయంగా భారత్ ఎదుర్కొంటున్న రక్షణ సవాళ్లకు తగినట్టుగా ప్రత్యామ్నాయ ఆయుధ కొనుగోలు మార్గాలను కూడా అమెరికా సూచించే ప్రయత్నం చేయాలన్నారు. ఈ విషయమై భారత్‌తో చర్చలు జరపడం ద్వారా.. ఇరు దేశాల దౌత్యసంబంధాలు మరింత బలపడతాయని, ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం వేసేందుకు కూడా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కాగా.. ఎస్-400 క్షిపణులు కొనుగోలు చేసేందుకు భారత్ రష్యాతో 2018లో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే.. కాట్సా చట్టం ఈ ఒప్పందానికి అడ్డంకిగా మారే అవకాశం ఉందన్న సందేహాలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి.  

Updated Date - 2021-10-28T02:50:06+05:30 IST