Taiwan official found dead : తైవాన్ ‘మిసైల్ డెవలప్‌మెంట్’ అధికారి అనుమానాస్పద మృతి.. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో పరిణామం..

ABN , First Publish Date - 2022-08-06T22:47:13+05:30 IST

తైవాన్ (Taiwan) మిలిటరీ ఆధ్వర్యంలో పరిశోధన, అభివృద్ధి విభాగం ‘ఎన్‌సీఎస్‌ఐఎస్‌టీ’ (నేషనల్ చుంగ్-షాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) డిప్యూటీ డైరెక్టర్ యూ యంగ్ లీ-హింగ్ (Ou Yang Li-hsing) అ

Taiwan official found dead : తైవాన్ ‘మిసైల్ డెవలప్‌మెంట్’ అధికారి అనుమానాస్పద మృతి.. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో పరిణామం..

న్యూఢిల్లీ : తైవాన్ (Taiwan) మిలిటరీ ఆధ్వర్యంలో పనిచేసే పరిశోధన, తయారీ విభాగం ‘ఎన్‌సీఎస్‌ఐఎస్‌టీ’(NCSIST) డిప్యూటీ డైరెక్టర్ యూ యంగ్ లీ-హింగ్ (Ou Yang Li-hsing) అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. శనివారం ఉదయం దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ గదిలో ఆయన మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా ఎన్‌సీఎస్ఐఎస్‌టీ (నేషనల్ చుంగ్-షాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) తైవాన్ మిలిటరీకి అనుబంధంగా పనిచేస్తోంది. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం.. యూ యంగ్ పని నిమిత్తం దక్షిణ తైవాన్‌లోని పింగ్‌తుంగ్‌కు వెళ్లారు. ఈ ఏడాది ఆరంభంలోనే క్షిపణుల ఉత్పత్తికి సంబంధించిన పలు ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారని పేర్కొంది. కాగా తైవాన్‌లో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసి(Nancy pelosi) పర్యటన నేపథ్యంలో ఉద్రిక్తత పరిస్థితులు, చైనా(China) మిలిటరీ డ్రిల్స్ (Military drills) నిర్వహిస్తున్న ఈ పరిణామం వెలుగుచూసింది.


కాగా చైనా ముప్పు పెరిగిపోతున్న నేపథ్యంలో తైవాన్ మిలిటరీ సారధ్యంలో పనిచేసే ఎన్‌సీఎస్‌ఐఎస్‌టీ(NCSIST) క్షిపణుల ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ ఏడాది చివరి నాటికి 500 మిసైళ్లను ఉత్పత్తి చేయాలనుకుంటోంది. యుద్ధ సామర్థ్యాలను పెంచుకోవాలనే లక్ష్యంలో భాగంగా క్షిపణుల ఉత్పత్తిపై దృష్టిపెట్టింది. ఇందుకుతగ్గట్టే ఎస్‌సీఎస్ఐఎస్‌టీ ప్రస్తుతం దక్షిణ తైవాన్‌లోని జిపెంగ్ మిలిటరీ ఫెసిలిటీలో క్షిపణులను వరసగా పరీక్షిస్తోందని ‘జెరూసలేం పోస్ట్’ కథనం పేర్కొంది. ఈ మిసైళ్లు 7,620 మీటర్ల ఎత్తువరకు చేరుకోగలుగుతున్నట్టు తొలి మూడు రౌండ్లలో తెలిసిందని పేర్కొంది. పింగ్‌తుంగ్ కౌంటీలోని జిపెంగ్ మిలిటరీ బేస్‌లో ఆగస్టు 3న ఈ ప్రయోగాలు మొదలవ్వగా.. ఆగస్టు 18న ముగియనున్నాయని వెల్లడించింది. సముద్ర తీరంలో డేంజర్ జోన్‌‌ తప్పించేందుకుగానూ విమానాలు, నౌకలను తైవాన్ ఉపయోగిస్తోందని వివరించింది.


కాగా ఇటివల కాలంలో ‘వన్ చైనా’ పాలసీ అని డ్రాగన్ దేశం చెబుతూ తైవాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా నాన్సీ పెలోసి పర్యటన నేపథ్యంలోనే చైనా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అంతటితో ఆగకుండా మిలిటరీ డ్రిల్స్ కూడా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Updated Date - 2022-08-06T22:47:13+05:30 IST