ఉలిక్కిపడిన ‘విప్లవోద్యమం’

ABN , First Publish Date - 2021-06-23T06:04:56+05:30 IST

ఉలిక్కిపడిన ‘విప్లవోద్యమం’

ఉలిక్కిపడిన ‘విప్లవోద్యమం’
యాప నారాయణ అలియాస్‌ హరిభూషన్‌ (ఫైల్‌)

ప్రకటించిన బస్తర్‌ పోలీసు ఉన్నతాధికారులు

అనారోగ్యంతో కన్నుమూసినట్టు సమాచారం

నోరు మెదపని మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు

ఏ ప్రకటనా చేయని మావోయిస్టు పార్టీ

హరిభూషణ్‌ స్వస్థలం గంగారం మండలంలోని మడగూడ గ్రామం

వరంగల్‌ నగరంలో సాగిన ఇంటర్‌, డిగ్రీ విద్య

మూడు దశాబ్దాలుగా అజ్ఞాత జీవితం


మహబూబాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) :  మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌  హరిభూషణ్‌ అనారోగ్యంతో కన్నుమూసినట్టు జరుగుతున్న ప్రచారం కలకలం రేపుతోంది. దంతెవాడ పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని ప్రకటిస్తుండగా, మావోయిస్టు పార్టీ మాత్రం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.  చత్తీ్‌సఘడ్‌ అడవుల్లో ఉంటూ తెలంగాణలో పార్టీ కార్యాకలాపాలను నిర్వహిస్తున్న ఆయన అనారోగ్యానికి గరయ్యారా? లేక మరేదైనా కారణంతో ఆయనకు ప్రాణహాని జరిగిందా? అనేది తెలియడం లేదు. కరోనాతో బాధపడుతున్న హరిభూషణ్‌.. విషాహారం తినటం వలన మృతి చెందారని దంతెవాడ ఎస్పీ ప్రకటించినట్టు సమాచారం. 

మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలానికి చెందిన నక్సల్బరీ రెండవ తరం నేత కత్తి మోహన్‌రావు దండకారణ్యంలో ఉంటూ జనతన సర్కార్‌ నడుపుతున్న స్కూళ్లలో గురూజీ దాముదాదాగా పేరు గడించి ఈ నెల 10న గుండెపోటుతో మరణించిన ఉదంతం మరువక ముందే 12 రోజుల వ్యవధిలో ఇదే జిల్లా గంగారం మండలం మడగూడెంకు చెందిన మరో అగ్రనేత హరిభూషణ్‌ మరణించాడంటూ సోషల్‌ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగడంతో నిజమా అబద్ధమా అనేది స్పష్టత లేకుండా పోయింది. 

కత్తి మోహన్‌రావు మృతిపై ఆపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ పేరిట  ఒక ప్రకటన విడుదల చేయడంతో విశ్వసనీయత కన్పించింది. ప్రస్తుతం హరిభూషణ్‌ మృతిపై సోషల్‌మీడియాలో ప్రచారం తప్ప దృవీకరించే స్పష్టత రాలేదు. దంతెవాడలో మాత్రం పోలీసులు ప్రకటించారన్న ప్రచారం జోరుగా సాగింది. యాప నారాయణ సొంత జిల్లా మహబూబాబాద్‌ పోలీసులు మాత్రం ఈ విషయమై స్పష్టత రాలేదని చెబుతున్నారు. ఆయన స్వగ్రామంలో బంఽధువులు, కుటుంబ సభ్యులు హరిభూషన్‌ మృతిపై అంతా వట్టి ప్రచారమేనని కొట్టి పారేస్తున్నారు. 


హరిభూషణ్‌ ప్రస్థానం..

మహబూబాబాద్‌ జిల్లా  గంగారం మండలంలోని మడగూడ గ్రామానికి చెందిన యాప రంగయ్య – కొమ్మక్క దంపతులకు కలిగిన ఏడుగురు సంతానం. వారిలో తొలిసంతానంగా యాప నారాయణ జన్మించారు.. ఆయన తల్లి కొమ్మక్క గతంలోనే మరణించగా తండ్రి యాప రంగయ్య , ముగ్గురు తమ్ముళ్లు, ముగ్గురు చెల్లెళ్లు సొంత గ్రామంలో ఉన్నారు. ఒక తమ్ముడు అనారోగ్యంతో మృతిచెందాడు. యాప నారాయణ 1981లో 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే చదివాడు. 1987లో 10వ తరగతి నర్సంపేట పట్టణంలో చదువుకున్నాడు. ఈ సమయంలో మార్షల్‌ ఆర్స్ట్‌లో శిక్షణ పొందాడు. అనంతరం 1987–89లో వరంగల్‌లోని లాల్‌ బహూదూర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌, 1990–93వరకు హన్మకొండలోని ఆర్ట్స్‌ఆండ్‌సైన్స్‌ కళాశాలలో డిగ్రీ విద్యను పూర్తిచేశారు. 

విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే యాప నారాయణ విప్లవోద్యమానికి ఆకర్షితుడయ్యారు. ఇంటర్‌లో ఉన్నప్పుడు కొన్నాళ్లపాటు పీపుల్స్‌వార్‌ (మావోయిస్టు) అనుబంధ సంఘం ఆర్‌ఎ్‌సయూలో పనిచేశారు. పోలీసుల నిర్బంధం పెరగడంతో 1990లలో పూర్తిస్థాయిలో ఉద్యమానికి అంకితమై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉద్యమంలో అంకితభావం ప్రదర్శించడం, అక్రమాలపై ఉక్కుపాదం మోపడంతో యాపనారాయణ హరిభూషణ్‌గా  మారి  ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగారు.  మొదట సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించిన యాప నారాయణ.. దళంలో డిప్యూటీ కమాండర్‌గా ఎదిగాడు. ఆపై దళకమాండర్‌గా పదోన్నతి పొందాడు. అనంతరం ప్లాటూన్‌ కమాండర్‌గా పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా, కేంద్ర కమిటీ సభ్యుడిగాతత పనిచేస్తున్నారు.. అజ్ఞాతంలో ఉండగానే గంగారం గ్రామానికి చెందిన జెజ్జరి సమ్మక్కను వివాహమాడారు. హరిభూషణ్‌ భార్య సమ్మక్క ఆలియాస్‌ శారద గతంలో లొంగిపోగా మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.




అంతటా గోప్యం


కొత్తగూడ : హరిభూషణ్‌ మృతిపై తెలంగాణ పోలీసులకు సమాచారం లేదా.. అనే ప్రశ్న ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సహజంగా మావోయిస్టు పార్టీలో అగ్రనేతలు మరణించినప్పుడు తమ నెట్‌వర్క్‌ ద్వారా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందుతుంది. వారు మృతుడి సొంత జిల్లా పోలీసులకు వెంటనేసమాచారం ఇస్తారు.  తాజాగా హరిభూషణ్‌ మృతిపై తమకు ఎటువంటి సమాచారం అందలేదని మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు చెబుతున్నారు. హరిభూషణ్‌ సొంతమండలమైన గంగారం పోలీసులు కూడా ఇదే మాటను చెబుతున్నారు.  అయితే హరిభూషణ్‌ మృతిచెందాడని చత్తీ్‌సఘడ్‌లోని దంతెవాడ ఎస్పీ పేరుతో సోషల్‌మీడియాలో  ప్రచారం సాగుతోంది.  ఇంతజరుగుతున్నా మావోయిస్టు పార్టీ నుంచి కూడా ఎటువంటి పత్రికా ప్రకటన వెలువడలేదు.

Updated Date - 2021-06-23T06:04:56+05:30 IST