కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

ABN , First Publish Date - 2021-01-18T00:15:03+05:30 IST

కోటి రూపాయల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ రైల్వే ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్

కోటి రూపాయల లంచం కేసులో రైల్వే అధికారి అరెస్ట్

న్యూఢిల్లీ: కోటి రూపాయల లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ రైల్వే ఇంజినీరింగ్ సర్వీస్ సీనియర్ అధికారి (ఐఆర్ఈఎస్) మహేందర్‌సింగ్ చౌహాన్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన నుంచి కోటి రూపాయల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న సీబీఐ, ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసని పేర్కొంది. ‘‘ఆయన లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాం. మొత్తం కోటి రూపాయలను స్వాధీనం చేసుకున్నాం. ఇటీవల కూడా పెద్దమొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నప్పటికీ సీబీఐ చరిత్రలో అతిపెద్ద ఎన్‌ట్రాప్‌మెంట్ కేసు ఇదే’’ అని సీబీఐ తెలిపింది. 


నిందితుడు మహేందర్ సింగ్ చౌహాన్ రైల్వేస్ ఇంజినీరింగ్ సర్వీస్‌ 1985 బ్యాచ్‌కు చెందిన అధికారి. నార్త్‌ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేస్‌ హెడ్‌క్వార్టర్స్ అయిన మాలిగావ్‌లో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేలో మరిన్ని ప్రాజెక్టుల కాంట్రాక్టులను ఇప్పిస్తానన్న హామీతో ఆయనీ లంచం తీసుకున్నట్టు సీబీఐ పేర్కొంది. కాగా, ఈ కేసులో ఆయనతోపాటు మరో ఇద్దరిని కూడా సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ, అసోం, ఉత్తరాఖండ్ సహా దేశంలోని 20 ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. చౌహాన్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ కస్టోడియల్ రిమాండ్‌ కోరనుంది. 


నకిలీ బిల్లలను క్లియర్ చేసేందుకు ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఎగ్జిక్యూటివ్‌లతో కుమ్మక్కు కావడం, తద్వారా ప్రభుత్వ అధికారులకు భారీ నష్టాన్ని కలిగించినందుకు గాను గతేడాది అక్టోబరులో భారతీయ రైల్వేకు చెందిన నలుగురు అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. ఈ నలుగురు అధికారులు కూడా నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వేకు చెందిన వారే కావడం గమనార్హం.


అంకెలను తారుమారు చేయడం ద్వారా వీరు భారీ మోసానికి పాల్పడినట్టు సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. నిజానికి బిల్లు మొత్తం రూ. 1.80 కోట్లు కాగా, దానికి ముందు ఒకటి అంకెను చేర్చడం ద్వారా ఆ బిల్లును ఏకంగా రూ. 11.80 కోట్లుగా మార్చారు. మరో దాంట్లో రూ. 2.92 కోట్ల బిల్లును ముందు ఒకటి చేర్చడం ద్వారా రూ. 12.92 కోట్లుగా మార్చారు. ఇలా మొత్తం 8 బిల్లులను మార్చినట్టు గుర్తించామని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. 

Updated Date - 2021-01-18T00:15:03+05:30 IST