TDP : సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచినా... అన్నింటికీ చిరునవ్వుతో కళా జవాబు..!

ABN , First Publish Date - 2022-01-01T17:36:01+05:30 IST

రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్‌. కొంతమంది హడావుడి, హంగామా, ఆర్భాటాలతో రాజకీయాలు చేస్తుంటారు. కానీ మరికొంతమంది మాత్రం తమ స్వీయ అనుభవంలో ఎదురైన సవాళ్లు, రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుని

TDP : సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచినా... అన్నింటికీ చిరునవ్వుతో కళా జవాబు..!

ఆ పెద్దాయన ఏడు పదుల వయసులో 17 ఏళ్ల కుర్రాడిలా ఎందుకు స్పీడ్ పెంచారు? అధికార పార్టీ వ్యూహాలతో పాటు సొంత పార్టీ నేతల వెన్నుపోటు రాజకీయాలను ఎదుర్కోవటానికి సదరు నేత చేస్తున్న ప్రయత్నాలు ఏమిటి? అన్నింటికీ చిరునవ్వుతో జవాబు చెప్పే ఆ నాయకుడు... క్యాడర్‌లో ఎలాంటి జోష్ నింపుతున్నారు? ఇంతకీ ఎవరా నాయకుడు? ఆ నియోజకవర్గం ఏది? ఆ వివరాలు ఏబీఎన్-ఇన్‌సైడ్ స్టోరీలో తెలుసుకుందాం...


టీడీపీ నేతల్లో అత్యంత సీనియర్ లీడర్‌ కళా వెంకట్రావు

రాజకీయాల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్‌. కొంతమంది హడావుడి, హంగామా, ఆర్భాటాలతో రాజకీయాలు చేస్తుంటారు. కానీ మరికొంతమంది మాత్రం తమ స్వీయ అనుభవంలో ఎదురైన సవాళ్లు, రాజకీయ సమీకరణలను బేరీజు వేసుకుని పొలిటికల్ జర్నీ సాగిస్తుంటారు. అలాంటి నాయకులు దీర్ఘకాలిక రాజకీయాల్లో మనగలుగుతారన్నది అక్షర సత్యం. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే- శ్రీకాకుళం జిల్లా టీడీపీ నేతల్లో అత్యంత సీనియర్ లీడర్‌గా ఉన్న కిమిడి కళా వెంకట్రావు పాలిటిక్స్ సమ్‌థింగ్‌ డిఫరెంట్ అన్నట్లుగా ఉంటాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి రాజకీయాల్లో ఆరితేరిన కళా వెంకట్రావు వ్యూహాలు తలపండిన రాజకీయ నేతలకు సైతం అంతు చిక్కవని అంటుంటారు.


గెలుపోటముల రుచి తెలిసిన.. ఆ ఓటమిని సవాల్‌గా తీసుకున్నారట

శ్రీకాకుళం జిల్లాలో బలమైన కాపు సామాజికవర్గం నేతగా కళా వెంకట్రావుకు గుర్తింపు ఉంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా గెలుపొందిన ఆయన.. సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయాలను దగ్గర నుంచి చూశారు. వయసులో పెద్దాయన అయినా, నేటితరం రాజకీయ నేతలకు తీసిపోని విధంగా రాజకీయాలు చేస్తున్నారని ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. కళా వెంకట్రావు 2019 ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఓటమి చెందారు. అయితే రాజకీయాల్లో గెలుపోటముల రుచి తెలిసిన కళావెంకట్రావు.. ఆ ఓటమిని సవాల్‌గా తీసుకున్నారట. పదవితో సంబంధం లేకుండా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేయటం, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారికి తన పూర్వ పరిచయాలతో పరిష్కార మార్గాలను చూపించటం వంటివి క్షణాల్లో చేస్తున్నారట. 


స్పీడు పెంచిన కళా వెంకట్రావు

ఇదిలావుంటే, ఇటీవల ఎచ్చెర్ల నియోజకవర్గంలో కళా వెంకట్రావు పెంచిన స్పీడు.. అధికార పార్టీ నేతలను కంగారు పడేలా చేస్తోందట. శుభకార్యాలు, పరామర్శలు, రోడ్డెక్కి పోరాటాలు.. ఇలా ఏదైనా ఆయనే స్వయంగా వాలిపోతున్నారు. శత్రువునైనా చిరునవ్వుతో పలకరించే కళా వెంకట్రావు స్వభావం తెలిసిన వారంతా.. ఆయన స్టయిలే సపరేట్ అంటూ చెవులు కొరుక్కుంటున్నారట. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కళా వెంకట్రావు.. ప్రస్తుతం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. అయినా అధికార పార్టీతో పాటు, స్వపక్ష నేతల నుంచీ ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఆయన కనిపిస్తే సలామ్ కొట్టే నేతలే నియోజకవర్గంలో పార్టీని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారని కళా వర్గీయులు చెబుతున్నారు. అయితే ఇంటి దొంగలను చూసీచూడనట్టుగా వదిలేసి, తన రాజకీయ చతురతతో కళా వెంకట్రావు ముందుకు సాగుతుండటం సొంత పార్టీ నేతలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. 


తనను ఓడించిన ప్రజల మనసులను గెలుచుకోవటానికి ప్రయత్నాలు..

మొత్తంమీద సీనియర్ నాయకుడు అయిన కళా వెంకట్రావును రాజకీయంగా అడ్డుకోవటానికి ప్రత్యర్థులు బలంగా ప్రయత్నిస్తున్నారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలన్న సామెతను ఆయన బలంగా నమ్ముతున్నారట. తనను ఓడించిన ప్రజల మనసులను గెలుచుకోవటానికి చేసే ప్రయత్నాల్లో.. తన వయస్సును సైతం కళా వెంకట్రావు లెక్క చేయటం లేదని  జిల్లాలో టాక్ వినిపిస్తోంది. మరి పెద్దాయన కష్టం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. 

Updated Date - 2022-01-01T17:36:01+05:30 IST